ఆదివారం 12 జూలై 2020
Andhrapradesh-news - May 28, 2020 , 21:21:28

రైతులకు అండగా నిలబడే ప్రభుత్వం మాది: మంత్రి కన్నబాబు

 రైతులకు అండగా నిలబడే ప్రభుత్వం మాది: మంత్రి కన్నబాబు

అమరావతి: రైతు సంక్షేమం కోసం నిలబడే ప్రభుత్వం తమదని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఆయిల్ ఫామ్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం లో ఉన్నదని తెలిపారు. గత కొంత కాలంగా ఆయిల్ ఫామ్ రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిన తరుణంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఆదుకున్న విషయాన్ని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. కంపెనీ యాజమాన్యం, రైతు ప్రతినిధులు, పెదవేగి ఆయిల్ ఫామ్ కు కొత్తగా నియమించిన ఛైర్మన్, ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు మంత్రి వెల్లడించారు. 

 ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విధంగా ఆయిల్ ఫామ్ రైతులకు మేలు చేయాల్సిన వైఖరిని ఈ సమావేశంలో కంపెనీ యాజమాన్యాలకు తెలియజేశామన్నారు. తమ ప్రభుత్వం నూటికి నూరుశాతం రైతు సంక్షేమం కోసం నిలబడుతుందన్నారు. రైతుకే తొలి ప్రాధాన్యత తప్ప మరో ప్రాధాన్యత లేదనేది ముఖ్యమంత్రి నిర్ణయమని మంత్రి  స్పష్టం చేశారు. రైతులకు మేలు చేయాలని ఇందుకోసం  ప్రభుత్వం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయిల్ ఫామ్ రైతుల పంటలకు ఇప్పుడిస్తున్న ధర తక్కువగా ఉందని, తెలంగాణా ఓఈఆర్(Oil Extraction Rate)  రేటు కన్నా మన ఓఈఆర్ రేటు తక్కువగా  ఉండటం వలన మన రాష్ట్ర  రైతులు నష్ట పోతున్న  పరిస్థితి ఉందనే విషయాన్ని ఆ సంస్థలకు చెప్పామన్నారు. గతేడాది  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.84 కోట్లు ఆయిల్ ఫామ్ రైతులకు చెల్లించి, తెలంగాణాకు, ఆంధ్రాకు ఉన్న ఓఈఆర్ శాతం ఆ గ్యాప్ ను సరిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.


logo