మంగళవారం 26 మే 2020
Agriculture - Apr 01, 2020 , 18:49:37

పంటల కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిది : సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

పంటల కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిది : సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

నిజామాబాద్‌ : పప్పుశనగ, పొద్దుతిరుగుడు రైతులు ఆందోళన చెద్దొద్దని సంబంధిత రైతుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి పంటలను కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. మంత్రి నేడు నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా జక్రాన్‌పల్లి మండలం నారాయణపేట గ్రామంలో పసుపు దిగుబడులను అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకెళ్తుందన్నారు. పప్పుశనగ, పొద్దతిరుగుడు రైతులు అతిత్వరలోనే ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయాన్ని వింటారన్నారు. 

పప్పుశనగ లక్షా 89 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానుంది. కాగా కేంద్రం 47 వేల 600 మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు అనుమతించిందన్నారు. మరొవైపు పొద్దతిరుగుడు 7 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా ఉండగా కేంద్రం కేవలం 1,700 మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు మాత్రమే అవకాశం ఇచ్చిందన్నారు. కాగా జొన్నల కొనుగోలుకు అసలు అనుమతే ఇవ్వలేదన్నారు. రాష్ట్ర పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే సంతోషం. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులెవరూ ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకురావొద్దన్నారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా మార్కెటింగ్‌ శాఖ ద్వారా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కూపన్ల ప్రకారం కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo