శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Agriculture - Jan 21, 2021 , 00:06:16

యంత్రం..రాబడి మంత్రం!

యంత్రం..రాబడి మంత్రం!

యంత్రం.. రైతన్నకు నయా నేస్తమైంది. విత్తనాలు వేయడం నుంచి పంట చేతికొచ్చేదాకా అన్ని దశల్లోనూ అన్నదాతకు చేయూతనిస్తున్నది. గతంతో పోలిస్తే.. వ్యవ‘సాయానికి’కూలీల లభ్యత, పశుసంపద తగ్గడంతో సాగులో యా్ంరత్రీకరణ కీలకమైంది. ఫలితంగా, ఒకప్పుడు పశువులూ పాలేర్లతో నిండుగా కనిపించిన వ్యవసాయ క్షేత్రం.. ఇప్పుడు ఆధునిక యంత్రాలతో కొత్త కళను సంతరించుకొంటున్నది.

పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానమూ మారుతున్నది. అన్నదాతల అవసరాలకు తగ్గట్లుగా, వ్యవసాయానికి సరికొత్త సాంకేతికత తోడవుతున్నది. ప్రభుత్వం సబ్సిడీల ద్వారా తోడ్పాటును అందిస్తుండగా, చిన్న సన్నకారు రైతులు సైతం యాంత్రీకరణవైపు అడుగులు వేస్తున్నారు. దీంతో దుక్కి దున్నడం మొదలు దిగుబడి చేతికొచ్చేదాకా ప్రతి పనినీ చేసిపెట్టే అనేక యంత్రాలు ప్రయోగశాలల నుంచి పొలం బాట పడుతున్నాయి. అయితే, వీటి గురించి అనేకమంది రైతులకు సరైన సమాచారం దొరకడం లేదు. తమ అవసరాలు ఏమిటి? దానికి కావాల్సిన యంత్రం ఏది? అనే విషయాలపై అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు, వాటికి పరిష్కారం చూపే యంత్రాల వివరాలు ..

విత్తనమేద్దాం


మక్క, పత్తి, వేరుశనగతోపాటు ఇతర విత్తనాలను వేసే యంత్రం ఇది. ఇప్పటికే పలు రకాల విత్తన యంత్రాలున్నా, ఇది కాస్త భిన్నమైంది. మిగతా యంత్రాల ద్వారా ఒకేసారి ఎక్కువ విత్తనాలు పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా సాళ్ల మధ్య, వరుసల మధ్య దూరం సరిగ్గా ఉండదు. కానీ, ఈ యంత్రం ద్వారా ఒకసారికి ఒక విత్తనం మాత్రమే దుక్కిలో పడుతుంది. ముఖ్యంగా పత్తి విత్తనాలు వేసేందుకు ఎంతో ఉపయోగకరం. ఈ యంత్రం వల్ల సాళ్ల మధ్య, మొక్కల మధ్య దూరం సమానంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు కూడా. ఇందుకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంది. మీటర్ల వారీగా దూరం పెంచుకోవచ్చు, తగ్గించుకోనూవచ్చు. దీనివల్ల విత్తనాలను ఆదా చేసుకోవచ్చు. అదే విధంగా విత్తనాలను మరింత వేగంగా వేసుకోవచ్చు. ఈ యంత్రంతో విత్తనాలను లోతుగా నాటడం వల్ల మొక్క బాగా పెరిగి, దిగుబడి మంచిగా వచ్చే అవకాశమున్నది. పీడనం ఆధారంగా పని చేసే ఈ యంత్రాన్ని ట్రాక్టర్‌ సాయంతో ఉపయోగించవచ్చు. 

  • ధర 5 లక్షల నుంచి 6 లక్షల వరకూ పలుకుతుంది. ఇది ప్రస్తుతం ప్రయోగ దశలోఉంది.

ముక్కలు ముక్కలుగా.. 


పశుసంపద తగ్గిపోతుండటంతో రైతులు పొలంలోనే వరిగడ్డిని కాల్చేస్తున్నారు. దీంతో వాయు కాలుష్యం పెరుగుతున్నది. భూసారం కూడా దెబ్బతింటున్నది. ఇక పత్తి, మక్క, కందులు లాంటి చేలల్లో పంటల అవశేషాలను ఏరివేయడం కూడా కష్టంగా మారింది. దీనికి పరిష్కారంగానే పొలంలో వరి కోసిన తర్వాత మిగిలే గడ్డి కొయ్యలు, గడ్డిని ముక్కలు ముక్కలుగా చేసే ప్రత్యేక యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ ‘షెడ్డర్‌ కమ్‌ మల్చర్‌' యంత్రంతో పొలంలో కొయ్యలు కనిపించకుండా చేయవచ్చు. ఇది కొయ్యలు, గడ్డి ముక్కలను దూరదూరంగా వెదజల్లుతుంది. పొలంలో మళ్లీ నీళ్లు పెట్టినప్పుడు ఈ గడ్డి సులువుగా మురిగి.. నేలను సారవంతంగా మారుస్తుంది. ముక్కలైన గడ్డి నేలలో తేమ శాతాన్ని కాపాడుతుంది. కేవలం గడ్డినే కాదు పత్తి, మక్క, కందులు, పెసర్లు వంటి అన్ని పంటల అవశేషాలను తుక్కుగా చేస్తుంది.

  • ధర 1.5 లక్షల నుంచి 2.2 లక్షల వరకూ ఉండవచ్చు.

ఒకేసారి రెండు పనులు


సాధారణంగా ఏ విత్తనాలు వేయాలన్నా మొదట దుక్కి దున్నుకోవాలి. ఆ తర్వాత విత్తనాలు వేసుకోవాలి. కానీ, ఇప్పుడు ఈ రెండు పనులనూ ఒకేసారి చేసేలా ప్రత్యేక యంత్రం అందుబాటులోకి వచ్చింది. ‘జీరో టిల్‌ సీడ్‌ డ్రిల్‌' యంత్రం ద్వారా ఒకేసారి దుక్కి దున్నడంతోపాటు విత్తనాలు కూడా వేసుకోవచ్చు. ఈ యంత్రానికి ఉండే నాగళ్లు ఓవైపు దుక్కిని దున్నుతుంటే, మరోవైపు ఏర్పాటు చేసిన ప్రత్యేక పైపుల ద్వారా 

విత్తనాలు ఆ వరుసల్లో పడిపోతాయి. 

  • దీని ధర సుమారు రూ.లక్ష

రిజిడ్‌ టైన్‌ యంత్రం :

ఈ యంత్రంతో ఒకేసారి విత్తనంతోపాటు ఎరువును కూడా వేసుకునే వీలుంది. ఇందులో రెండు వేర్వేరు రకాల పైపులు ఉంటాయి. ఒక పైపులో నుంచి విత్తనాలు పడుతుంటే, మరో పైపులో నుంచి ఎరువు వస్తుంది. దీనిద్వారా అన్ని రకాల విత్తనాలనూ నాటుకోవచ్చు. విత్తనాల మధ్య సమాన దూరం ఉండేలా ఈ యంత్రాన్ని అమర్చుకునే వీలు ఉంటుంది. దీనివల్ల రైతుకు ఎంతో వెసులుబాటు.

  • ధర రిజిడ్‌ టైన్‌ యంత్రం 50 వేల నుంచి 80 వేల మధ్యలోఉంటుంది.

ఒడ్డు చెక్కి.. ఒడ్డు పెట్టి..


వరిసాగులో రైతుకు కష్టమైన పని ఒడ్డు(గట్లు) చెక్కడం, ఒడ్డు పెట్టడం. నాట్లు వేయడానికి ముందే ప్రతిసారీ కొత్తగా ఒడ్డు చెక్కి, పెట్టాల్సిందే. లేకుంటే ఒడ్లకు బుంగలు పడి, నీరు బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ పని కష్టంగా ఉండటంతో కూలీలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా ఎక్కువ మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నూతన యంత్రం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు ‘రిడ్జ్‌ ప్లాస్టింగ్‌ మెషిన్‌'. ఈ ప్రత్యేక యంత్రం, పొలంలోని పాత ఒడ్లను చెక్కడంతోపాటు కొత్త ఒడ్లను పెడుతుంది. దీనిద్వారా ప్రతి గంటకూ 1550 మీటర్ల ఒడ్డును పెట్టవచ్చు. ఈ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల ప్రతి రైతుకూ ఎకరానికి రూ. 900 నుంచి రూ.1000 దాకా ఆదా అవుతుంది. కేవలం వరిపొలంలోనే కాకుండా ఇతర సాధారణ పంట ల్లోనూ కట్టలు కట్టుకోవచ్చు. 

  • ధర సుమారు 3.50 లక్షల వరకూ ఉంటుంది.

గడ్డి మోపులు కట్టేద్దాం 


హార్వెస్టర్లతో వరి కోసిన తర్వాత మిగిలిపొయిన గడ్డిని మోపులు కట్టడం రైతులకు సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా వచ్చిందే ‘స్ట్రా బేలర్‌' యంత్రం. దీనిద్వారా పొలంలోని గడ్డిని మోపులుగా కట్టేయొచ్చు. గంటన్నర సమయంలోనే ఒక ఎకరం  గడ్డిని కట్టలుగా కట్టేస్తుంది. ప్రతి గడ్డి మోపు బరువూ 15 నుంచి 20 కేజీల వరకు ఉంటుంది. 

  • ధర 3.50 లక్షల నుంచి 9 లక్షల వరకూ.

పంటలు నూర్పేందుకు.. 


కంది, మక్కజొన్న, వేరుశనగ, శనగ, పెసర, పొద్దు తిరుగుడు లాంటివి కోసిన తర్వాత, వాటినుంచి గింజలను బయటకు తీయాల్సి ఉంటుంది. గతంలోనైతే వాటిని ఎండబెట్టి.. కర్రలతో కొట్టి విత్తనాలను తీసేవారు. కానీ, ఇప్పుడు ఆ పద్ధతి రైతులకు కష్టంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా మరో యంత్రం అందుబాటులోకి వచ్చింది. కోసిన పంటలను ఇందులో వేస్తే, గింజలు బయటికొస్తాయి. ఈ యంత్రం సాయంతో ప్రతి గంటకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల పంటను పొతం చేయవచ్చు.  

  • ధర 2 లక్షల నుంచి  4 లక్షల వరకు ఉంటుంది.

మక్కజొన్న, కంది కోసేలా.. 

మక్కజొన్న, కంది పంటలను కోసేందుకు ప్రత్యేకంగా యంత్రాలు లేకపోయినప్పటికీ, వరి కోసే యంత్రం సాయంతోనే ఆయా పంటలను కూడా కోసే అవకాశం ఉంది. ఇందుకోసం హార్వెస్టర్‌లో ప్రత్యేక ప్లేట్స్‌ అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యంత్రం వరిని కోసి వడ్లను ఏ విధంగా వేరు చేస్తుందో.. మక్కలను, కందులను కూడా అలాగే కోసి గింజలను వేరు చేస్తుంది. 

గ్రూపుగా కొంటే ప్రయోజనం

వ్యవసాయంలో రైతుల కోసం అనేక ఆధునాతన వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒక్కో యంత్రం ఖరీదు లక్షల్లోనే ఉంది. కాబట్టి రైతులు ఎవరికి వారు కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు ఒక సంఘంగా ఏర్పడి, పలు రకాల యంత్రాలను కొనుగోలు చేస్తే అధిక ప్రయోజనం పొందవచ్చు. వీటిద్వారా ఎవరికి వారు వ్యవసాయ పనులు చేసుకోవడంతోపాటు వాటిని అద్దెకు ఇవ్వడం వల్ల అదనపు ఆదాయం పొందే అవకాశమున్నది. లేదంటే కొంతమంది యువకులు ఒక గ్రూపుగా ఏర్పడి, పలు నూతన వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చు. వాటిని అద్దెకు ఇవ్వడం వల్ల తాము ఉపాధి పొందడంతోపాటు తోటి రైతులకూ సాయపడవచ్చు. 

నాటు ఇక్కట్లు దూరం 


ఏడాదికేడాది వరిసాగు పెరుగుతుండటంతో నాట్ల సమయంలో కూలీల కొరత కూడా అధికమవుతున్నది. దీంతోపాటు కూలీ డబ్బులు కూడా ఎక్కువగా ఇవ్వాల్సి వస్తున్నది. ఈ సమస్యకు వరి నాటు యంత్రాలు సరైన ప్రత్యామ్నాయంగా మారాయి. ఇప్పటికే మార్కెట్లో పలు రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చిన్నవాటితో పాటు పెద్ద యంత్రాలు కూడా ఉన్నాయి. జయశంకర్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కుబోటో, యాన్మర్‌ యంత్రాలు మంచి పనితనాన్ని కనబరుస్తున్నాయి. సాధారణంగా, కూలీలతో ఒక హెక్టారు వరి నాటుకు సుమారు రూ.6500 వరకు ఖర్చయితే, కుబోట యంత్రం సాయంతో హెక్టారు వరి నాటుకు సుమారు రూ.2156, యాన్మర్‌ సాయంతో సుమారు రూ.2690 దాకా ఖర్చు అవుతుంది. ఈ యంత్రాల సాయంతో వేసిన వరిలో దిగుబడి కూడా అధికంగానే ఉంటున్నది. కుబోట యంత్రం ధర సుమారు రూ.11 లక్షలు. యాన్మర్‌ యంత్రం ధర సుమారు రూ.13 లక్షలు. ఇవి కాకుండా రూ.2.20 లక్షలు, రూ. 2.50 లక్షల ధరలలోనూ పలు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.

తవ్వడం.. ఇక ఈజీ!