బుధవారం 05 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 07, 2020 , 21:05:53

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మంది అరెస్ట్‌

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మంది అరెస్ట్‌

విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్‌ కేసులో మంగళవారం పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ సీఈవో సున్‌కి జియాంగ్‌, డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పీపీసీ మోహన్‌రావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తుది నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో కమిటీ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ నాలుగువేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.

యాజమాన్యం నిర్లక్ష్యంతో స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారి తీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది. విశాఖలో జరిగింది కేవలం గ్యాస్‌ లీకేజీ మాత్రమే కాదని స్టైరిన్‌ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని తెలిపింది. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడడం చాలా కీలకమైన విషయమని, అయితే కంపెనీ ఈ విషయంలో తీవ్ర తప్పిదం చేసిందని వెల్లడించారు. 2019 డిసెంబర్‌లో రిఫ్రిజిరేషన్‌ పైపులు మార్చారని, దీంతో కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామని చెప్పారు. కాగా, విశాఖలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7న వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo