అమరావతి : వైసీపీ( YCP ) ఐదేళ్ల పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ ( Economy ) సర్వనాశనమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu ) ఆరోపించారు. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టపోయామని పేర్కొన్నారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో చంద్రబాబు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మూడు లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని వివరించారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల పేర్లను నమోదు చేస్తున్నామని, నిరుపేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.
ఇంటిపై సౌర ఫలకలు పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇప్పటికే పలు ఇళ్లు, పొలాల్లో సోలార్ విద్యుత్‌తో కరెంటు తయారు చేయిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమలో 90శాతం రాయితీకి డ్రిప్ పరికరాలు అందించామని గుర్తు చేశారు. నదుల అనుసంధానం తన జీవితాశయమని, దీని వల్ల రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయని వివరించారు. తాగునీటి ప్రాజెక్టులపై ఏనాడు నిర్లక్ష్యంగా ఉండనని అన్నారు.