శుక్రవారం 07 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 05, 2020 , 21:02:34

ఏపీలో 470 మంది పోలీసులకు కరోనా

ఏపీలో 470 మంది పోలీసులకు కరోనా

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా వైరస్‌ కేసులు బయటపడుతున్నాయి. అందునా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులకు కూడా కరోనా సోకుతున్నది. ఇప్పటివరకు దాదాపు 470 మంది పోలీసులు ఈ వ్యాధికి గురైనట్లు ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సావాంగ్ తెలిపారు.

ఆదివారం 'మీట్-ది-ప్రెస్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లాక్‌డౌన్ సమయంలో బాగా పనిచేసిన పోలీసుల సేవలను ప్రశంసించారు. కొవిడ్ -19 కి సంబంధించి రాష్ట్రం హైఅలర్ట్‌లో ఉన్నదని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువ సంఖ్యలోనే కేసులు ఉన్నాయని చెప్పారు. 55 ఏండ్ల వయసు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలు కేటాయించడం లేదని, వారికి వేరే విధులను అప్పగిస్తున్నామని తెలిపారు. కరోనాతో బాధపడుతున్న పోలీసులు సంఖ్య పెరుగుతున్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు చెప్పారు. ఇంటి నుంచి విధులకు వచ్చే ముందు, తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, సరైన ఆహారం తీసుకొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఎవరైనా పోలీసులు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఉంటే వెంటనే పైఅధికారులకు సమాచారం ఇచ్చి తగిన చికిత్స తీసుకోవాలన్నారు. మనం చేసే అలక్ష్యం కారణంగా మరెందరికో ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటున్నందున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo