బుధవారం 21 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 19, 2020 , 22:51:01

అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలి : ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్

 అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలి : ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్

ఢిల్లీ : అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజ్యసభలో కోరారు. ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజ్యసభలో మాట్లాడుతూ.. 'అమరావతిలో చంద్రబాబు నాయుడు ధనవంతులకే స్థలాలిచ్చారు. అక్కడ పేదలకు కూడా ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రయత్నించారు. అలాంటి ప్రయత్నాలను న్యాయస్థానాలు సైతం అడ్డుకోవడం సరికాదు. పేదవాళ్లు, పెద్దవాళ్ల పక్కన నివాసం ఉండడానికి అనర్హులా..?. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు ఇదేనా..?. అందుకే ఆ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతున్నాం. అంతర్వేదిలో దేవుడి రథం విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అంతర్వేది ఆలయం శిథిలావస్థలో ఉంటే దాన్ని మాజీ సీఎం వైఎస్సార్‌ అభివృద్ధి చేశారు. మా సీఎం దృష్టిలో అందరూ సమానమే. బడుగు వర్గాలకు చెందిన మేమిద్దరం ఇక్కడ ఎంపీలుగా నిలబడ్డమే అందుకు నిదర్శనం. కొందరు విబేధాలు రెచ్చగొట్టేందుకు ఎవరో కొందరు చేసిన పనిని సీఎంకు ఆపాదించడం దురదృష్టకరం. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరుతున్నాం. న్యాయమూర్తులపై నిందారోపణలున్నాయి. కాబట్టి కచ్చితంగా సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది' అని పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ అన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo