శనివారం 08 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 13, 2020 , 09:58:13

రేషన్‌ డోర్‌డెలివరీ చేసేందుకు 2.60 లక్షల క్లస్టర్లు

రేషన్‌ డోర్‌డెలివరీ చేసేందుకు 2.60 లక్షల క్లస్టర్లు

అమరావతి : ఏపీలో రేషన్ సరుకులను డోర్‌ డెలివరీ చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ పద్ధతిని పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెట్టి దానిలోని లోపాలు, సరిదిద్దాల్సిన అంశాలపై అధ్యయనం చేశారు. ఈ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు క్లస్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం పేర్కొంటోంది. 

పేదల ఇండ్లకే రేషన్‌ సరుకులను డెలివరీ చేసేందుకు రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,93,488 క్లస్టర్లున్నాయి. 50 నుంచి 75 కుటుంబాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు, అవినీతికి తావులేకుండా ఈ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్లస్టర్లకు స్థానిక వలంటీర్లు సేవలందిస్తారు. ఇప్పటికే వాళ్లు మ్యాపింగ్‌ను పూర్తి చేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ అమల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో గడప దాటకుండా సరుకులు ఇంటికొచ్చాయని స్థానికులు అంటున్నారు. ఈ విధానం మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

క్లస్టర్‌ పరిధిలో ఉన్న కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఎదుటే  బియ్యం తూకం వేసి ఇస్తారు. దీని కోసం 13,370 మొబైల్‌ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంటి వరకు చేర్చే అదనపు బాధ్యతను కూడా ప్రభత్వమే తీసుకుంటుంది. బియ్యంలో కల్తీ జరుగకుండా గోడౌన్ల నుంచి నేరుగా బియ్యం తీసుకొచ్చి బార్‌ కోడ్‌ ఆధారంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo