బుధవారం 27 జనవరి 2021
Agriculture - Jan 14, 2021 , 01:16:36

కర్షక సంక్రాంతి

కర్షక సంక్రాంతి

  • అరవై ఎకరాల్లో.. అద్భు త సేద్యం

సంక్రాంతి అంటేనే కర్షకుల పండుగ. పొలాల పండుగ. మట్టి నుంచి అన్నాన్ని మొలకెత్తించే అన్నదాతల ఇంట కాంతిని నింపే పండుగ. పంటచేలు పరవశించి, ఫలసాయం బండినెక్కి.. రైతన్న ఇంటికి చేరే పర్వదినమిది. పంటలు పండేందుకు కారణమై, తమకు జీవనాధారమైన పశువులను ‘కనుమ’ పేరుతో పూజించుకునే శుభ సందర్భమిది. దుక్కి దున్ని నీరుపెట్టి..  నారు పోసి నాట్లు వేసి..చీడపీడలు సోకకుండా కన్నబిడ్డల్లా పెంచి.. పంట చేతికొచ్చిన రోజున అన్నదాత ఆనందంగా జరుపుకునే ‘సంక్రాంతి’ సందర్భంగా ఆదర్శ రైతుపై ప్రత్యేక కథనం..

ఒకటీ రెండూ కాదు.. ఆ రైతు 60 ఎకరాల్లో అద్భుతమైన సేద్యం చేస్తున్నాడు. ‘ఎక్కువ భూమి, తక్కువ పెట్టుబడి’ అనే కాన్సెప్ట్‌తో ముందుకు సాగుతున్నాడు. మరోవైపు ప్రజారోగ్యాన్ని పాడుచేస్తున్న రసాయన మందులను పక్కనపెట్టి, సొంతంగా సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నాడు. ప్రకృతి సేద్యం ద్వారా పత్తి, ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ, లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. వ్యవసాయంలో అధిక లాభాలను ఆర్జిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వెంకట్‌ రెడ్డి సక్సెస్‌ స్టోరీ.. 

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్ల గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డికి, వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. తనకున్న 61 ఎకరాల్లో బిందుసేద్యం ద్వారా కూరగాయలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు. ఎక్కడా రసాయన ఎరువులు వాడకుండా, సొంతంగా సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటున్నాడు. ప్రకృతి వ్యవసాయ విధానంలో తనవైన సీవీఆర్‌ (చింతల వెంకటరామ్‌రెడ్డి) పద్ధతులను అవలంబిస్తూ అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్నాడు. 

సేంద్రియ విధానంలో పత్తి

దాదాపు 50 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నాడు వెంకట్‌రెడ్డి. మరో 11 ఎకరాల్లో మిరప, కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నాడు. విత్తనాలు వేసింది మొదలు.. పంట చేతికొచ్చే దాకా రసాయన ఎరువుల మాటే ఎరుగడు. ఆహారపంటలతోపాటు వాణిజ్య పంట అయిన పత్తిని కూడా సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నాడు.  కేవలం రూ.60వేల పెట్టుబడితో మిరప పంట సాగు చేసి, 300 క్వింటాళ్ల దిగుబడితో ఏటా రూ. 3లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరానికి రూ.20 వేల ఖర్చుతో పత్తిని సాగు చేస్తూ, రికార్డు స్థాయిలో దిగుబడిని సాధిస్తున్నాడు. దీంతోపాటు పంటల్లో కలుపుతీయడం, ఇతరత్రా పనులకు కూడా సొంతంగా తయారుచేసుకున్న పరికరాలనే వాడుతున్నాడు. ఫలితంగా కూలీల కొరతలాంటి సమస్యలను అధిగమిస్తున్నాడు. తాను పండిస్తున్న ఆర్గానిక్‌ కూరగాయలకు మంచి డిమాండ్‌ ఏర్పడటంతో, స్వయంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి మరీ విక్రయిస్తున్నాడు. తద్వారా మంచి లాభాలను గడిస్తున్నాడు. 

...కలాలి కుమార్‌ గౌడ్‌

ఇటు లాభం.. అటు ఆరోగ్యం.. 

రసాయన ఎరువుల వాడకంతో రైతులకు పెట్టుబడి పెరిగి, ఆదాయం తగ్గుతున్నది. ఆ పంటలను ఆహారంగా స్వీకరించిన ప్రజలకు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారంగానే కొన్నేండ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. దీనివల్ల నాకు లాభాలు రావడంతోపాటు వాటిని తినే ప్రజలు ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. భూసారం కూడా దెబ్బతినడం లేదు. గతేడాది 30 ఎకరాల్లో పత్తిపంట సాగుచేశా. ఈ ఏడాది కూడా 50 ఎకరాల్లో పత్తి వేశా. రైతులంతా సేంద్రియ ఎరువులపై దృష్టిపెడితే పెట్టుబడులు తగ్గి, మంచి లాభాలు వస్తాయి. ప్రజలకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించవచ్చు.

- వెంకట్‌రెడ్డి, రైతు పల్వట్ల


logo