నివర్ ఎఫెక్ట్ : భారీ వర్షానికి చిత్తూరు జిల్లా అతలాకుతలం

చిత్తూర్ : నివర్ తుఫాన్ ప్రభావంతో గురువారం చిత్తూర్ జిల్లాలోని పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. వదమాలపేట మండలంతోపాటు ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, రేణిగుంట మండలాలు వర్షం ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై చెరువులను తలపించాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వర్షం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కే కన్నాబాబు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాలోని 96 మండలాల్లో భారీ వర్షం కురిసింది. 7,772 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెల్లూర్, చిత్తూర్, ప్రకాశం, కడప, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 111 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. వర్షాల ధాటికి నెల్లూర్ జిల్లా ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైంది. తుఫాన్ తీరం ధాటి ఏపీలోకి ప్రవేశించడంతో ఇవాళ ఏపీలోని 200 మండలాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.