శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 22:05:04

పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !

పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !

అమరావతి : పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణంగా సమాచారం. మదనపల్లి జంట హత్యల కేసులో రిమాండ్‌ రిపోర్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం హత్యలకు పెద్ద కుమార్తె అలేఖ్య కారణంగా తెలుస్తోంది. చెల్లి దివ్య ఇటీవల మంత్రపు ముగ్గు తొక్కినట్లుగా భావించింది. మరుసటిరోజు నుంచే దివ్య అనారోగ్యం పాలైంది. అప్పటినుంచి చనిపోతాననే భయంలో దివ్య ఉంది. దీనికి తోడు దివ్యను చనిపోమని అక్క అలేఖ్య ప్రోత్సహించింది. దివ్యకు ఈ నెల 23న భూత వైద్యం చేయించారు. 24న వింతగా ప్రవర్తించింది. దీంతో దెయ్యాన్ని పారద్రోలుతామంటూ కుటుంబ సభ్యులు వేపాకులతో కొట్టారు. ఈ క్రమంలో భాగంగానే దివ్య తలపై తల్లిదండ్రులు డంబెల్‌తో తీవ్రంగా కొట్టి చంపారు. ఇందుకు అలేఖ్య కూడా సహకరించింది.

అనంతరం తనను కూడా చంపాలని అలేఖ్య కోరింది. ఏ మాత్రం భయం లేకుండా చనిపోవడానికి సిద్ధమైంది. తానూ చనిపోయి చెల్లిని బతికిస్తానని చెప్పింది. అంతకుక్రితం ఇంట్లో పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగాలు చేసిన కుక్కను చంపి మళ్లీ బతికించానని నమ్మించింది. అలేఖ్య మాటలు తల్లిదండ్రులు నమ్మారు. పూజ గదిలో అలేఖ్య అర గుండు చేసుకుంది. నోటిలో రాగి చెంబు పెట్టుకుని పూజగదిలో కూర్చుంది. దివ్యను హత్య చేసిన అనంతరం 24వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు అలేఖ్యను కూడా డంబెల్‌తో కొట్టి చంపారు. పునర్జన్మలపై విశ్వాసమే హత్యలకు కారణమని రిమాండ్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

VIDEOS

logo