X

తెలంగాణ నయాగరాలు

ఆకాశంలో విరిసిన హరివిల్లు నీలిమేఘాలను మోసుకొస్తున్నట్లు, రాళ్ల మీద నుంచి దూదిపింజలు లోయలోకి దూకుతున్నట్లు, ఎత్తైన కొండలనుంచి మంచుతెరలను తలపిస్తూ నీటిధారలు పడుతుంటే చూసే కన్నులకు ఎంత హాయి. పచ్చపచ్చని ప్రకృతిలో గలగల పారే సెలయేరు ఒక్కసారిగా మాయమై కొండల మీదనుంచి కిందకు జాలు వారుతుంటే మనసు పులకరిస్తుంది. ప్రకృతి చెక్కిన కొండలు వాటి మధ్య జలధారలు ప్రవహిస్తున్నతీరును చూసి మది మైమరచిపోయి పురివిప్పిన నెమలి తీరు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. ఆనందాలు పూసిన పొదరిైల్లె ఆ లోకాన్ని అందుకోవాలని, ఆదమరిచి కలకాలం అక్కడే ఉండిపోవాలని అనుకోకుండా ఉండలేం. మనసు ప్రశాంతతను కోరుకున్నప్పుడు అందమైన ప్రకృతి ఒడిలో కొన్ని గంటల పాటు సేదతీరితే బాగుండునని అనుకోవడం సర్వసాధారణం. అలాంటి రమణీయ దృశ్యాలకు నెలవు, శోభలీనే సోయగాలకు కొలువు తెలంగాణ. ఈ వర్షాకాలంలో పచ్చపచ్చని ప్రకృతిలో గలగలపారే సెలయేటి అలల మధ్య సేద దీరుదాం రండి..

పర్యాటక రంగంలో జలపాతాలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది. అవి పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఎక్కడో పుట్టి.. పై నుంచి కిందకు పడుతుంటే ఆ నీటి శబ్దానికి బాహుబలిలో శివుడు వలె ఎప్పుడూ ఆవంతిక కోసం పైకెళ్లాలి అనిపిస్తుంది. చెప్పడానికి నోరు కదలనట్లుగా.. చూడటానికి కళ్లు రెప్పలు మూయవన్నట్లుగా ఉంటుంది. బాహుబలి సినిమాలో చూశాం కదా.. సినిమా పార్ట్1కి సగం బలం ఈ జలపాతాలే. సుయ్‌మనే చప్పుళ్ల మధ్యనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ జలపాతాల అందాల్లో కొట్టుకొచ్చిన ఓ ఆనవాలును చూసే కుంతల రాజ్యపు యుద్ధనారి ఆవంతికను శివుడు పెండ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆమెకోసం జలపాతాల్ని దాటుకుంటూ వెళతాడు. అది దర్శకుడు రాజమౌళి సృష్టే కావచ్చు. కానీ స్క్రీనంతా పాలలాంటి పొంగులు చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అలాంటివి నిజమైన.. అద్భుతమైన జలపాతాలు తెలంగాణలోనూ ఉన్నాయి. రామాయణ కాలపు నేపథ్యమున్న జలపాతాలు కూడా ఉన్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు కొన్ని జలపాతాలు ఉప్పొంగుతుండగా.. మరికొన్ని దుంకే దశకు చేరుకున్నాయి. దీంతో పర్యాటకులు జలపాతాల బాట పడుతున్నారు. ఇదే సందర్భంలో థామస్‌కుక్ రిపోర్ట్ ఒకటి వచ్చింది.

థామస్ కుక్ సర్వే :

వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చెట్లన్నీ పచ్చదనంతో కళకళలాడుతుంటే మబ్బు తెరల సోయగాల్లో సేద తీరేందుకు పర్యాటక ప్రాంతాలకు దారితీస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత వర్షాకాలంలో విహారానికి వెళుతున్నవారి సంఖ్య 60 శాతం వృద్ధి చెందింది. వర్షాకాలంలో దేశీయ పర్యాటక ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతున్నది. వర్షాకాల సీజన్‌లో విహారానికి వచ్చిన బుకింగ్‌ల ఆధారంగా ఈ సర్వే జరిపారు.

బొగత వాటర్‌ఫాల్స్:

తెలంగాణ జలభాగ్యం బొగత. దీనిని చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. కాళేశ్వరం-భద్రాచలం అడవుల మధ్యన ఇది ఉన్నది. 30 అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్లు దుంకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడుతాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండకోనల్లో నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం బొగత. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి. Bogatha

చేరుకోవడమెలా? :

సికింద్రాబాద్ నుంచి రైల్లో కొత్తగూడెం వెళ్లాలి. అక్కడ్నుంచి భద్రాచలం మీదుగా వాజేడుకు వెళ్లాలి. వాజేడు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్‌వే ఉంటుంది. అక్కడ్నుంచి మరో మూడు కిలోమీటర్లు వెళ్లే బొగత జలపాతం వస్తుంది. ఖమ్మం నుంచైతే 240 కిలోమీటర్లు. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని బొగత హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరం. వరంగల్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో.. ఏటూరు నాగారం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బొగత ఉంటుంది. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు.

కుంతాల వాటర్ ఫాల్స్:

తెలంగాణలోని అతిపెద్ద జలపాతం ఇది. ఆదిలాబాద్‌లో ఉరికే జలపాతం కుంతాల. కురులు జార విడిచినట్లుగా కొండల పైనుంచి దుంకుతున్న జలధారలు మనసుల్ని పరవశింపజేస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలోని నేరెడిగొండ మండలంలో కడెం నదిపై ఇది ఉంది. లోయల్లోకి నీరు దుంకుతూ ఉంటే కనిపించే తెల్లని జలపాత సుందర దృశ్యాలు.. జలపాతపు హోరు మన ఉత్సాహాన్ని ఉరకలు పెట్టిస్తుంది. Kuntala

చేరుకోవడమెలా? :

హైదరాబాద్ నుంచి 271 కిలోమీటర్ల దూరం ఉంది. నిర్మల్ వెళ్లి అక్కడ్నుంచి నేరేడిగొండ వెళ్లాలి. నేరేడుగొండ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కుంతాల జలపాతం ఉంది. బస్సు సౌకర్యం ఉంది. జలపాతం పాదాల దగ్గరకు వెళ్లాలంటే 400 మెట్లు దిగాలి.

మల్లెల తీర్థం :

కోకిల గీతాలు.. నెమళ్ల నృత్యాలు.. పారే సెలయేళ్లు.. దుమికే జలపాతాలు.. నల్లమల అడవుల్లో కనువిందుచేసే దృశ్యాలెన్నో. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న నల్లమల అడవిని కండ్ల నిండుగా సందర్శించడానికి వారాంతలు చక్కటి ఎంపిక. ఇక ఇప్పుడు మాన్‌సూన్ సీజన్.. జలతారు వెన్నెల్లో ప్రకృతి జమిలి ఆనందం పరవశింపచేస్తుంది. Mallelatheertham

చేరుకోవడమెలా?:

హైదరాబాద్ నుంచి 173 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి 57 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరితే 11 గంటల కల్లా మల్లెలతీర్థం చేరుకోవచ్చు.

పొచ్చెర జలపాతం :

ఇక్కడ గోదావరి గలగలలు స్వాగతం పలుకుతాయి. చిన్నచిన్న జలపాతాలు జలజలా పారుతూ మైమరిపిస్తాయి. కడెం నదిపైగల మరో వాటర్‌ఫాల్ ఇది. కుంతల, పొచ్చెర రెండూ జంట జలపాతాలు. నిర్మల్-ఆదిలాబాద్ పట్టణాలకు నడుమ నేరేడికొండ గ్రామానికి సమీపంలో పొచ్చెర ఉంది. వాలు కొండల మీదుగా ప్రవాహం కిందకు దిగి వస్తూ ప్రకృతి ప్రేమికులను ఊరిస్తుంది. రెండంచెలుగా దాదాపు 40 అడుగుల ఎత్తులో పొచ్చెర జలపాతం ఉంది. దీనికి సమీపంలోనే టూరిజం పార్క్ కూడా ఉంది. Pochera

చేరుకోవడమెలా? :

హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు వెళ్లి అక్కడి నుంచి పొచ్చెర జలపాతానికి వెళ్లొచ్చు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంతల జలపాతానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అజలాపురం జలపాతం:

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజలాపురంలో ఈ జలపాతం ఉంది. మొగలిపూల పరిమళం వెదజల్లుతున్నట్టుండే ఈ జలపాతం అందాలు చూడచక్కగా ఉంటాయి. సుమారు రెండువేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన కొండల మధ్య జలధారలు ప్రవహిస్తున్న తీరు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

చేరుకోవడమెలా? :

నల్లగొండ జిల్లా కేంద్రానికి మర్రిగూడ మండలం 58 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి అజలాపురం గ్రామానికి వాహన సౌకర్యం ఉంది.

సిర్నాపల్లి జలపాతం:

దీన్నే జానకిబాయి జలపాతం లేదా తెలంగాణ నయాగరా జలపాతం అని కూడా పిలుస్తారు. ఇది నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఉంది. సిర్నాపల్లి సంస్థానాధీశురాలు సీలం జానకిబాయి ఈ ప్రాంతంలో ఒక తటాకాన్ని నిర్మించారు. ఆ సరస్సు నుండి ప్రవహించే నీరు రామడుగు ప్రాజెక్టుకు ప్రవహిస్తుంది.

చేరుకోవడమెలా? :

నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి 20 కి.మీ దూరంలో ఈ జలపాతం ఉంది.

గౌరీగుండాలు:

పెద్దపల్లి జిల్లాలో గుండారం-సబ్బితం సరిహద్దుల్లోని గుట్టపై గౌరీగుండం ఉంది. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో గౌరీగుండం జలకళను సంతరించుకుంది. సబ్బితం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీగుండం వద్దకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఇది కుంతాల జలపాతాన్ని మరిపిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సబ్బితం నుంచి గట్టు సింగారం వైపు దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు కొనసాగుతున్న కొండల వరుస పచ్చని అడవులతో కళకళలాడేచోట కనువిందు చేస్తుంది ఈ జలపాతం. Gouri-Gundam

చేరుకోవడమెలా? :

కమాన్‌పూర్-పెద్దపల్లి సరిహద్దుల్లో గౌరిగుండాల ఉంటుంది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో సబ్బితం, గుండారం మధ్యలో ఈ జలపాతం ఉంటుంది.

కనకాయ్ జలపాతం :

దీనినే కనకదుర్గ జలపాతం అనికూడా అంటారు. కుంతాలకు 35 కిలోమీటర్ల దూరంలో గిర్నూర్ సమీపంలో ఈ జలపాతం ఉంది. ఇది మూడు జలపాతాల సముదాయంగా ఉంటుంది. ఒకదానిని కనకాయ్ జలపాతం అనీ, రెండోదానిని బండ్రేవు జలపాతం అనీ, మూడోదానిని చీకటిగుండం అని పిలుస్తారు. వందల అడుగుల ఎత్తున కొండల వరుస శిఖరాగ్రాల మధ్య భాగం నుంచి సుయ్‌మని సూటిగా నింగి నుంచి నేలకు దుంకుతున్నట్టుండే సుందర దృశ్యం నయనానందకరం. KANAKAYE

చేరుకునేదెలా? :

హైదరాబాద్ నుంచి 282 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మల్ నుంచి 54 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు వెళ్లి అక్కడ్నుంచి ప్రత్యేక వాహనాల్లో కనకాయ్ జలపాతం చేరుకోవచ్చు.

భీముని పాదం:

సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం భీముని జలపాతం. గూడూరు మండలంలోని కొమ్ములవంచ పరిధి అటవీప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్యన నిరంతర జలధారలతో అలరిస్తున్న భీమునిపాదం జలపాతానికి పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుంచి వస్తుందో అంతుపట్టని రహస్యంగానే ఉంది. 70 అడుగుల ఎత్తు నుంచి దూకే జలధార పర్యాటకుల్ని ఉల్లాసపరుస్తుంది. ఇక్కడ పాండవులు వనవాసానికి వచ్చిన సమయంలో భీముని మూలంగా నీరు ఊరిందని.. జలపాతం పైభాగంలో భీముని పాదముద్ర ఉందని స్థానికుల నమ్మకం. Bheemuni-Paadam

చేరుకోవడమెలా? :

భీమునిపాదం వరంగల్ పట్టణానికి 51 కిలోమీటర్ల దూరంలో గూడూరు నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మూడు మార్గాలున్నాయి. నర్సంపేట నుంచి భూపతిపేట బస్టాండ్.. సీతానాగారం.. కొమ్ములవంచ మీదుగా వెళ్లొచ్చు. గూడూరు నుంచి వెళ్లాలనుకునే వాళ్లు గూడూరు.. చంద్రుగూడెం.. లైన్‌తండా.. వంపుతండాల మీదుగా భీమునిపాదానికి చేరుకోవచ్చు. కొత్తగూడెం నుంచి వెళ్లాలనుకునేవాళ్లు కోలారం.. బత్తులపల్లి.. గోపాలపురం మీదుగా భీమునిపట్నం చేరుకోవచ్చు.

రథం గుట్ట జలపాతం:

ఖమ్మం జిల్లా మణుగూరులో ఉంటుందీ జలపాతం. ఇది అనేక పాయలుగా కొండపై నుంచి జాలు వారుతుంది. ప్రకృతి చేస్తున్న కనువిందును ఆస్వాదించడానికి జనం భారీగా తరలివస్తుంటారు. కొండపై నుంచి నీళ్లు పడుతుంటే చిన్నాపెద్దా తేడా లేకుండా జలకాలాడుతూ కేరింతలు కొడుతుంటారు.

చేరుకోవడమెలా? :

రథం గుట్ట జలపాతం మణుగూరుకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాలినడకనే వెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా 332 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి ఏటూరు నాగారం మీదుగా అయితే 335 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

గాయత్రి జలపాతం:

గోదావరి ఉపనది అయిన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. దీనిని గాడిదగుండం లేదా ముక్తిగుండం అని కూడా అంటారు. దట్టమైన అడవి గుండా ఈ ప్రాంతాన్ని చేరుకోవడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న అనేక జలపాతాల్లో ఒకటి ఇది. సుమారు 70 మీటర్ల ఎత్తున్న రాతికొండ మీంచి కిందకు జాలు వారుతున్న ఈ జలపాత అందాలు చూసేవారిని మైమరిపిస్తాయి. దీని ఎత్తు 363 అడుగులు. జలపాత నీటి బిందువులు శీతాకాలంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో పడే మంచు బిందువులను తలపిస్తుంటాయి. GAYATHRI

చేరుకోవడమెలా? :

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలో ఈ జలపాతం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ అక్కడి నుంచి నేరేడికొండ చేరుకుని అక్కడ నుంచి 5 కిలోమీటర్లు కాలినడకన వెళితే గాయత్రి జలపాతం వస్తుంది. హైదరాబాద్ నుంచి నేరేడికొండ 257 కిలోమీటర్లు ఉంటుంది.

గుండాల జలపాతం

ఈ జలపాతం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడ ఎత్తైన బండరాళ్లపై నుండి కృష్ణానది ప్రవహించడం వ్లల ఈ జలపాతం ఏర్పడింది. కృష్ణానది పడమటి దిశనుండి తూర్పువైపు ప్రవహిస్తున్నదీ జలపాతం. Gundala-WaterFall

చేరుకోవడమెలా? :

వనపర్తి జిల్లా కేంద్రం నుండి ఆత్మకూరు 33 కి.మీ దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి గుండాల గ్రామానికి ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి.

ప్రభుత్వం పెద్దపీట:

అద్భుతమైన మన జలపాతాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు తెలంగాణ టూరిజం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది. అవన్నీ చేస్తున్నాం కాబట్టే దేశంలోనే 7వ స్థానంలో ఉన్నాం. వచ్చే రెండేళ్లలో రెండు.మూడు స్థానాలకు చేరుకుంటామని చెప్పగలను. పర్యాటకుల కోసం సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా విదేశీ టూరిస్ట్‌ల కోసం ప్రపంచదేశాలకు చెందిన 10 భాషల్లో సమాచార కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. -బుర్రా వెంకటేశం, తెలంగాణ టూరిజం కార్యదర్శి Waterfall1

జలపాత ప్రేమికుడిని:

తెలంగాణలో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. చూడగానే అక్కడే ఉండిపోవాలనిపించే సౌందర్యం జలపాతాల సొంతం. ఈ సీజన్లో అయితే ఇంక చెప్పనక్కర్లేదు. మేము ఒక బృందంగా తరచూ జలపాతాల విహారానికి వెళ్తుంటాం. వీటిద్వారా పొందే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అందుకే నేను జలపాతాల ప్రేమికుడిగా మారిపోయాను. -చక్రి, యాంకర్

జల తెలంగాణ :

తెలంగాణ పర్యాటకానికి జలపాతాలు మకుటం లాంటివి. చాలామంది అనుకుంటారు తెలంగాణలో వాటర్‌ఫాల్స్ ఎక్కడివని? కానీ ఇప్పుడు కాదు రామాయణ కాలంనాటి ఆనవాళ్లున్న జలపాతాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా కొన్ని వెలుగులోకి రాలేదు. వాటన్నింటినీ వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. -దూలం సత్యనారాయణ, ఫిల్మ్ మేకర్ Waterfall


Advertising
Advertising