శుక్రవారం 22 జనవరి 2021
Agriculture - Jan 07, 2021 , 00:10:23

పెట్టుబడి ఆవ గింజంతే!

పెట్టుబడి ఆవ గింజంతే!

గతంలో వాళ్లూ అందరిలాగే మూస వ్యవసాయం చేసేవారు. అవే సమస్యలు, అవే నష్టాలు. అలా కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా ఉన్నాయా? అని ఆలోచించారు. అప్పుడే, ‘ఆవాల సాగు’ గురించి తెలిసింది. నిజానికి, మార్కెట్లో ఆవాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఆవాల ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రైవేట్‌ కంపెనీలు రైతులకు అవగాహన కల్పించాయి. వరి, పత్తి, పసుపు పంటలతో పోలిస్తే, ఆవాలతోనే మంచి దిగుబడి పొందవచ్చని రైతులు గ్రహించారు. పెట్టుబడి తక్కువే కాబట్టి, సస్యరక్షణ చర్యలతో ఆవాల సాగువల్ల లాభాలు సాధించవచ్చనే నమ్మకమూ ఏర్పడింది.

 ‘నీటి సౌకర్యం లేదు. ఎర్ర నేలల్లో ఏం పండిస్తం?’ అనే రంది ఆ రైతులకు లేదు. ‘వరి వేశాం. దోమ తగిలింది. ధర రాలేదు’ అనే ఆందోళనా లేదు. ఉన్నంతలో నీటిని వాడుకొని, చేతనైనంత మేర సాగు చేసుకొని, తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందుతూ ఆవాల సాగును అదృష్ట సాగుగా మార్చుకుంటున్నారు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సమీపంలోని ఇబ్రహీంపట్నం రైతన్నలు.

ఇబ్రహీంపట్నం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో, దాదాపు అన్ని ఊర్లలోనూ ఆవాలు సాగు అవుతున్నాయి. కోమటి కొండాపూర్‌, అమ్మక్కపేట, వర్షకొండలాంటి చోట్ల కొంతమేర ఎర్ర నేలలు ఉన్నాయి. నీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేదు. ఈ పరిస్థితుల్లో మూస పద్ధతిలో సాగు చేసి నష్టపోవడం ఎందుకని, ఆవాలసాగు వైపు దృష్టి మళ్లించారు. అదే సమయంలో, ఒక కంపెనీ ప్రతినిధులను సంప్రదిస్తే, ‘విత్తనం ఇస్తాం. పంట సాగై.. దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్‌ ధర ఎంత ఉంటే అంతకు కొనుగోలు చేస్తాం. 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఏటా ఒక దఫా ఆవాలు, మరో దఫా మక్కలు లేదా పసుపు వేసుకోవచ్చు’ అని సలహా ఇచ్చారు. దీంతో రైతులు ఐదారేండ్లుగా ఆవాలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 1200 మంది రైతులు, 3,100 ఎకరాల్లో ఆవాలను సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు.

90 రోజుల్లోనే పంట 


ఆవాల్లో మగ, ఆడ రకం విత్తనాలు ఉంటాయి. కొందరు  ఆడ, మగ విత్తనాలను కలిపి సాగు చేస్తే.. మరికొందరు మగ రకాన్ని మాత్రమే ఎంచుకుంటున్నారు. ఆడ రకం ఆవాలసాగులో ఎకరానికి ఒక కిలో విత్తనాల్ని వినియోగిస్తున్నారు. కిలో విత్తనాల మార్కెట్‌ ధర రూ.500 మాత్రమే. విత్తనం నాటిన తర్వాత, సస్యరక్షణ కోసం ఎకరానికి 20-20 రకానికి చెందిన ఎరువును ఒక బస్తా (50 కిలోలు) వేస్తారు. ప్రస్తుతం, దీని ధర రూ.950 వరకూ ఉంది. తదుపరి, 10 కిలోల సల్ఫర్‌  వేస్తారు. ప్రస్తుతం దీని ధర రూ.450. ఆపైన, ఎకరానికి 45 కిలోల యూరియా (బస్తా ధర రూ.270) వేస్తారు. ఇంతకు మించి , ఆవాల సాగులో ఎరువులను వినియోగించే పరిస్థితి లేదు. ఆవాల పంట 90 రోజుల వ్యవధిలోనే చేతికి వస్తుంది. సాధారణంగా నవంబర్‌లో ఈ పంటను సాగు చేస్తారు. 

మూడో పంటగా 

పంట వేసిన 35 రోజుల తర్వాత ఆవాలు పూత దశకు చేరుకుంటాయి. 70 రోజుల తర్వాత కాత దశకు వస్తాయి. పూత దశ దాటి, కాత దశకు వచ్చే సమయంలో పంటను పురుగు ఆశించే ప్రమాదం ఉంది. దీని నుంచి రక్షించుకునేందుకు రసాయనాలను పిచికారీ చేస్తారు. 90 రోజుల తర్వాత, అంటే ఫిబ్రవరిలో పంటను హార్వెస్టర్‌ ద్వారా కోస్తారు. సాధారణంగా ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇక ఆడ, మగ రకానికి చెందిన విత్తనాలు కలిపి సాగు చేస్తే, ఎకరానికి కిలోన్నర ఆడ విత్తనం, అరకిలో మగ విత్తనం వేస్తారు. 70 రోజుల తర్వాత కాత దశలో, మగ రకానికి చెందిన చెట్లను కోసేస్తారు. ఆడ రకానికి చెందిన దిగుబడిని మాత్రమే తీసుకుంటారు. ఫిబ్రవరి తర్వాత, ఆవాల పంట ముగిసిన అనంతరం రైతులు అదే తోటలో సజ్జను సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ చివరి వరకు సజ్జపంటను పండిస్తున్నారు. మే, జూన్‌ నెలల్లో తోటలను పూర్తిగా ఎండబెట్టి జూన్‌ ఆఖరు, జూలై నెలల్లో వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాత, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మక్కలు లేదా పసుపు.. ఏదో ఒకటి సాగు చేస్తున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో మక్కలు, పసుపు పంటల సాగు అనంతరం, మళ్లీ నవంబర్‌లో రైతులు ఆవాల సాగు మొదలుపెడుతున్నారు. దీని వల్ల రైతు ఆదాయ చక్రమూ దెబ్బతినదు.

నీటి అవసరం తక్కువే 

చెరుకు, వరి పంటలకు సేద్యం ప్రారంభం నుంచి కోతలు వచ్చేదాకా అధిక మొత్తంలో జల వనరులను వినియోగించాల్సి ఉంటుంది. అదే, ఆవాల పంటకు నీటి అవసరం పెద్దగా ఉండదు. నిజం చెప్పాలంటే, నీరు అధికంగా ఉన్న భూముల్లో ఆవాలు పండే పరిస్థితే లేదు. ఇబ్రహీంపట్నం మండలంలో రైతులు.. ఆవాల సాగుకు నీటి వసతుల కల్పన కోసం రెండు విధానాలను అవలంబిస్తున్నారు. కొందరు.. కాలువలను కట్టి, తొంబై రోజుల పంట కాలంలో ఆరు నుంచి ఏడుసార్లు నీటి తడిని ఇస్త్తూ సేద్యం సాగిస్తున్నారు. మరికొందరు ప్రగతిశీల రైతులు, యువ రైతులు .. బిందుసేద్యం ద్వారా అతి తక్కువ నీటిని వినియోగిస్తూ కచ్చితమైన పద్ధతిలో సాగు చేస్తున్నారు.  

కొనుగోలుకు కంపెనీలు సిద్ధం

ఆవాల పంటను సాగు చేస్తున్న రైతులు, తమ దిగుబడులను లాభసాటి ధరకు ప్రైవేట్‌ కంపెనీలవారికే విక్రయిస్తున్నారు.  ఆవాల సేద్యం ప్రారంభమయ్యే సమయంలోనే ప్రైవేట్‌ కంపెనీల ప్రతినిధులు ఇబ్రహీంపట్నం మండలంలోని రైతులను సంప్రదిస్తున్నారు. వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కంపెనీ అందజేసిన సీడ్‌నే సాగు చేస్తున్నారు. కోతలు పూర్తయిన తర్వాత, కంపెనీల ప్రతినిధులు రైతులవద్దకు వెళ్లి,  ఒప్పందం ప్రకారం మార్కెట్‌ ధరను చెల్లించి, ఆవాలను సేకరిస్తున్నారు. ఐదారు సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. ఆవాలతో పాటు ఏటా మరో రెండు పంటలను సైతం సాగు చేస్తూ రైతులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. రైతు ఆలోచనా విధానం మారితేనే వ్యవసాయ విధానమూ మారుతుంది. అప్పుడే, లాభాల పంట పండించగలడు.

ఎకరాకు 50 వేల ఆదాయం


ఆవాల సాగువల్ల రైతులకు అధిక లాభాలు వస్తున్నాయి. ఆడ రకానికి, సగటున ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని రైతులు అంటున్నారు. ఆడ రకం ఆవాలు క్వింటాల్‌కు రూ.5000 పలుకుతున్నాయి. పది క్వింటాళ్ల దిగుబడి తీసిన రైతుకు ఎకరానికి యాభై వేలవరకు వస్తుంది. 90 రోజుల పంటకాలంలో రైతు ఎకరానికి రూ.8 నుంచి 10వేల వరకు పెట్టుబడి పెడుతుండగా, అందుకు మూడు రెట్ల ఆదాయం సమకూరుతున్నది. ఇక మగ, ఆడ రకాన్ని కలిపి సాగు చేస్తే ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. వీటికి మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 6,500 నుంచి 7 వేల వరకు ధర పలుకుతున్నది. ఈ రకాన్ని సాగు చేసిన రైతులు, ఎకరానికి నలభై వేలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు. మగ రకానికి చెందిన చెట్లను కోసేసినా.. వాటినుంచి సైతం కొందరు రైతులు ఆవాలను సేకరించి, విక్రయిస్తున్నారు.  ఇవి మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 2వేల వరకు పలుకుతున్నాయి. ఎకరానికి ఒకటిన్నర క్వింటాల్‌ నుంచి రెండు క్వింటాళ్ల వరకు మేలు రకానికి చెందిన ఆవాలను సైతం విక్రయించి కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. 

మంచి ప్రయోజనాలు 

ఆవాల సాగు మంచి ప్రయోజనాలను ఇస్తున్నది. ప్రైవేట్‌ కంపెనీల ప్రోత్సాహంతో ఇటువైపు వచ్చాం. అనుకున్న దానికంటే మెరుగైన పరిస్థితి ఉంది. వరి, చెరుకు, పసుపు పంటలకు ఉన్నంత శ్రమా ఉండదు.  90 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. భారీ పెట్టుబడి అవసరం లేదు. కూలీలతో పెద్దగా పని లేదు. దిగుబడి సైతం నాణ్యంగానే ఉంది. ఎకరానికి రూ.45-50 వేల వరకు ఆదాయం వస్తుంది. నేను సంతోషంగా ఉన్నాను. 

-గడ్డం సంజీవరెడ్డి, 

కోమటి కొండాపూర్‌

ముచ్చటగా మూడు పంటలు మావి ఎర్ర నేలలే అయినా, ఏటా మూడు పంటలను సాగు చేసుకునే అవకాశం కలిగింది. 90 రోజుల్లో ఆవాల సాగు చేస్తున్నాం. మరో 90 రోజులు సజ్జసాగు చేస్తున్నాం. తిరిగి శక్తిని పుంజుకునేందుకు రెండు నెలలపాటు భూమిని ఆరబెట్టుకోవడంతోపాటు, సంప్రదాయమైన ఎరువులను వినియోగించుకునే అవకాశం దొరికింది. వానా కాలంలో మక్క, పసుపులలో ఏదో ఒకదాన్ని సాగు చేస్తున్నాం. ఆవాల సాగువల్ల మంచి ప్రయోజనం ఉంది. ఏటా మూడు కాలాల్లో మూడు రకాల పంటలను సాగు చేస్తున్న సంతృప్తి కూడా కలుగుతున్నది. 

- అలిశెట్టి మోహన్‌, ఇబ్రహీంపట్నం 

ఎకరానికిపది క్వింటాళ్లు

నేను కొంత కాలంగా ఆవాలు సాగు చేస్తున్నా. ఆడ రకానికి చెందిన విత్తనాలను చల్లి సాగు చేస్తే, ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి పక్కాగా వస్తుంది. యాభై వేల రూపాయలు ఎటూ పోవు. ఆడ, మగ రకాల విత్తనాలు కలిపి పండిస్తే, దిగుబడి కొంచెం తక్కువ వస్తది. అయితే, ధర మంచిగా ఉంటుంది. ఎట్లయినా  నయమే. వరి  కంటే లాభమే. కూలీలు దొరకరన్న రంది లేదు. ప్రైవేట్‌ కంపెనీలు వచ్చి కొనుక్కుపోతున్నాయి. తిప్పలు తప్పింది. 

-బండ రాజిరెడ్డి, ఇబ్రహీంపట్నం 

...కొత్తూరి మహేష్‌కుమార్‌

...ముల రమేష్‌రెడ్డి


logo