మంగళవారం 11 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 12, 2020 , 17:23:56

మాస్కు తెచ్చిన గొడవ.. యువతి మృతి

మాస్కు తెచ్చిన గొడవ.. యువతి మృతి

గుంటూరు: మాస్కు తెచ్చిన గొడవ ఓ యువతి ప్రాణం తీసింది. ఈ సంఘటన జూలై 3న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా రెంటచింతలలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని రెంటచింతలకు చెందిన కర్ణాటి యలమంద మాస్కు లేకుండా వీధుల్లో తిరుగుతుండగా కొందరు యువకులు అభ్యంతరం తెలిపారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. 

కొద్దిరోజుల తర్వాత సదరు యువకులు ఫేస్‌మాస్కులు లేకుండా మార్కెట్‌లో తిరుగుతుండగా యలమంద బంధువులు గుర్తించారు. వెంటనే వారిని అడ్డగించి, అభ్యంతరం తెలిపారు. ఇది తీవ్ర వాదనకు దారితీసింది. ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగింది. యువకులు ఎలమందపై కర్రలతో దాడి చేసేందుకు రాగా, అతడి కూతురు కర్ణాటి ఫాతిమా అడ్డుగా వచ్చింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను గుంటూరు జనరల్‌ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతిచెందింది. బాలిక తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు యువకులపై హత్య కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

కాగా, ఫేస్‌మాస్క్‌ ధరించాలని సలహా ఇచ్చినందుకు గత నెలలో నెల్లూరు జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి దివ్యాంగురాలైన మహిళా సహోద్యోగినిపై దాడి చేశాడు. పోలీసులు ఆ ప్రభుత్వ అధికారిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన జూన్‌ 27న నెల్లూరులోని పర్యాటక శాఖ కార్యాలయంలో జరిగింది. అయితే, సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన షాకింగ్‌ విజువల్స్‌ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి రావడం గమనార్హం. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo