బుధవారం 27 జనవరి 2021
Agriculture - Jan 14, 2021 , 01:16:39

పల్లె సైంటిస్ట్‌

పల్లె సైంటిస్ట్‌

విజయానికి విద్యే ముఖ్యం కాదనీ, ఇష్టంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చనీ నిరూపించాడు ఆ మెకానిక్‌. చదివింది పదో తరగతే అయినా.. ఇంజినీర్లకు ఏ మాత్రం తీసిపోకుండా సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తూ సాగులో రైతన్నల కష్టం తగ్గిస్తున్నాడు. కూలీల అవసరం లేకుండా కలుపు తీసే మినీ కల్టివేటర్‌ను రూపొందించి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఏడాది కాలంలోనే రూ.1.5కోట్ల విలువ చేసే 350 మినీ కల్టివేటర్లను దేశంలోని పలు రాష్ర్టాల రైతులకు అందించిన మహిపాల్‌ చారి ప్రస్థానం ఇది..

వరంగల్‌ రూరల్‌ జిల్లా, పరకాల మండలం, సీతారాంపురానికి చెందిన కడివెండి మహిపాల్‌చారి, వ్యవసాయ పనిముట్ల తయారీలో రాణిస్తున్నాడు. 1997లో పదో తరగతి పూర్తి చేసిన మహిపాల్‌, చదువుకు స్వస్తి చెప్పి కొన్నేండ్లపాటు మెకానిక్‌ షాపు నడిపాడు. అందులో నష్టం రావడంతో తన పొలంలో వ్యవసాయాన్ని ప్రారంభించాడు. కానీ, కూలీల కొరతతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కలుపు తీయడం కష్టం కావడంతో నష్టాల్ని చవిచూశాడు. ఈ క్రమంలో ఆలోచనలకు పదును పెట్టి, కూలీల అవసరం లేకుండానే చేనులో కలుపు తీసే ‘మినీ కల్టివేటర్‌'ను తయారు చేశాడు. దీన్ని తాను వాడుతూ, చుట్టుపక్కల రైతులకూ అందించాడు. రైతుల కష్టాలను దూరం చేసిన ఈ మినీ కల్టివేటర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2015లో నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నాడు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు. 2016లో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఏఆర్‌ఐ ప్రదర్శనలో పాల్గొనడంతోపాటు, 2018లో జాతీయ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అవార్డునూ అందుకున్నాడు. 

మరింత మంది రైతులకు..

తన మినీ కల్టివేటర్‌ను ఎక్కువ మంది రైతులకు అందించాలనే లక్ష్యంతో, ఏకంగా యంత్రం తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. తక్కువ ధరలోనే వీటిని తయారు చేస్తూ, అవసరం ఉన్న రైతులకు సరఫరా చేస్తున్నాడు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన అనేకమంది రైతులు ఈ యంత్రాలను కొనుగోలు చేశారు. వాటి పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. 2019లో తన ఉత్పత్తులను చైనాకు కూడా ఎగుమతి చేశాడు. గతేడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా, రూ.కోటిన్నర విలువ చేసే 350 మినీ కల్టివేటర్లను పలు రాష్ర్టాల రైతులకు అందించాడు.

పలువురికి ఉపాధి

ఒక మామూలు మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన మహిపాల్‌, మినీ కల్టివేటర్‌ తయారీద్వారా 12 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాడు. పవర్‌ వీడర్‌, సిట్టింగ్‌ కల్టివేటర్లను కూడా తయారు చేస్తున్నాడు. తన ఆవిష్కరణలకు పదును పెడుతూ, ఇటీవలే మినీ త్రీవీల్‌ ట్రాక్టర్‌ను రూపొందించాడు. తన అనుభవాలను యువ ఇన్నొవేటర్లకు పంచు తున్నాడు కూడా. కొత్తతరం ఆలోచనలకు మరింత పదునుపెడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

...పోచంపల్లి రాజ్‌కుమార్‌

కష్టాన్ని తగ్గించేందుకే..

వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఎక్కువగా ఉంది. దీనికి తోడు ప్రతి రైతూ తన రక్తాన్ని చెమటగా మార్చి వ్యవసాయం చేస్తున్నాడు. కాబట్టి, రైతులకు కూలీల కొరతను తీర్చడంతోపాటు, వారి కష్టాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా. వ్యవసాయ పనులను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నా. అందులో భాగంగానే పలు ఆవిష్కరణలు చేశా. మరిన్ని నూతన ప్రయోగాలు చేపడుతున్నా. ప్రతిభకు చదువొక్కటే ముఖ్యం కాదు. ఆలోచించి ఆచరణలో పెడితే ఏదైనా సాధ్యమే.

- కడివెండి మహిపాల్‌ చారి, సీతారాంపురం, పరకాలlogo