చంద్రబాబువి శవ రాజకీయాలు : ఎమ్మెల్యే అంబటి

Fri,September 20, 2019 05:57 PM

తాడేపల్లి : వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణానంతరం చంద్రబాబు చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. కోడెల 16వ తేదీన మరణిస్తే.. 19వ తేదీ వరకు చంద్రబాబు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి.. శివప్రసాద్‌ది ఆత్మహత్య కాదు, హత్య అని ప్రజలను నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మనిషి చనిపోతే భావోద్వేగం వస్తది.. కానీ చంద్రబాబులో ఎక్కడ భావోద్వేగం కనిపించలేదు.


నాలుగు రోజుల పాటు కోడెల శవాన్ని అడ్డుగా పెట్టుకుని పొలిటికల్‌గా ఎంత మైలేజ్ తెచ్చుకోవాలనే తాపత్రయం బాబులో కనిపించిందని అంబటి రాంబాబు తెలిపారు. అసెంబ్లీలోని కోట్ల రూపాయాల విలువ చేసే ఫర్నిచర్‌ను ఎత్తుకుపోయి.. ఇప్పుడు చంద్రబాబు లక్ష రూపాయాల ఫర్నిచర్ అంటున్నారు. కోడెల మరణం వైసీపీ వారి వల్ల జరిగిందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పత్రాలు లీక్ అయిందనడం వాస్తవం కాదు.. ఒక వేళ పరీక్ష పత్రం లీకైతే ఆరోజే వార్త రావాలి. కానీ ఫలితాలు విడుదలైన రోజు వార్త రావడం ఏంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles