గురువారం 01 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Aug 09, 2020 , 06:31:50

విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం..10 మంది కరోనా రోగులు మృతి

విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం..10 మంది కరోనా రోగులు మృతి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 10 మంది కొవిడ్‌ బాధితులు మృతి చెందినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సీపీ చెప్పారు

అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ సెంటర్‌లో మొత్తం 40 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 30 మంది కొవిడ్‌ బాధితులు, మరో 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దట్టంగా పొగలు అలుముకోవడంతో.. శ్వాస తీసుకోవడంలో బాధితులకు ఇబ్బందులు తలెత్తాయి. బాధితులందరినీ లబ్బీపేట, మెట్రోపాలిటన్‌ హోటల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించారు పోలీసులు. 

హోటల్‌లో మంటలు చెలరేగే సరికి అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసింది. కరోనా బాధితులను కాపాడేందుకు పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తమను రక్షించండి అంటూ బాధితులు కిటికీల్లో నుంచి కేకలు వేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మృతుల‌కు రూ. 50 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం

అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన మృతుల కుటుంబాల‌కు రూ. 50 ల‌క్ష‌ల చొప్పున సీఎం జ‌గ‌న్ ప‌రిహారం ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. ప్ర‌మాద‌స్థ‌లిని ఏపీ డీజీపీ స‌వాంగ్ ప‌రిశీలించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను విజ‌య‌వాడ సీపీ శ్రీనివాసులును డీజీపీ అడిగి తెలుసుకున్నారు.

రాష్ర్ట‌ప‌తి, ప్ర‌ధాని తీవ్ర దిగ్ర్భాంతి

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాష్ర్గ‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ఉప రాష్ర్ట‌ప‌తి వెంక‌య్య నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు.

తాజావార్తలు


logo