శుక్రవారం 04 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 27, 2020 , 14:28:52

బెజవాడ కనక దుర్గమ్మ ఆదాయం రూ.4.36 కోట్లు

బెజవాడ కనక దుర్గమ్మ ఆదాయం రూ.4.36 కోట్లు

అమరావతి : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 2 లక్షల మంది బెజవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో దేవస్థానానికి రూ.4.36 కోట్ల ఆదాయం వచ్చిందని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పైలా సోమినాయుడు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించామని... కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చక్కగా సహకరించారని ఆయన అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలను చక్కగా నిర్వహించగలిగామని చెప్పారు.

కొండచరియలు విరిగిపడిన ఘటనపై స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దేవాలయ అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దుర్గమ్మ దేవస్థానానికి 85 వేల మంది ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే, వారిలో దాదాపు 35 వేల మంది దర్శనానికి రాలేకపోయారని ఆయన తెలిపారు. నేరుగా వచ్చే భక్తుల కోసం కరెంట్ బుకింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. అభివృద్ధి పనులకు త్వరితగతిన అంచనాలను రూపొందించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించారని పైలా సోమినాయుడు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.