చెరుకు పంటకు ప్రత్యామ్నాయం.. రైతుకు లాభం..

- చెరుకు పంటకు ప్రత్యామ్నాయం.. ‘షుగర్ బీట్'
- బసంత్‌పూర్ వ్యవసాయ కేంద్రంలో పరిశోధనలు
మనదేశంలో చక్కెర తయారీకి ఉపయోగపడే ఏకైక పంట.. చెరుకు. తిన్నవారికి తీపిని పంచుతున్నా, పండించేవారికి మాత్రం చేదునే మిగుల్చుతున్నది. అధిక పెట్టుబడి.. తక్కువ రాబడితో రైతులను నష్టాలపాలు చేస్తున్నది. ఫలితంగా చెరుకు సాగు క్రమక్రమంగా తగ్గిపోతున్నది. ఇదే సమయంలో ఓ సరికొత్త పంట.. చెరుకు రైతుల్లో ఆశలు రేపుతున్నది. అదే.. షుగర్ బీట్.
షుగర్ బీట్.. ఈ పంట మనకు కొత్తదే అయినా రష్యా, అమెరికా, జర్మనీతోపాటు యూరప్‌లోని అనేక దేశాల్లో విస్తారంగా సాగవుతున్నది. కొన్ని దేశాల్లో అయితే, రైతులు చెరుకును పూర్తిగా పక్కనపెట్టి షుగర్ బీట్‌కే మొగ్గు చూపుతున్నారు. చెరుకుతో పోలిస్తే అన్ని విషయాల్లోనూ షుగర్ బీట్ పంట మేలని పరిశోధనల్లో తేలింది. పంటకాలంతోపాటు నీటి వినియోగం, చక్కెర శాతం, దిగుబడి.. ఇలా అన్నిటిలోనూ చెరుకుపై పైచేయి సాధించి, ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నది.
బసంత్‌పూర్‌లో పరిశోధనలు
మనదేశంలో చెరుకు సాగు రైతులకు భారంగా మారుతున్నది. పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువ. అంతేకాకుండా, చెరుకు పంటకు అధిక మొత్తంలో నీరు అవసరం. దీంతో సాగు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో లక్నోలోని భారతీయ చెరుకు పరిశోధన సంస్థ, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే దేశంలో ‘షుగర్ బీట్' పంట సాగు చేయాలనే ఆలోచన చేసింది. దీంతో విదేశాల నుంచి ఎనిమిది రకాల షుగర్ బీట్ విత్తనాలను తీసుకొచ్చి, పరిశోధనలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణ ప్రాంతం షుగర్బీట్ సాగుకు ఎంతవరకు అనుకూలం అనే అంశంపై పరిశోధనలు చేసే బాధ్యతను సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్‌పూర్‌లోని పరిశోధన కేంద్రానికి అప్పగించింది. ఈ వ్యవసాయ కేంద్రంలో మూడు నెలల నుంచీ షుగర్ బీట్ పంటను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. అది పూర్తికాగానే ఈ ఎనిమిది రకాల్లో ఏ రకం పంట తెలంగాణ నేల, వాతావరణానికి అనుకూలమో తేల్చి.. ఆ పంట సాగుకు చర్యలు తీసుకోనున్నారు.
చెరుకుతో సమానంగా
చెరుకుతో పోలిస్తే షుగర్ బీట్ రకం అన్నిట్లో మేలుగానే కనిపిస్తున్నది. చెరుకు పంటకాలం 12 నెలలు. కానీ, షుగర్ బీట్ పంటకాలం ఐదు నుంచి ఆరు నెలలు మాత్రమే. పంటకాలం సగానికి సగం తగ్గడంతో కూలీ ఖర్చు, నీటి వినియోగం, ఇతర సాగు ఖర్చులన్నీ కూడా తగ్గనున్నాయి. ముఖ్యంగా చెరుకు సాగులో పంట చేతికొచ్చిన తర్వాత గడలను కొట్టడమే అత్యంత కష్టమైన పని. ఇందుకోసం రైతులు భారీగా కూలీ చెల్లించాల్సి ఉంటుంది. స్థానికంగా కూలీల కొరత ఉండటంతో, పక్క రాష్ర్టాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితులున్నాయి. ఫలితంగా పెట్టుబడి పెరుగుతున్నది. షుగర్ బీట్‌లో మాత్రం సాధారణంగా దున్నడం లేదా తవ్వడం ద్వారా గడ్డను తీసుకోవచ్చు. కూలీల అవసరం కూడా తక్కువే. ఇది కాకుండా, చెరుకు సాగుకు అధిక నీరు అవసరమవుతుంది. దీంతో సాగుకు అవకాశాలు తక్కువ. కానీ, షుగర్ బీట్‌కు అంత నీరు అవసరం లేదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇక చెరుకు పంట ప్రతి హెక్టారుకు 100 టన్నుల దిగుబడి వస్తుంది. షుగర్బీట్లోనూ కాస్త అటుఇటుగా 80 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. షుగర్ బీట్లోనూ చెక్కర శాతం సమానంగా ఉంది. ఇది చెరుకులో 12-14శాతం ఉండగా షుగర్ బీట్‌లో 12-13శాతం ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
రైతుకు లాభం.. పరిశ్రమకు ఊతం
షుగర్ బీట్ పంట రైతుకు లాభం చేకూర్చడంతోపాటు చక్కెర పరిశ్రమకు ఊతమిచ్చేలా ఉంది. పంట కాలం తక్కువ కావడంతో రైతు ఒకే ఏడాది రెండు పంటలను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా షుగర్ బీట్ చలికాలం పంట. సెప్టెంబరు, అక్టోబరులో నాటుకుంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో కోతకు వస్తుంది. అప్పటికీ చెరుకు పంట చేతికి రాదు కాబట్టి.. పరిశ్రమలకు కొంత కాలంపాటు పని లభించే అవకాశం ఉంటుంది. ఈ పంట సాగు వల్ల చక్కెర పరిశ్రమతోపాటు రైతులకూ ఎంతో లాభంగా ఉంటుంది.
దుంపజాతి పంట
చెరుకు పంట కర్ర రూపంలో ఉంటుంది. కానీ, ఇందుకు ప్రత్యామ్నాయంగా మారిన షుగర్ బీట్ మాత్రం దుంప జాతికి చెందినది. ఇది చెరుకు మాదిరిగా పైకి కాకుండా, భూమిలోపల దుంపలా పెరుగుతుంది. కండ్ర గడ్డ(రత్నపురి గడ్డ) మాదిరిగా ఉంటుంది. చెట్టు పెరుగుదల కూడా చాలా తక్కువ. క్యాబేజీ మొక్కను పోలినట్లు గుబురు ఆకులతో కనిపిస్తుంది.
సాగు సులువుగానే..
చెరుకు పంటతో పోలిస్తే షుగర్ బీట్ సాగు చాలా సులభంగా ఉంటుంది. అన్ని అంశాల్లోనూ షుగర్ బీట్ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నది. ఈ పంట సాగు చేయడం వల్ల రైతుకు పంట కాలం, ఖర్చు భారీగా తగ్గుతుంది. తక్కువ నీరు అవసరం అవుతుంది. షుగర్ బీట్ పంటతో అన్ని రకాలుగా ఉపయోగం కలుగనున్నది. అయితే, ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉన్నది.
- విజయకుమార్,
వ్యవసాయ శాస్త్రవేత్త, బసంత్‌పూర్
చెరుకు పంటకు
ప్రత్యామ్నాయంగా..రోజురోజుకూ చెరుకు పంటసాగు కష్టసాధ్యమవుతున్నది. షుగర్ బీట్ పంట ఇందుకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నది. ఇతర దేశాల్లోని రైతులు దీనిని విరివిగా సాగుచేస్తున్నారు. ఇప్పుడు మన వద్ద సాగుకు సంబంధించిన పరిశోధనలు చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బసంత్‌పూర్ పరిశోధన కేంద్రంలో ఎనిమిది రకాల షుగర్ బీట్ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ పంట మన నేలకు అనుకూలంగా ఉంది. దీనిని సాగుచేస్తే చెరుకు రైతులకు అనేక రకాలుగా మేలు కలుగనున్నది.
- ప్రొ.జగదీశ్వర్,
జయశంకర్ వర్సిటీ పరిశోధన విభాగం అధిపతి