గరుడ మిరపతో లాభాలు ఘనం.. ఎకరానికి 2.50 లక్షల ఆదాయం

- నారు వేసిన 45రోజుల్లోనే పంట చేతికి..
- యాజమాన్య పద్ధతులు పాటిస్తే చాలు
- ఆదర్శంగా నిలుస్తున్న ఇద్దరు మానుకోట రైతులు
- పచ్చిమిర్చి సాగులో వచ్చిన కొత్త విధానం రైతులను లాభాల బాట పట్టిస్తున్నది. ఒక్కసారి నారు వేస్తే ఎకరానికి సుమారు రూ.2.50 లక్షల ఆదాయం తెచ్చిపెడుతోంది. సాధారణంగా ఎకరానికి 25టన్నులు మాత్రమే వస్తుండగా మల్చింగ్ పద్ధతిలో ఐజెన్ గరుడ విత్తనం వేస్తే 35నుంచి 40టన్నుల దిగుబడి వస్తుంది. ఒక్కసారి నారుపోస్తే చాలు 15రోజులకోసారి పంట తీయవచ్చంటున్నారు ఇద్దరు మానుకోట రైతులు. - మహబూబాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ)
పచ్చిమిర్చి సాగులో మల్చింగ్ విధానం రైతులకు అధిక ఆదాయం తెచ్చిపెడుతున్నది. మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులు వినూత్నంగా సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణ సాగు పద్ధతుల్లో పెట్టుబడి పోను ఆదాయం తక్కువ వస్తుండడంతో మల్చింగ్ విధానానికి మొగ్గుచూపుతున్నారు.
సాగుచేసే విధానం
ముందుగా భూమిని సాల్, ఇర్వాల్ దున్నాలి. అనంతరం భూమిని బెడ్లు (బోదెలు) కొట్టాలి. ఒక్కో సాలు మూడుఫీట్ల వెడల్పుతో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. భూమిలో పోషకాల లోపం రాకుండా (జింక్, బోరస్, కాల్షియం, మెగ్నీషియం) ఫార్ములా 4 వాడాలి. తర్వాత వేప పిండి వేయాలి. డ్రిప్ పైపులు ప్రతి సాలుకు వేయాలి. మల్చింగ్ పేపర్‌ను మధ్య హోల్స్ చేసి బోదెలపై పరువాలి. అనంతరం మిరప నారు నాటాలి. అవసరాన్ని బట్టి రోజుకు 30 నిమిషాల చొప్పున నారుకు డ్రిప్ ద్వారా నీరందించాలి. నాటిన నుంచి 45రోజులకు పచ్చిమిర్చి కోతకు వస్తుంది.
ఒకసారి కోతకు వచ్చిన తరువాత ప్రతి 10-15 రోజులకోసారి కాయలు తెంపుకోవచ్చు. మిర్చినారు ఒకసారి నాటితే 6నుంచి 8 నెలల వరకు కాస్తుంది. మొక్కలకు పురుగు, చీడ పట్టకుండా చూస్తూ, ఎరువులు, మందులు పిచికారీ చేయాలి. అధిక వర్షాలు కురిసినప్పుడు పచ్చి మిర్చి మొక్కలు పాడవకుండా చూసుకోవాలి. మల్చింగ్ విధానంలో ఎక్కువ కలుపుతీయడం ఉండదు. ఒక ఎకరాకు మల్చింగ్ పేపర్‌కు రూ.15వేలు ఖర్చు వస్తుంది. ఉద్యానశాఖ ద్వారా డ్రిప్ పైపులు సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని మార్కెట్లకు ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ నుంచి పచ్చిమిర్చి సరఫరా అవుతున్నది. లోకల్‌గా సాగుచేసిన మిర్చిని మహబూబాబాద్, తొర్రూరు మార్కెట్లకు తరలిస్తున్నారు.
ఎకరాకు రూ.2.50 లక్షల ఆదాయం
నేను ఎకరంన్నర భూమిలో ఐజెన్ గరుడ రకం పచ్చిమిర్చిని సాగు చేసిన. ఇప్పటికీ ఇది మూడో పంట. ఎకరాకు ఖర్చులు పోను రూ.2.50లక్షల ఆదాయం వచ్చింది. పచ్చిమిర్చి సాగును యాజమాన్య పద్ధతిలో చేపడితే పెట్టుబడి, కూలీల ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. రెండు సార్లు వేసిన మిర్చి పంట మహబూబాబాద్, తొర్రూరు మార్కెట్ల అమ్మిన. ఇప్పుడు చేల వద్దకే వచ్చి పచ్చిమిర్చి కొంటున్నరు. పంట సాగు గురించి ఇతర రైతులకు వివరిస్తూ, వారిని ప్రోత్సహిస్తున్న. మక్క స్థానంలో పచ్చిమిర్చి వేసేలా అవగాహన కల్పిస్తున్న. నేను చెప్పిన తర్వాత నలుగురు రైతులు పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు.
- కాలేరు నేతాజీ, రైతు,
చిన్నముప్పారం
రెండేళ్ల నుంచి పండిస్తున్న
నేను రెండేళ్ల నుంచి గరుడ రకం పచ్చి మిర్చి పండిస్తున్న. ఆదాయం బాగానే వస్తున్నది. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు కొంత పంట దెబ్బతిన్నది. మొత్తం మిర్చికి అన్ని ఖర్చులూ పోను రూ.2లక్షల ఆదాయం వచ్చింది. మా గ్రామంలోని రైతులకు పచ్చిమిర్చి సాగు చేయాలని చెప్పిన. ఆరుగురు రైతులు ఈ సారి పచ్చిమిర్చి వేసిన్రు. గతంల రైతులకు ఉద్యానశాఖ అంటే తెల్వకపోయేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్ర భుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉద్యాన పంటలపై అవగాహన కల్పించడం ద్వారా సాగు కు రైతులు ముందుకొస్తున్నరు. రైతులకు అన్ని గ్రామాల్లో ఏ పంటలు వేసుకోవాలనే అంశంపై శిక్షణ కూడా ఇస్తున్నరు.
- గోపాల్‌రెడ్డి, రైతు, ఆలేరు
తాజావార్తలు
- ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- కేంద్ర మంత్రికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్
- శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా టామ్ మూడీ
- టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- అంబేద్కర్ ఆదర్శనీయుడు : మంత్రి కొప్పుల ఈశ్వర్
- మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పులు.. 18 మంది మృతి
- ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు
- రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు
- మినీ డ్రెస్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్..ఫొటోలు హల్చల్
- 'ఈ కథలో పాత్రలు కల్పితం' రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి తలసాని