మంగళవారం 07 జూలై 2020
Andhrapradesh-news - May 29, 2020 , 23:02:23

రేపు ఏపీలో ప్రారంభం కానున్న రైతు భరోసా కేంద్రాలు

 రేపు ఏపీలో ప్రారంభం కానున్న రైతు భరోసా కేంద్రాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేపు రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. వ్యవసాయ రంగం అభివృధ్ధి చేయడం ద్వారానే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తోందని మహాత్మా గాంధీజీ పేర్కొన్నారు . ఈ క్రమంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. రైతుల దగ్గరే స్వయంగా పంటలు కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయశాఖ సూచనలు, సలహాలతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. రైతుభరోసా కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్, ఇంటర్ ఫేస్, ఇంటర్ వెన్షన్ సిస్టమ్ తో పాటుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ రంగాలశాఖల అధికారుల సూచనలు, సలహాలను రైతులు నేరుగా స్వీకరించవచ్చు.

నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, రసాయన ఎరువులు అందించే సంస్థగానే కాకుండా రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేయనున్నాయి. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలవనున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకుడు, సెరికల్చర్, ఫిషరీస్ అసిస్టెంట్స్ అందుబాటులో ఉంటారు. రైతు భరోసా కేంద్రాలకు మార్కెటింగ్ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. రైతు భరోసా కేంద్రాలలో ఉండే వారు ప్రతిరోజు పంటకు గిట్టుబాటు ధరలను పరీక్షించడం, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం వంటి అంశాలను సమీక్షించి సంబంధించిత డేటాను పై అధికారికి పంపడం ద్వారా మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షణ ‌జరపనుంది. అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌ లు, టీవీలు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటుతో రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేయనున్నాయి.రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తల నుంచి వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు పొందవచ్చు . 


logo