e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides కారా మాస్టారు ఇకలేరు

కారా మాస్టారు ఇకలేరు

కారా మాస్టారు ఇకలేరు
  • వయోభారంతో కాళీపట్నం రామారావు కన్నుమూత
  • తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సాహితీవేత్త
  • సీఎం కేసీఆర్‌తో సహా పలువురు ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌, జూన్‌ 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 8.20కు శ్రీకాకుళంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘సామాన్యుల జీవితాల్లోని వ్యక్తిగత, సామాజిక పార్శ్వాలను తన కథల ద్వారా విభిన్నంగా సృ్పశించిన గొప్ప రచయిత కారా’ అని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కారా మాస్టారుగా ప్రసిద్ధి చెందిన ఆయన పూర్తి పేరు కాళీపట్నం వెంకట సూర్యరామ సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఆయన 1924లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో జన్మించారు. విశాఖ సెయింట్‌ ఆంథోనీ హైస్కూల్‌లో చాలాకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి, 1979లో పదవీ విరమణ చేశారు. శ్రీకాకుళంలో 1997లో ‘కథానిలయం’ ప్రారంభించారు. 800 కథలతో ప్రారంభమైన కథా నిలయం ఇప్పుడు లక్ష పుస్తకాలతో అలరారుతున్నది. యువతకు గ్రంథాలయంగా, పరిశోధనా కేంద్రంగా ఉపయోగపడుతున్నది. కారా రచనలు సామాన్య, మధ్యతరగతి జీవితాల విజయాలను ప్రతిభింపచేసేవి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను విశ్లేషించడంలో దిట్ట. విప్లవ రచయితల సంఘంలో కార్యనిర్వాహక సభ్యుడిగానూ ఆయన కొనసాగారు.

ఎన్నెన్నో అవార్డులు.. మరెందరో శిష్యులు
కారా మాస్టారు తన రచనల ద్వారా తెలుగు సాహిత్యం కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేష కృషిచేశారు. 1964లో ఆయన రాసిన ‘యజ్ఞం’ కథల పుస్తకం విశేష ప్రజాదరణ పొందింది. యజ్ఞం పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఫ్యూడల్‌ వ్యవస్థలోని దోపిడీకి అద్దంపట్టిన ఈ పుస్తకం రష్యన్‌ భాషలోనూ అనువాదితమైంది. కారాను తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కతిక మండలి హంస అవార్డు, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డులు ఆయనను వరించాయి. 1993లో అమెరికాలో నిర్వహించిన తానా తెలుగు మహాసభలకు కారా మాస్టారు అతిథిగా హాజరయ్యారు. కారా మాస్టారు తన మొదటి లఘు కథ ‘చిత్రగుప్త’ను పోస్టుకార్డుపై రాశారు. అప్పట్లో అదో పెద్ద విశేషం. ఆయన 1955లో తన రచనలు ఆపేశారు. ఎనిమిదేండ్ల విరామం తర్వాత మళ్లీ 1963లో ‘తీర్పు’తో రచనా వ్యాసంగం ప్రారంభించారు. హదాశీర్వచనము, వీరుడు-మహావీరుడు, ఆదివారం, హింస, కుట్ర, నోరూమ్‌, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవనధార లాంటి అనేక రచనలు చేశారు. తొలినాళ్లలో వరుసగా కథలు రాశారు. కారా రచనలు ఇంగ్లిష్‌, రష్యన్‌ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. సరళమైన, భావ ప్రాధాన్య రచనల ద్వారా ఆయన ఎందరో శిష్యులను, అభిమానులను సంపాదించుకొన్నారు. కారా మాస్టారు రచనల స్పూర్తితోనే ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ రచనా వ్యాసంగం ప్రారంభించారు. కారా మాస్టారును యండమూరి తన గురువుగా సంభోందించేవారు.

పలువురు ప్రముఖుల సంతాపం
కారా మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సంతాపం ప్రకటించారు. వాస్తవికతను ప్రతిబింబించేలా కారా మాస్టారు రచనలు చేశారని జస్టిస్‌ రమణ కొనియాడారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షుడు సత్యారావు తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కారా మాస్టారుతో తనకున్న అనుబంధాన్ని అల్లం నారాయణ గుర్తుచేసుకొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కారా మాస్టారు ఇకలేరు

ట్రెండింగ్‌

Advertisement