ఆదివారం 07 మార్చి 2021
Agriculture - Feb 03, 2021 , 08:57:00

'లిల్లీ' పంట సాగు.. లాభాలు బాగు

'లిల్లీ' పంట సాగు.. లాభాలు బాగు

  • తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి
  • ఒక్కసారి పంట వేస్తే మూడేళ్ల దాకా దిగుబడి
  • మార్కెట్‌లో కిలో పూల ధర 100కు పైనే
  • మంచరామిలో యువరైతు శ్రావణ్‌ సేద్యం

సుల్తానాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 2: లిల్లీ ఫ్లవర్‌ను వివాహాది శుభకార్యాల్లో డెకరేషన్‌ కోసం వినియోగిస్తారు. వీటిలో మిథైల్‌ బెంజోయేట్‌, మిథైల్‌ సాలిసిలేట్‌ ఉండడం వల్ల సుగంధ ద్రవ్యాల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. లిల్లీ పూలలో సింగిల్‌, డబుల్‌ రకాలు ఉంటాయి. సింగిల్‌ రకాలను పూలదండలు, సుగంధ ద్రవ్యాల తయారీలో.. డబుల్‌ రకాలను బొకేలతోపాటు ఫ్లవర్‌ వాజుల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ పూలను వివాహాది శుభ కార్యక్రమాలు, పండుగలు, పూజలు, ఇంటీరియర్‌ డెకరేషన్‌ కోసం వాడతారు. 

మూడేళ్ల దాకా దిగుబడి..

లిల్లీ పంట ఒక్కసారి సాగు చేస్తే మూడేళ్ల దాకా దిగుబడి ఇస్తుంది. పంట వేసిన ఆరు నెలల నుంచి దిగుబడి మొదలవుతుంది. రోజూవారీగా కోతకు వస్తూ స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. సంవత్సరంలో రెండు సీజన్లలో పూలు లభిస్తాయి. అయితే మొదటి రెండేళ్లలో దిగుబడి అధికంగాను, మూడో సంవత్సరంలో తక్కువగాను ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే సాగు బంగారమే అవుతుంది. 

రోజువారీగా ఆదాయం..

మన రాష్ట్రంలో లిల్లీ పూలకు మంచి గిరాకీ ఉన్నది. కిలో విడిపూల ధర 100కు పైనే ఉంటుంది. సీజన్‌ బాగుంటే 200 దాకా వెళ్తుంది. ఎకరా సాగుకు 60వేల నుంచి 70 వేల వరకు పెట్టుబడి అవుతుంది. రోజువారీగా పూలు చేతికి రానుండగా, గుంటకు అర కిలోకు పైనే పూలు వస్తాయి. ఎకరాకు తక్కువలో తక్కువ రోజుకు 20 కిలోల పూల దిగుబడి ఉంటుంది. ఈ లెక్కన ఎకరాకు రోజువారీగా 2వేలపైనే ఆదాయం వస్తుంది. అంచనా ప్రకారం ఏడాదికి ఖర్చులు అన్నీ పోను 2 లక్షల దాకా ఆదాయం వస్తుందని, మూడేళ్లలో మొత్తంగా 6లక్షల నుంచి 7 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని పెద్దపల్లి ఉద్యానవనశాఖ అధికారి జ్యోతి తెలిపారు. 

యానమాన్య పద్ధతులే ముఖ్యం.. 

లిల్లీ పంట సాగుకు నీరు సులభంగా ఇంకిపోయే గరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. జూలై- ఆగస్టు నెలల మధ్య సాగు చేయడం మంచిది. యాజమాన్య పద్ధతులు పాటించాలి. సాగులో దుంపల సేకరణ చాలా ముఖ్యం. తెగుళ్లు సోకని ఆరోగ్యవంతమైన తోట నుంచి మాత్రమే ఎంపిక చేసుకోవాలి. 2 నుంచి 3 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న దుంపలైతే పూల కాడ బలంగా పెరుగుతుంది. దుంపలు నాటే ముందు నేలను బాగా తడి చేసుకోవాలి. మొలకెత్తిన తర్వాత మళ్లీ నీటి తడి ఇవ్వాలి. వాతావరణాన్ని బట్టి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీళ్లు పెడితే సరిపోతుంది. 

రాణిస్తున్న యువరైతు..

కల్వల శ్రావణ్‌కుమార్‌. సుల్తానాబాద్‌ మండలం మంచరామికి చెందిన ఈ యువకుడు డీఎంఎల్‌టీ పూర్తి చేశాడు. కరీంనగర్‌లోని ఓ దవాఖానలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తూ, లాక్‌డౌన్‌తో ఉపాధి కరువై ఇంటివద్దే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో లిల్లీ పూల సేద్యం గురించి తెలుసుకొని ఎలాగైనా పంట వేయాలని నిర్ణయించుకున్నాడు. తన 5 గుంటలకు తోడు బంధువుల వద్ద 20 గుంటల భూమిని కౌలు తీసుకున్నాడు. గత ఆగస్టులో బెంగళూర్‌ నుంచి లిల్లీ దుంపలను తెప్పించి సాగు చేశాడు. సాగుకు ఇప్పటిదాకా 70వేల దాకా పెట్టుబడి పెట్టాడు. గత డిసెంబర్‌ నుంచి దిగుబడి మొదలు కాగా, సుల్తానాబాద్‌, పెద్దపల్లి పట్టణాలకు తరలిస్తూ ఆదాయం పొందుతున్నాడు.

మంచి ఆదాయం వస్తుంది.. 

లిల్లీ పంట సాగుతో మంచి ఆదాయముంటుంది. మార్కెట్‌లో కిలో పూల ధర 100కు పైనే ఉంది. ఇప్పుడు నేను రోజూ గుంట స్థలంలో అరకిలో పూలు తీస్తున్నా. ఈ లెక్కన 25 గుంటల స్థలంలో 12కిలోకు పైనే దిగుబడి వస్తుంది. అంటే రోజూ 1200- 1500 మధ్య  ఆదాయం పొందుతున్న. ఖర్చులు పోను రోజుకు 1000 దాకా మిగులుతున్నది. 

- కల్వల శ్రావణ్‌కుమార్‌, యువరైతు


VIDEOS

logo