బుధవారం 24 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 23, 2021 , 13:48:47

ఎన్నికల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకోవాలా? : ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు

ఎన్నికల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకోవాలా? : ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు

అమరావతి : ఎన్నికల్లో పాల్గొని ఉద్యోగులు ప్రాణాలు పోగోట్టుకోవాలా? అని ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్నాయని, వైరస్‌తో చాలా మంది ప్రజలు చనిపోతున్నారన్నారు. వ్యాక్సిన్‌ ఇప్పుడిప్పుడే వచ్చిందన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉద్యోగులకు వ్యాక్సిన్‌ అవసరమన్నారు. రెండు నెలల్లో నెలల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఉద్యోగుల పట్ల ఎస్‌ఈసీ వైఖరి సరిగా లేదని విమర్శించారు. ఎస్‌ఈసీ వ్యాఖ్యాలు తమను చాలా బాధించాయన్నారు. ఇప్పటికే ఆరోగ్యం బాగా లేక సెలవులో ఉంటే ఉద్యోగిని తొలగించారని, ఇంకా ఎంత మంది ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఉద్యోగులు చేసిన సేవలను మరిచిపోతున్నారన్నారు. ప్రాణాలు కాపాడమని వేడుకుంటే చర్యలు తీసుకుంటారా? అన్నారు.

మీరు అద్దం చాటున ఉండి ప్రెస్‌మీట్‌ నిర్వహించారని, తాము ఎన్నికల విధుల్లో పాల్గొని మా ప్రాణాలు పోగొట్టుకోవాలా? అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఎన్నికలు జరుగలేదు.. ఇప్పుడు అత్యవసరమా?, మమ్మల్ని చంపి శవాలపై ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నారు. మీరు రిటైర్డ్‌ అయితే మీ కంటే గొప్పవాళ్లు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తారని, మాకు వ్యాక్సిన్‌ ఇప్పించాకే ఎన్నికలు నిర్వహించండని సూచించారు. జీహెచ్‌ఎంసీ, కేరళ ఎన్నికల సమయంలోనూ కరోనా కేసులు పెరిగాయని చెప్పారన్నారు. ఎన్నికలతో పాటు వ్యాక్సిన్‌ అవసరమేనని హైకోర్టు చెప్పిందని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వెళ్లాలని ఎస్‌ఈసీకి సూచించిందని.. అయినా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వెళ్తున్నారని ఆరోపించారు. అవసరమైతే ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఇంప్లీడ్‌ పిటీషన్‌ వేశామని చెప్పారు. 

VIDEOS

logo