ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 09, 2020 , 21:20:00

మరో ఐదు రోజులు శ్రీశైలంలో దర్శనాలు బంద్

మరో ఐదు రోజులు శ్రీశైలంలో దర్శనాలు బంద్

శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలను మరో ఐదు రోజుల పాటు నిలిపివేశారు. ఆలయం పరిసరాల్లో వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో మరో ఐదు రోజులు వేచిచూసిన తర్వాత దర్శనాలు కల్పించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. క్షేత్ర పరిధిలో విస్తరిస్తున్న కరోనా కొవిడ్ వ్యాధి లక్షణాలను అరికట్టేందుకు ఇప్పటికే 25 రోజులుగా భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా తీసుకున్న చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారు. 

ఆలయం పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు నిబంధనలు పాటించే విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే కట్టడి సాధ్యమని ఆలయ ఈవో కేఎస్ రామారావు అన్నారు. ఆదివారం తాసిల్దార్ రాజేంద్రసింగ్, ఎస్సై హరిప్రసాద్, ఆలయ భద్రతా అధికారి శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనిల్ కుమార్, సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం మరో ఐదు రోజులపాటు స్వామి, అమ్మవార్ల దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్లో ఉంటూ వైద్యులకు అందుబాటులో ఉండి

చికిత్స పొందాలని కోరారు. క్షేత్ర పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్, సెక్యూరిటీ సిబ్బందికి సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో నిత్యపూజలు, పరోక్ష సేవలు యథావిధిగా సాగుతాయని స్పష్టం చేశారు. 


logo