ఏపీ స్పీకర్‌గా తమ్మినేని బాధ్యతల స్వీకరణ

Thu,June 13, 2019 12:40 PM

YSRCP MLA Tammineni Sitaram takes charge as AP Speaker

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం బాధ్యతలను స్వీకరించారు. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన్న వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. అనంతరం తమ్మినేని సీతారాంను స్పీకర్‌ చైర్‌ వద్దకు సీఎం జగన్‌, టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు, జనసేన నుంచి రాపాక కలిసి తీసుకెళ్లారు. ఆ తర్వాత స్పీకర్‌ తమ్మినేని చైర్లో కూర్చోబెట్టి.. సీఎం జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.

సీతారాం కళింగ(బీసీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1983లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1991, 1994, 1999, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 1979-80 జిల్లా బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సేవలందించారు. 1985లో ప్రభుత్వ విప్‌గా, 1994లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. తరువాత 1995లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1999లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై తమ్మినేని సీతారాం 13,856 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీతారాంకు 77,233 ఓట్లు వచ్చాయి. కూన రవికుమార్‌కు 63,377 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి పేడాడ రామ్మోహన్‌రావు మూడో స్థానంలో, కాంగ్రెస్‌ అభ్యర్థిని బొడ్డేపల్లి సత్యవతి నాలుగో స్థానంలో నిలిచారు.

1941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles