మంగళవారం 07 జూలై 2020
Andhrapradesh-news - Jun 06, 2020 , 15:42:46

శ్రీశైలం మల్లన్న దర్శనానికి మార్గదర్శకాలు

శ్రీశైలం మల్లన్న దర్శనానికి మార్గదర్శకాలు

శ్రీశైలం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలల తర్వాత శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకొనేందుకు ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. అన్‌లాక్‌-1 లో ఈ నెల 8 నుంచి ఆలయాలను తెరువనున్నందున కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు అందిన వెంటనే భక్తుల దర్శనాలకు అనుమతిస్తామని కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు చెప్పారు .  ప్రతిరోజు స్వామి అమ్మవార్ల దర్శనాలతోపాటు ఆర్జిత సేవలలో మూడు వేల మంది భక్తులకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 

తొలుత శ్రీశైల దేవస్థానం ఉద్యోగులు, స్థానిక ప్రజలతో ప్రయోగాత్మకంగా స్వామి అమ్మవార్ల దర్శనాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లుచేశారు. స్వామి అమ్మవార్ల సన్నిధిలో బస చేయాలనుకొనేవారు మొదలుకుని ఆర్జిత సేవలు దర్శనాలు పొందుటకు ముందుగా www.srisailamonline.com లో తప్పనిసరిగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఈనెల 8, 9 తేదీల్లో దేవస్థాన ఉద్యోగులతోపాటు అర్చకులకు స్వామివారి దర్శనం ఉంటుంది. 10న స్థానిక భక్తులకు అనుమతిస్తారు. 11 నుంచి దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. రోజూ సుమారు 3 వేల ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులోకి తెచ్చారు. కంటైన్మెంట్‌ జోన్లలోనివారు,  65 ఏండ్ల వయసు పైబడిన వారు, పిల్లలకు దర్శనానికి అనుమతి లేదు. మాస్క్‌లు తప్పనిసరి ధరిస్తూ భౌతిక దూరం పాటించాలి. వసతి గదుల్లో ఇద్దరికి మాత్రమే ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నారు. క్యూలైన్లను ప్రతి రెండు గంటలకోసారి శానిటైజ్‌ చేస్తారు. స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలు కాకుండా ఆలయ ప్రాకారంలో గల పరివార దేవతల ఆలయాలకు దర్శనం ఉండదు.

 వైరస్‌ ప్రబలే అవకాశం ఉన్నందున శఠారి, తీర్థం ఇవ్వరు. పాతాళ గంగ వద్ద స్నానాలకు భక్తులకు ప్రత్యేక జాగ్రత్తలతో అనుమతించే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతిస్తారు. హుండీల్లో కానుకలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.  నిత్యాన్నదాన సత్ర నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం జరిపి తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు.


logo