e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home Top Slides ఆనందయ్యది నాటుమందు

ఆనందయ్యది నాటుమందు

ఆనందయ్యది నాటుమందు
  • ఆయుర్వేదం కాదు.. హానికరమూ కాదు
  • వంశపారంపర్య వైద్యంగా గుర్తించాం
  • ఏపీ ఆయుష్‌ కమిషనర్‌ రాములు వెల్లడి

హైదరాబాద్‌, మే 23 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందు ను నాటు మందుగా గుర్తించినట్టు ఏపీ ఆయుష్‌శాఖ కమిషనర్‌ కర్నల్‌ రాములు తెలిపారు. కృష్ణపట్నంలో రెండ్రోజులపాటు రాములు నేతృత్వంలో పర్యటించిన ఆయుష్‌ బృందం ఆనందయ్య తయారుచేస్తున్న మందును పరిశీలించింది. అంతకుముందే హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో పరీక్షించిన మందు నమూనా ఫలితాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆనందయ్య ఇచ్చిన వివరాల ఆధారంగా దానిని నాటు మందుగా గుర్తించామని తెలిపారు. కొంతమంది వంశపారంపర్యంగా అందిస్తున్న వైద్యంలో ఇదొకటని పేర్కొన్నారు. ఈ మందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని స్పష్టంచేశారు. ఎవరికివారు ఆలోచించి దీనివాడకంపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కర్నల్‌ బృందం తొలిరోజు మందుకోసం వచ్చినవారితోపాటు, దానిని వాడినవారి అభిప్రాయాలను సేకరించింది. వారంతా మందు వినియోగంపై సానుకూలత వ్యక్తంచేసినట్టు సమాచారం. ఆనందయ్య మందు తయారీలోవాడే మూలికలన్నీ ఆయుర్వేదంలో వినియోగించేవే అయినప్పటికీ దానిని ఆయుర్వేదమందుగా పరిగణించలేమని చెప్పారు. ఇక్కడి పరిస్థితులతోపాటు, తిరుపతి, విజయవాడలోని ఆయుర్వేద వైద్యుల సహాయంతో నివేదికను తయారుచేసి ఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్స్‌కు పంపిస్తామని వెల్లడించారు.
ఐ డ్రాప్స్‌తోనూ ఇబ్బందుల్లేవు
మందుతయారీ విధానాన్ని బహిరంగపర్చేందుకు ఆనందయ్య అంగీకరించారని కర్నల్‌ రాములు తెలిపారు. ఆయ న ఇచ్చే ఐ డ్రాప్స్‌లో ఎలాంటి హానికారకాలు లేవని.. తేనె, ముళ్ల వంకాయ, తోక మిరియాల మిశ్రమంతో దానిని తయారుచేస్తున్నారని వెల్లడించారు. ఐ డ్రాప్స్‌ వల్ల ఇబ్బందులు ఉండవని ఆయుర్వేద వైద్యుల బృందం నిర్ధారించిందని చెప్పారు. ఆనందయ్య వాడుతున్న వివిధ పదార్థాల మిశ్రమంతో ఎలాంటి ఎఫెక్ట్‌ ఉండదని నిర్ధారణ అయినట్టు తెలిపారు. కృష్ణపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు తక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా ఒక్కమరణం సంభవించలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అనుమతి రాగానే ఔషధం తయారీ ప్రక్రియ
ఆనందయ్య మందుకు కేంద్రం నుంచి అనుమతి లభిస్తే వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తిరుపతి ఆయుర్వేదిక్‌ ఆసుపత్రివర్గాలు తెలిపాయి. కరోనా చికిత్సలో భాగంగా కంటిలో మందు వేసే ప్రక్రియను ఆయుర్వేదం స్వాగతిస్తున్నదని చెప్పాయి. శనివారం కృష్ణపట్నంలో పర్యటించిన తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద భోధనాసుపత్రి వైద్యులబృందం ఆదివారం సమావేశమైంది. టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.2 కోట్లు విడుదలైనట్టు టీటీడీ పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.

నన్నెవరూ అరెస్టుచేయలేదు: ఆనందయ్య
తనెనవరూ అరెస్టు చేయలేదని.. రెండ్రోజులుగా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నానని కృష్ణపట్నం వైద్యుడు ఆనందయ్య తెలిపారు. రెండ్రోజులుగా ఆయుష్‌, ఎంసీఐఆర్‌ అధికారుల తనిఖీల నేపథ్యంలో పోలీసు రక్షణలోఉన్న ఆయన ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఈ మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వంతోపాటు స్థానిక ఎమ్మెల్యే సహకరించారని చెప్పారు. త్వరలోనే అందరికీ ఆయుర్వేదమందును తయారీచేసి అందజేస్తానని ప్రకటించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆనందయ్యది నాటుమందు

ట్రెండింగ్‌

Advertisement