సోమవారం 03 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 07, 2020 , 21:53:30

అన్ని జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాలి : టిటిడి అద‌న‌పు ఈవో

అన్ని జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాలి : టిటిడి అద‌న‌పు ఈవో

తిరుమల : సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ సుంద‌రకాండ ప్ర‌థ‌మ సర్గ సంపూర్ణంగా 211 శ్లోకాల‌తో అఖండ పారాయ‌ణం నిర్వ‌హించిన‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అన్నారు. తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌‌వారం ఉద‌యం జరిగిన సుంద‌ర‌కాండ ప్ర‌థ‌మ సర్గ  అఖండ పారాయ‌ణంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిన‌ప్ప‌టి నుండి తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై “యోగ‌వాశిష్ఠం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” ను 62 రోజుల పాటు పారాయ‌ణం చేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌పంచాన్ని క‌రోనా నుండి ర‌క్షించేందుకు ప్ర‌ముఖ పండితుల సూచ‌నల మేర‌కు జూన్ 11వ తేదీ నుండి సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభించామ‌న్నారు.

ఇందులోని శ్లోకాల‌ను భ‌క్తుల‌తో ప‌లికించి అర్థ‌ తాత్ప‌ర్యాల‌తో పాటు ఆ శ్లోక ఉచ్చా‌‌ర‌ణ వ‌ల‌న క‌లిగే ఫ‌లితం, నేటి ఆధునిక స‌మాజంలోని మాన‌వాళికి ఏవిధ‌‌మైన సందేశం ఇస్తుందో వివ‌రిస్తూ ప్ర‌తి రోజు 10 శ్లోకాల‌ను నిరంత‌రాయంగా ప‌ఠించామ‌న్నారు.  వాల్మీకి మ‌హ‌ర్షి రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ ప్ర‌థ‌మ స‌ర్గలో చెప్పిన విధంగా హ‌నుమంతుడు మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తం నుండి లంఘించి సముద్రాన్ని దాటుకుంటూ కార్య‌దీక్ష‌తో అవిశ్రాంతంగా ప్ర‌యాణించి లంక‌కు చేరుకున్నాడ‌ని చెప్పారు.

అదేవిధంగా, ప్ర‌థ‌మ‌స‌ర్గ‌లోని 211 శ్లోకాల‌ను అవిశ్రాంతంగా ప‌ఠించిన‌ట్లు వివ‌రించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల హ‌నుమంతుడు సంతోషిస్తాడని, త‌ద్వారా శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అవ‌తార‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌రుడు ప్ర‌స‌న్న‌మై క‌రోనా వ్యాధిని మాన‌వాళి నుండి దూరం చేస్తాడ‌న్నారు. అఖండ పారాయ‌ణంలో 108 మంది వేద పండితులు, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, 58 మంది రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్న‌ట్లు తెలిపారు.


logo