గురువారం 03 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Jul 04, 2020 , 22:46:48

టీడీపీ నేతలు జీర్జించుకోలేకపోతున్నారు : మంత్రి కన్నబాబు

టీడీపీ నేతలు జీర్జించుకోలేకపోతున్నారు : మంత్రి కన్నబాబు

అమరావతి : అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని వికేంద్రీకరణ చేస్తుంటే, టీడీపీ నేతలు జీర్జించుకోలేకపోతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా రోడ్లపైకి రాని చంద్రబాబు కుటుంబం.. ఇప్పుడు వేల కోట్ల స్పప్నం తరలిపోతుందనే వేదనతో బయటకొస్తుందని విమర్శించారు. 200 రోజుల నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చే స్తున్నదని, కానీ వాస్తవాలు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతాయన్నారు. చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కొని రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

రాజధాని ప్రాంత రైతులకు కౌలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు చెల్లించారని గుర్తుచేశారు. అమరావతి సమస్యను అంతర్జాతీయ సమస్యగా సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. 23 గ్రామాల రాజధాని ఉద్యమం ఇప్పుడు మూడు గ్రామాల ఉద్యమంగా మారిందన్నారు. రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అమరావతి గ్రాఫిక్‌ డిజైన్ల కోసం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబుకు రాజధాని ప్రాంత రైతుల కౌలు ఇవ్వడానికి మనసు రాలేదని విమర్శించారు.