e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News AP news | డిసెంబర్‌లో మార్కెట్లోకి పంచగవ్య ఉత్పత్తులు : టీటీడీ ఈవో

AP news | డిసెంబర్‌లో మార్కెట్లోకి పంచగవ్య ఉత్పత్తులు : టీటీడీ ఈవో

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తయారు చేయనున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్ లో మార్కెట్లోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన చాంబర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ..ఆయుష్ శాఖ నుంచి పంచగవ్య ఉత్పత్తులకు లైసెన్సులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

ఈ లోపు ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన డిజైన్ లు కూడా సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. ముడి పదార్థాల సేకరణ, యంత్రాలను సిద్ధం చేసుకుని యంత్రాల ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్, ఇంజినీరింగ్ పనులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కోయంబత్తూర్‌కు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు, సదరు సంస్థ 10 సంవత్సరాల పాటు ఆయుర్వేద ఉత్పత్తులు తయారుచేసి టీటీడీకి అందజేస్తుందని ఈవో వివరించారు.

- Advertisement -

ఫ్లోర్ క్లీనర్, సోపులు, షాంపూ, దంత మంజనం పౌడర్, ఆయుర్వేద అగరబత్తులు లాంటి ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు. వీటిలో టీటీడీ వాడగా, మిగిలినవి విక్రయాలకు పెట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 70 రకాల గో ఆధారిత ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఆయుష్ వద్ద లైసెన్సులు పొందే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు.

ఆయుర్వేద ఫార్మసీ లో ఇప్పటికే 115 రకాల మందులు తయారు చేస్తున్నట్లు ఈవో చెప్పారు. అనంతరం ఈవో గోసంరక్షణ శాల అధికారులతో మాట్లాడుతూ, తిరుపతిలోని గోశాల నుంచి భాకరాపేట, పలమనేరు లోని గోశాలలకు గోవుల తరలింపు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి కావాలన్నారు. అలాగే పలమనేరు గోశాల నుంచి కొన్ని గోవులను తిరుపతి గోశాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలన్నారు.

గిర్ ఆవుల కొనుగోలు కోసం కమిటీ ఈ నెలాఖరు లోపు గుజరాత్ వెళ్లి గిర్ ఆవుల కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతి లోని గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణానికి త్వరగా టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, పశువైద్య విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రవి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ ప్రొఫెసర్ వెంకట నాయుడు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana