మంగళవారం 04 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jun 16, 2020 , 16:44:03

అంబులెన్స్ లో మద్యం సీసాలు: ముగ్గురు అరెస్ట్

అంబులెన్స్ లో మద్యం సీసాలు: ముగ్గురు అరెస్ట్

అమరావతి: తెలంగాణలో తక్కువకు కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువకు అమ్ముకొని లాభం  పొందాలనుకొన్న ఓ ముగ్గురు అంబులెన్సులో మద్యం తరలిస్తూ పెద్దాపురం చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్న స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు ..వీరి నుంచి 107 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్నారు.

మార్చురీ నుంచి శవాలను బాక్సుల్లో పెట్టి తరలించే అంబులెన్సు వాహనంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం తరలిస్తున్నట్టుగా అందిన పకడ్బందీ సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో సభ్యులు తనిఖీలు చేపట్టారు. అర్థరాత్రి సమయంలో చడీచప్పుడు చేయకుండా శవాలను మోసుకురాకుండా వస్తున్న అంబులెన్స్ వాహనాన్ని పెద్దాపురం చెక్ పోస్టు వద్ద పోలీసులు నిలిపి తనిఖీలు చేపట్టారు. ఏమీ లేవని బుకాయించిన దుండగులు.. వాహనం వెనుక డోర్ తీసి శవాల పెట్టెలో  తీసుకెళ్తున్న మద్యం సీసాలను కనుగోవడంతో ముగ్గురు సభ్యులు జారుకొనేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకొన్న 107 మద్యం సీసాలను స్వాధీన పర్చుకొన్నట్టు నందిగామ డీఎసపీ జీవీ రమణమూర్తి తెలిపారు. అంబులెన్స్ తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర నుంచి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు వెళ్తున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. వీర్నపాటు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఏపీలో మద్యం ధరలు దాదాపు డబుల్ అవ్వడంతో... తెలంగాణలో మద్యాన్ని కొని అక్రమ మార్గంలో ఏపీకి తరలిస్తున్న కేసుల్లో మరొకటి చేరినట్లైంది.


logo