ఏపీలో ఓటర్ల జాబితా ప్రకటించిన ఎస్ఈసీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. వీరిలో మహిళా ఓటర్లు 2,04,71,506 మంది ఉండగా 1,99,66,173 మంది పురుష ఓటర్లు ఉన్నారు. సర్వీసు ఓటర్లు 66,844 మంది, థర్డ్ జెండర్లు 4,135 మంది ఉన్నట్లు వెల్లడించింది. 2021 జనవరి వరకు కొత్తగా 4,25,860 మంది ఓటర్లు పెరిగారని ఎస్ఈసీ పేర్కొంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఎస్ఈసీ నిర్ణయాన్ని, ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను కొట్టేసింది. కరోనా టీకా పంపిణీ ఎన్నికల నిర్వహణకు అడ్డొస్తుందని న్యాయస్థానం భావించింది. ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని అందువల్లే ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తున్నామని కోర్టు తేల్చి చెప్పింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.