శుక్రవారం 07 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 13, 2020 , 17:45:23

తిరుపతి వెంకన్నకు అజ్ఞాత భక్తుడు భూరి విరాళం

తిరుపతి వెంకన్నకు అజ్ఞాత భక్తుడు భూరి విరాళం

తిరుపతి : తిరుమల కొండపై ఉన్న వెంకటేశ్వరస్వామికి ఒక అజ్ఞాత భక్తుడు భూరి విరాళం అందజేశాడు. శ్రీవారికి నైవేద్యంగా 20 బంగారం బిస్కెట్లను సమర్పించుకున్నాడు. శనివారం నాటి లెక్కింపులో ఈ బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని తిరుమల, తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఒక్కొక్క బిస్కెట్ రెండు కిలోగ్రాముల బరువుతో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ. 16.7 కోట్లు ఉంటాయని అధికారులు అంచనావేశారు. 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత నాలుగు నెలలపాటు తిరుమల దేవస్థానం మూసివున్నది. జూన్ 11 న ఆలయం తిరిగి తెరిచినప్పటి నుంచి ఇదే అతిపెద్ద విరాళం కావడం విశేషం. లాక్డౌన్ అనంతరం దేవస్థానం తెరిచిన తర్వాత నుంచి నేటి వరకు సుమారు 2.5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటున్న 67,000 మంది యాత్రికులు వివిధ కారణాల వల్ల పూజకు రాలేదని అధికారులు చెప్పారు 

ఆలయ సిబ్బందికి కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా కరోనా కేసులు వస్తున్నాయి. దీని ప్రభావం తిరుమల ఆలయంపై కూడా పడింది. ఆలయంలోనే పనిచేస్తున్న ఉద్యోగులలో 91 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 3,569 మంది ఉద్యోగులను పరీక్షించారు. ఉద్యోగులలో కరోనా వైరస్ వ్యాప్తిని కనుగొన్న తర్వాత నిర్వహణ మరింత అప్రమత్తంగా చేపడుతున్నారు.


logo