సోమవారం 21 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 14, 2020 , 12:29:17

దుమారం రేపిన సాధినేని యామిని వ్యాఖ్యలు .... కేసు నమోదు

దుమారం రేపిన సాధినేని యామిని వ్యాఖ్యలు .... కేసు నమోదు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామిని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆమె వ్యాఖ్యలను టీటీడీ సీరియస్‌గా తీసుకున్నది. ఆమెపై టీటీడీ విజిలెన్స్ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యామినిపై కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఐపీసీ 505(2), 500 సెక్షన్ల కింద ఆమె పై కేసు నమోదు చేశారు. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ చానల్‌లో రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని యామిని ఆరోపణలు చేశారు. ఈ పరిణామం హిందువులను మనోవేదనకు గురి చేస్తోందని ఆమె ఆరోపించారు.

హిందువులు ఇచ్చే కానుకలు, దానాలతో నడిచే టీటీడీ ఈ రకంగా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యామినిపై కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఇదే రకమైన విమర్శలు రావడంపై టీటీడీ వివరణ ఇచ్చింది. తిరుమలలో ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కటిన్నర గంట పాటు శ్రీవారి కల్యాణోత్సవం కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది.

అయోధ్య రామమందిర శంకుస్థాపన సమయంలో ఎస్వీబీసీలో కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారమవుతోందని వివరణ ఇచ్చింది. కల్యాణోత్సవ సేవా కార్యక్రమాన్ని ఎంతో మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తారని టీటీడీ తెలిపింది. కల్యాణోత్సవం కార్యక్రమం సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని ప్రసారం చేయడం లేదని స్పష్టం చేసింది. ఆ కార్యక్రమాన్ని మరుసటి రోజు ఎస్వీబీసీలో ప్రసారం చేస్తున్నామని టీటీడీ పేర్కొన్నది.


logo