గురువారం 25 ఫిబ్రవరి 2021
Agriculture - Jan 28, 2021 , 00:54:21

సాగు వరం..రాఘవాపురం

సాగు వరం..రాఘవాపురం

  • ఇంటింటా ఆకుకూరల క్షేత్రాలు 
  • ఆదర్శంగా నిలుస్తున్న గ్రామస్తులు 

ఒక్కో ఊరికి ఓ చరిత్ర ఉంటుంది. ప్రతి గ్రామం తనదైన ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలంలోని రాఘవాపురానికి కూడా ఓ విశేషం ఉంది. ఇక్కడ 500 గడపలు  ఉంటాయి. అందరూ వ్యవసాయదారులే. అందులో దాదాపు 200 కుటుంబాలు ఆకుకూరలను మాత్రమేపండిస్తూ జీవనోపాధిని పొందుతున్నాయి.

రాఘవాపురం గ్రామాన్ని చుట్టుపక్కల వారంతా ‘ఆకుకూరల గ్రామం’ అంటారు. చూసేందుకు చిన్న పల్లే అయినా, ఏడాది పొడవునా ఊరంతా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. గ్రామంలోని 200 కుటుంబాలు తమ తాతల కాలం నుంచీ ఆకుకూరలను సాగుచేస్తున్నాయి. మొదట్లో చిన్నగా  పెరట్లో కూరలు పెంచుకొనేవారట. ఇప్పుడు ఎకరాల కొద్దీ సాగు చేస్తున్నారు.

ఇంటింటా సాగుక్షేత్రాలు

‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్న సామెతను రాఘవాపురం వాసులు నిజం చేస్తున్నారు. కుటుంబంలో అందరూ కలిసి ఉంటే, కష్టపడి పనిచేస్తే ఎందులోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారు. సాగులో ఒకరితో ఒకరు పోటీ పడుతూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఆకుకూరల పెంపకంలో మేటిగా నిలుస్తున్నారు. వీళ్ల్ల తాతల కాలం నుంచీ అందరూ ఆకుకూరల సాగునే జీవనాధారంగా చేసుకున్నారు. గ్రామంలో అనేక రకాల ఆకుకూరల పంటలు దర్శనమిస్తాయి. ఏ ఇంటిని సందర్శించినా, అరుగు మీద కూర్చుని ఆకుకూరలను కట్టలుగా కడుతున్న దృశ్యాలే కనువిందుచేస్తాయి. ఈ పల్లె స్ఫూర్తితో జిల్లాలోనూ అనేకమంది రైతులు ఆకుకూరల సాగువైపు మళ్లుతున్నారు. 


ప్రతి ఇంట్లోనూ.. 

ఐదొందల కుటుంబాలున్న రాఘవాపురంలో, రెండొందల గడపలు ఆకుకూరల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంటి పెరట్లోనే వేలాది రూపాయల విలువైన కూరలు పండిస్తున్నారు. తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా విస్తరించుకుంటున్నారు. తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చలికూర, మెంతికూర, చుక్కకూర, పుదీన, కొత్తమీర, గంగవాయిలకూర.. దేన్నీ వదలడం లేదు. మగవాళ్లు సస్యరక్షణ చర్యలు చేపడుతుంటే, ఆడవాళ్లు ఆకుకూరలను సేకరించి, కట్టలుగా కడుతుంటారు. మళ్లీ ఉదయాన్నే వాటిని సమీప మార్కెట్లకు తరలించి విక్రయిస్తారు. ఫలితంగా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. పిల్లల్నీ చదివిస్తున్నారు. 

తెల్లవారక ముందే 


ఆకుకూరలను తెంపిన వెంటనే అమ్మేయాలి. ఆలస్యమైతే వాడిపోతాయి. అందుకే, వీరంతా తెల్లవారకముందే దిగుబడులను తీసుకొని, చుట్టుపక్కల గ్రామాలకు బయల్దేరుతారు. కొత్తగూడెం, చుంద్రుగొండ, జూలూరుపాడు, ఇల్లెందు, సత్తుపల్లి, అన్నపురెడ్డిపల్లి, రేగళ్ల, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, రుద్రంపూర్‌, పాల్వంచ, పెద్దమ్మగుడి, జగన్నాథపురం తదితర గ్రామాల్లో ఆకుకూరలను అమ్ముకుంటారు. సగటున ఒక్కో రైతు రోజుకు వెయ్యికి తక్కువ కాకుండా విక్రయాలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో సాగు చేసేవారైతే రెండు వేలకు పైగానే సంపాదిస్తున్నారు.

సాయంత్రమే పని


మధ్యాహ్నం కూరలు తెంపడం, సాయంత్రం నుంచి రాత్రివరకు వాటిని శుభ్రం చేసి కట్టలు కట్టడమే పని. కుటుంబ సభ్యులంతా కలిసి కట్టలు కడతాం. తెల్లవారు జామునే లేచి విక్రయాలకు వెళ్తాం. కూరలన్నీ అమ్ముకుని ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం అవుతుంది. మళ్లీ పొలానికి వెళ్లి, పనులు చేసుకుంటాం. ఇదే మా ప్రపంచం.

-డి.కల్యాణి

ఇంటికే వచ్చి..


ఆకుకూరల పెంపకం ఎంతో సులభం. కాకుంటే, వేసవి కాలంలోనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నీరు ఎక్కువగా పెట్టాలి. లేకపోతే కూర ఎదగదు. వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. మా పంటల నాణ్యత గురించి తెలిసిన వారు ఇంటికే వచ్చే కూరలు కొనుక్కుంటారు. ఇది లాభసాటి వ్యాపారం. మంచి విత్తనాలు వేస్తే మంచి దిగుబడి వస్తది. చీడలు లేకుండా చూసుకొంటే సరి. 

-కృష్ణ

చాలా ఏండ్లుగా.. 


ఈ వ్యాపారం ఇప్పటిది కాదు. మా తాతలకాలం నాటిది. గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ ఆకుకూరలు సాగు చేస్తారు. అందరం కలిసి పొలం పనులు చేసుకుంటాం. వ్యాపారం మాత్రం ఎవరిది వారిదే. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్లి ఆకుకూరలు విక్రయిస్తాం. కష్టపడితే తప్పక ప్రయోజనం ఉంటుంది. వేసవికాలంలోనూ గిరాకీ బాగుంటుంది. మార్కెట్‌లో రేటును బట్టి లాభాలు వస్తాయి. రైతు బజార్‌లలోనూ విక్రయాలు సాగిస్తాం.

-పెంటి రాము ,

రైతు బజార్‌ అధ్యక్షుడు, రాఘవాపురం 

తక్కువ సమయమే 


భార్యాభర్తలం కలిసి ఆకుకూరలను సాగు చేస్తున్నాం. పంట దిగుబడికి తక్కువ సమయమే పడుతుంది. ఒక పంట అయిపోగానే, మరొకటి వేస్తాం. పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు. నీరు, కొంచెం మందులు వేస్తే చాలు, కూరలు బాగా పెరుగుతాయి. చలికాలంలో మాత్రం తెగుళ్లు వస్తాయి. జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మంచిగా పెరుగుతుంది. మేం అన్ని రకాల కూరలూ పండిస్తున్నాం. 

-దొంచెరపు సంధ్య 


...కాగితపు వెంకటేశ్వరరావు

కొత్తగూడెం

VIDEOS

logo