2019 ఎన్నికల్లో పోటీ చేస్తా : పవన్ కళ్యాణ్

Thu,November 10, 2016 04:56 PM

Pawan Kalyan will contest in 2019 elections

అనంతపురం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అనంతపురంలో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తానని ఉద్ఘాటించారు. హామీలు వినీ వినీ విసిగిపోయిన తమ భావావేశాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు.. ఉద్రేకాలు పెరిగే స్థాయికి పరిస్థితిని తీసుకురావొద్దని చెప్పారు. కేంద్ర మంత్రుల మాటల మధ్య తేడాలున్నాయని తెలిపారు.

వ్యక్తులు చేసే పనిని కూడా ప్రభుత్వాలు చేయలేవా అని ప్రశ్నించారు. కేంద్ర ప్యాకేజీలో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. ఇవ్వని హోదాకు కొంతమంది హీరోలయ్యారని పేర్కొన్నారు. చట్టబద్ధత లేని ప్యాకేజీలకు సన్మానాలా? అని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు ఏపీ ప్రజల్ని వంచించారు, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీపై నమ్మకం ఉంది కానీ.. ఏపీకి న్యాయం జరగనప్పుడు కచ్చితంగా మాట్లాడతాను అని తెలిపారు. ప్రత్యేక హోదా పేపర్ విమానంలా మారిందని దుయ్యబట్టారు.

కేంద్ర ప్యాకేజీని చంద్రబాబు ఎలా స్వాగతించారు? దీనికి బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తులపై తాను పోరాటం చేయడం లేదు.. విధానాలపై పోరాటం చేస్తున్నానని ఉద్ఘాటించారు. హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పోరాటం చేస్తేనే తనకు ఆనందం అని పేర్కొన్నారు. సీమ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్తానన్నారు. జనసేన తొలి ఆఫీస్‌ను అనంతపురంలోనే ఏర్పాటు చేస్తానని చెప్పారు. వచ్చే ఏడాది పార్టీ ఆఫీస్‌ను ప్రారంభిస్తానని తెలిపారు.

2865
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS