శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Agriculture - Feb 15, 2021 , 08:01:50

మల్చింగ్‌ సాగు.. దిగుబడులు బాగు

మల్చింగ్‌ సాగు.. దిగుబడులు బాగు

  • సాధారణం కంటే 30 శాతం అధిక దిగుబడి
  • ఉద్యాన సాగులో మల్చింగ్‌ విధానానికి మైలురాయి
  • 50 శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం

ఇబ్రహీంపట్నంరూరల్‌, ఫిబ్రవరి 14: ఉద్యానవన సాగులో మల్చింగ్‌ రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయిస్తున్నది. అధికారుల సలహాలు, సూచనల మేరకు పంటలను రైతులు సాగుచేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మల్చింగ్‌ పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందజేస్తుండడంతో రైతులు దీనిపై మక్కువ చూపుతున్నారు. మల్చింగ్‌ సాగు పద్ధతిలో కలుపు నివారణ మందులు చల్లడం, కలుపు తీయడం వంటి ఎలాంటి ఖర్చులు లేకుండా ఉంటుంది. ఎకరా పొలంలో మల్చింగ్‌కు సుమారుగా రూ.12వేల వరకు ఖర్చు అవుతుంది. అనంతరం విత్తనాలు విత్తిన నాటి నుంచి, పంట పూర్తయ్యే వరకు ఎలాంటి కలుపు నివారణ పనులు ఉండవు. రైతులు మామూలుగా పండించే పంటల కంటే మల్చింగ్‌ పద్ధతిలో 30శాతం అధికంగా దిగుబడి పొందవచ్చని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. 

మల్చింగ్‌ విధానం..

ఈ పద్ధతిలో 25, 60, 50, 75, 1000 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్‌ షీట్లను పూలు, పండ్ల తోటలు, కూరగాయల మొక్కల పొదలు బోదెలపై కప్పి ఉంచాలి. పండ్లతోటలకు 75 నుంచి 100 మైక్రాన్లు, పూలు, ఇతర సల్పకాలిక పంటలకు 25, 30, 50 మైక్రాన్ల షీట్లను వాడుతారు. ఈ పద్ధతిలో సాగు చేసేందుకు హెక్టారుకు రూ.35 వేలు ఖర్చవుతుంది. పొలం చదును చేసిన తరువాత విత్తనాలు విత్తే సమయంలో ముందుగా మల్చింగ్‌ విధానంలో సాగుచేసిన పంటలుప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేస్తున్న మల్చింగ్‌ కవర్‌ను తీసుకోవాలి. పొలంలో ప్రతి మల్చింగ్‌ కవర్‌కు నాలుగు ఫీట్ల దూరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తరువాత డ్రిప్పుతో పంటకు నీరు చేరేలా సమీపంలో విత్తనాన్ని విత్తే ప్రదేశంలో మల్చింగ్‌ కవర్‌కు చిన్న రంద్రం ఏర్పాటు చేయాలి. అందులో విత్తనానికి విత్తనానికి మధ్య సుమారు 60 సెంటిమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. ఇలా ఏర్పాటు చేసిన మల్చింగ్‌ కవర్‌తో సుమారు మూడు సార్లు అదే ప్రదేశంలో విత్తనాన్ని విత్తుకుని పంటలను సాగు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

చీడపీడల నియంత్రణ..

ఈ విధానంలో ఎలాంటి కలుపు రాకపోవడంతో పాటు పంటను చీడపీడల నుంచి కాపాడవచ్చు. గతంలో రైతులకు అవగాహన లేక పంటలను మామూలుగా సాగుచేసి కలుపు వచ్చిన తరువాత వేలకు వేలు డబ్బులు ఖర్చుపెట్టేది. తెలంగాణ ప్రభుత్వం రైతులు అధిక దిగుబడులు సాధించాలనే సంకల్పంతో తక్కువ ధరకు సబ్సిడీలు, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నది. 

అధిక దిగుబడులు సాధించొచ్చు

మల్చింగ్‌ సాగు విధానాన్ని ఎంచుకుంటే  సాధారణం కంటే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. నాకున్న పొలంలో మల్చింగ్‌ సాగుతోనే సాగుచేసి, అధిక దిగుబడులు సాధించాను. ఎకరాకు  రూ.12వేల ఖర్చవుతుంది. అందులో ప్రభుత్వం రూ.6వేలు ఇస్తుంది. పంటలకు చీడపీడలు సోకకుండా ఉంటుంది. కూరగాయలు కూడా బాగా పెరుగుతాయి. ప్రతి ఒక్క రైతు ఈ సాగు విధానాన్ని ఎంచుకుని అధిక దిగుబడులు సాధించాలి. 

- మొద్దు అంజిరెడ్డి, ఉత్తమరైతు

VIDEOS

logo