ముంబై: సర్ రవీంద్ర జడేజా.. ఇండియన్ టీమ్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ జడేజాను అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు ఇది. సర్ రవీంద్ర జడేజా పేరుతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో అకౌంట్లు కూడా ఉన్నాయి. అయితే అభిమానులు ముద్దుగా అతన్ని అలా పిలుచుకున్నా.. ఇండియన్ టీమ్‌లో మాత్రం జడ్డూకి మరో నిక్ నేమ్ ఉంది. ఆ పేరేంటో ఇప్పుడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి రివీల్ చేశాడు.
ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై అతని ఆట చూసిన తర్వాత రవి ట్వీట్ చేశాడు. ఇందుకే కదా మేము అతన్ని గ్యారీ జడేజా అని పిలిచేది. అద్భుతమైన ఆట అంటూ రవిశాస్త్రి ఆ ట్వీట్లో చెప్పాడు. ఇంతకీ అతన్ని గ్యారీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? 1950, 60ల్లో విండీస్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టిన లెజెండరీ క్రికెటర్, ఆల్‌రౌండర్ గ్యారీ సోబర్స్‌తో పోలుస్తూ జడేజాను అలా ముద్దుగా పిలుచుకుంటారు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో అదరగొట్టే ఆల్‌రౌండర్లు క్రికెట్ చాలా అరుదుగా కనిపిస్తారు. అప్పట్లో గ్యారీ సోబర్స్.. ఆ తర్వాత కపిల్ దేవ్, ఇమ్రాన్‌ఖాన్, ఇయాన్ బోథమ్, రిచర్డ్ హ్యడ్లీ.. మొన్నమొన్నటి వరకూ జాక్ కలిస్.. ఇక సమకాలీన క్రికెట్లో జడేజా మాత్రమే ఆల్‌రౌండర్ పాత్రకు పరిపూర్ణ న్యాయం చేశారు.
ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 37 పరుగులతోపాటు కేవలం 28 బంతుల్లో 62 పరుగులు చేసిన జడేజా తర్వాత బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు. డాన్ క్రిస్టియన్‌ను రనౌట్ చేశాడు. అతని పర్ఫార్మెన్స్ చూసి ప్రత్యర్థి కెప్టెన్ కోహ్లి కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఒక్కడే మమ్మల్ని ఓడించాడు. అతడేంటో మరోసారి తెలిసింది. మరో రెండు నెలల్లో అతడు ఇండియన్ టీమ్‌కు ఆడతాడు. టీమ్‌లో ప్రధాన ఆల్‌రౌండర్ ఇలా ఆడుతుండటం మాకు సంతోషం కలిగించేదే అని కోహ్లి అన్నాడు.