బుధవారం 03 మార్చి 2021
Agriculture - Feb 18, 2021 , 00:17:25

అందరిలా కాకుండా.. అరుదైన వ్యవసాయం

అందరిలా కాకుండా.. అరుదైన వ్యవసాయం

  • పేద రైతులను ఒక్కటి చేసిన ‘డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ’ 

ఆరుగురు స్నేహితుల ఆలోచన.. నాలుగు వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన నిరుపేద, బడుగు వర్గాల మహిళలను.. ఆత్మగౌరవంతో నిలిచేలా చేసింది. అందరిలా కాకుండా... అరుదైన వ్యవసాయం చేయిస్తూ.. ఔరా! అనిపిస్తున్నది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రేమిస్తూ.. ఆరోగ్యంతోపాటు ఆదాయాన్నీ సమకూరుస్తున్నది. 50 మందితో మొదలై.. నాలుగు వేల మంది సభ్యుల స్థాయికి ఎదిగిన ‘డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌)’ విజయ ప్రస్థానమిది. మహిళా రైతుల ఆత్మగౌరవం.. మన పాత పంటల సాగుపై సవివర కథనమిది.

రైతులు సంఘటితమైతే ఏదైనా సాధించగలరు. కానీ, వారిని ఆ దిశగా తీసుకెళ్లే వారు కావాలి. ముందుండి నడిపించే వాళ్లు దొరకాలి. అప్పుడు ఆ కర్షకులు ఎంతటి కష్టమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇందుకు ఉదాహరణే.. డీడీఎస్‌. రైతులను సంఘటితం చేసేందుకు ఇప్పుడు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఫ్‌పీవో)లకు కూడా డీడీఎస్‌ మార్గదర్శకంగా నిలుస్తున్నది. రైతులే భాగస్వాములుగా.. వారు పండించిన పంటలను.. వారే అమ్ముకొని ఉత్తమ లాభాలు గడించేలా డీడీఎస్‌ మార్గనిర్దేశనం చేస్తున్నది.

ఆరుగురి ఆలోచన..

పీవీ సతీశ్‌, బీఎస్‌ ఆరోరా, ఎంవీ శాస్త్రి, కేఎస్‌ గోపాల్‌, రఘు కిదాంబి, విఠల్‌ రాజాం.. వీరంతా వివిధ రంగాలకు చెందిన స్నేహితులు. సమాజం తమకు ఎంతో ఇచ్చింది.. తిరిగి సమాజానికి ఏం ఇవ్వగలమనే అంతర్మథనం వారిలో మొదలైంది. ఈ ఆలోచనలు మదిలో మెదులుతుండగానే, వారికి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ కనిపించింది. అక్కడి ప్రజల పేదరికం, కరువు కదిలించింది. ఏమైనా చేయాలనుకున్నారు. వారితో పలుమార్లు చర్చించారు. వ్యవసాయంతోనే జీవితాలను గాడిలో పెట్టొచ్చనే నిర్ణయానికి వచ్చారు. అదికూడా సాధారణ వ్యవసాయం కాకుండా, విభిన్న వ్యవసాయం చేయించాలని ఆలోచించారు. ఇందుకోసం ఓ వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ ప్రయత్నంలోనే 1983లో డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌)ని స్థాపించారు. 

మూడు సంఘాలతో మొదలై..

డీడీఎస్‌కు అనుసంధానంగా ప్రతి గ్రామంలో రైతులతో సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే చుట్టు పక్క పల్లెల్లో పర్యటించి, తమ ప్రణాళిక గురించి వివరించారు. ఇందులో చేరేందుకు మొదట్లో రైతులు ముందుకు రాలేదు. కొంతమంది మాత్రం ఆసక్తి చూపారు. దీంతో తొలుత 50 మందితో మూడు సంఘాలను ఏర్పాటు చేశారు. క్రమంగా మెరుగైన పనితీరు కనిపించడం, ఎదుగుదల ప్రారంభం కావడంతో ఇతర గ్రామాల రైతులుకూడా ముందుకొచ్చారు. అలా ఇప్పుడు ఈ సంఘం సేవలు 75 గ్రామాలకు విస్తరించాయి. ప్రతి గ్రామంలో ఒకటి చొప్పున మొత్తం 75 సంఘాలున్నాయి. 

అంతా మహిళలే..


డీడీఎస్‌ సంఘాల్లో మహిళా రైతులకు మాత్రమే భాగస్వామ్యం కల్పించారు. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఈ ఆరుగురు స్నేహితులు తొలుత ఆయా గ్రామాల్లోని రైతులతో సమావేశాలు నిర్వహించి, సంఘాల ఏర్పాటుకు ప్రయత్నించారు. అయితే వారిలో డబ్బు మీద ఆశ తప్ప.. సంఘాన్ని నిలిపి భవిష్యత్‌కు మార్గం వేయాలనే ఆలోచన, తపన కనిపించలేదు. దీంతో అలాంటివాళ్లను పక్కన పెట్టి, మహిళా రైతులకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ఆ విధంగా ఇప్పుడు డీడీఎస్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రతి వింగ్‌కూ మహిళలే సారథ్యం వహిస్తున్నారు. నిర్వహణ మొత్తాన్నీ వారే చూస్తున్నారు. 

నాలుగు వేల కుటుంబాల్లో.. 

డీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘాలను నిలిపేందుకు ఆ స్నేహితులు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా సంఘంలోని ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రతి సంఘంలోని సభ్యులు మేకలు, గొర్రెలు, గేదెలు కొనుగోలు చేసేందుకు రుణాలు మంజూరు చేశారు. ఈ తర్వాత వారిని క్రమంగా వ్యవసాయం వైపు నడిపించారు. అదీ అందరూ చేస్తున్న వ్యవసాయం మాదిరిగా కాకుండా, విభిన్నంగా చేయించాలని భావించారు. వారు అనుకున్నట్లే రైతులు కూడా సరికొత్తగా ముందుకు‘సాగు’తూ ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఈ విధంగా సుమారు నాలుగు వేల కుటుంబాల్లో డీడీఎస్‌ వెలుగులు నింపుతున్నది.

చిరు ధాన్యాలు, పప్పు దినుసులే..


జహీరాబాద్‌ చుట్టుపక్కలంతా కరువు ప్రాంతమే. కాబట్టి, అక్కడ వరిలాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు పండించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే డీడీఎస్‌ సభ్యులు వినూత్నంగా ఆలోచించారు. అందరిలా వరి, పత్తిలాంటివి కాకుండా చిరు ధాన్యాలు, పప్పు దినుసుల సాగుపై దృష్టి పెట్టారు. భవిష్యత్‌లో వీటి అవసరం ఎక్కువగా ఉంటుందని గుర్తించి, మొదటి నుంచీ స్థానికులతో ఈ దిశగా వ్యవసాయం చేయిస్తున్నారు. తమకు ఆర్థిక భరోసాతోపాటు ఆరోగ్యాన్నీ అందించే ఈ నూతన సాగుపై రైతులుకూడా ఆసక్తి చూపించారు. స్థానికంగా కొంతమంది మహిళా రైతులు పాత కాలపు పంట గింజలను భద్రపరిచారు. మహిళా రైతు అంజమ్మ దగ్గర సుమారు 80 రకాల విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలనే రైతులు తిరిగి పండిస్తున్నారు. ప్రతిరైతూ కనీసంగా 15 నుంచి 20 రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ఎక్కడా రసాయన ఎరువులు, పురుగు మందుల జోలికి వెళ్లరు. డీడీఎస్‌ ఆధ్వర్యంలోనూ పాత పంటల విత్తనాలను పరిరక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సీడ్‌ బ్యాంక్‌'ను ఏర్పాటు చేశారు. విత్తనాలు అవసరమైన రైతులకు ఇక్కడి నుంచే అందిస్తారు. ఈ విధంగా ఇప్పుడు డీడీఎస్‌ సంఘాల్లోని సభ్యులు దాదాపుగా చిరు ధాన్యాలు, పప్పు దినుసులనే పండిస్తున్నారు. మోనో క్రాపింగ్‌ కాకుండా వారికున్న ఎకరం, అరెకరం పొలంలోనే 15-20 రకాల పంటలు పండిస్తున్నారు. కుటుంబ ఆకలి తీరడంతోపాటు మిగులు పంటను విక్రయించడం ద్వారా ఆర్థిక స్వావలంబన కూడా పొందుతున్నారు. 

మార్కెటింగ్‌.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌

మహిళా రైతుల పంటలను డీడీఎస్‌ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేస్తారు. దానికి ముందుగా రైతు కుటుంబ అవసరాలు తీరాయో? లేదో? పరిశీలిస్తారు. అవసరాలకు మించి పంటలు పండితేనే కొనుగోలు చేస్తారు. మార్కెట్‌ ధరకన్నా సుమారు 10శాతం అధిక ధర చెల్లిస్తారు. వీటిని డీడీఎస్‌ ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో ప్రాసెస్‌ చేస్తారు. చిరు ధాన్యాలు, పప్పులను విడివిడిగా విక్రయించేలా ప్యాక్‌ చేస్తారు. వీటితో వివిధ రకాల తినుబండారాలు, పౌడర్లను తయారుచేసి విక్రయిస్తారు. అరుదుగా లభించే చిరుధాన్యాలు.. అవికూడా పూర్తిగా ఆర్గానిక్‌ విధానంలో సాగు చేయడంతో ఈ ఉత్పత్తులకు మార్కెట్లో భారీ డిమాండ్‌ ఉంది. ఈ విధంగా రైతుల నుంచి నేరుగా పంటలు కొని, వాటిని ప్రాసెసింగ్‌ చేసి వినియోగదారులకూ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నది. ఈ క్రమంలో సంఘాలు ఏర్పాటుతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన డీడీఎస్‌.. పలు రకాల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నది. 

చదువు లేకున్నా..

డీడీఎస్‌ సంఘాల్లోని మహిళా రైతులు వ్యవసాయానికే పరిమితం కాలేదు. సామాజికంగానూ బలోపేతమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. చదువు రాకపోయినా.. సొంతంగా డాక్యుమెంటరీలు తీస్తున్నారు. వీడియో కెమెరాలను సొంతంగా ఆపరేట్‌ చేస్తూ, రైతుల కష్టాలపై ఇప్పటిదాకా 200లకు పైగా డాక్యుమెంటరీలు చేశారు. ఇందులో కొన్ని అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శించారంటే, ఏ స్థాయికి ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా రైతులకు పంట వివరాలు తెలియజేసేందుకు సొంతంగా ‘విలేజ్‌ రేడియో’నూ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మహిళా రైతులే రేడియో జాకీలు. సంఘం రేడియో ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. వారి సంఘంలో, డీడీఎస్‌లో ఏ కార్యక్రమం జరిగినా మహిళా రైతులే వీడియో గ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తారు. 

ప్రపంచం మెచ్చి.. అవార్డులు అందించి

డీడీఎస్‌ సేవలు, పాత పంటల పరిరక్షణ, మహిళా రైతులకు అండగా నిలిచిన తీరును ప్రపంచ దేశాలు అభినందించాయి. అనేక అవార్డులను అందించాయి. ఆయా దేశాల్లో నిర్వహించిన పలు వ్యవసాయ సెమినార్లకు డీడీఎస్‌ సభ్యులను ఆహ్వానించి.. వారి సూచనలు, సలహాలను తీసుకున్నాయి. ఏ మాత్రం చదువు రాకపోయినా వారికున్న పట్టుదలతో వ్యవసాయంలో రాణించి.. విదేశీ రైతులకు మెలకువలు నేర్పే స్థాయికి మన మహిళా రైతులు ఎదగడం విశేషం. 

ఎఫ్‌పీవోలకు మార్గదర్శిగా..

ఇప్పటి వరకు రైతులు అసంఘటితంగా ఉన్నారు. అయితే వీరిని ఏకం చేయాలని అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ‘ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌' ఏర్పాటును ప్రోత్సహిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌పీవోల ఏర్పాటుతోపాటు రైతు వేదికలను ఏర్పాటు చేసి రైతులను సంఘటితం చేస్తున్నది. ఈ విధంగా ఆయా గ్రామాల రైతులు తమ జీవితాల్లో వెలుగులు నింపుకొనేలా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలకు, డీడీఎస్‌ మార్గదర్శిగా నిలుస్తున్నది. రైతులంతా కలిసికట్టుగా ఉండి.. ఒక క్రమ పద్ధతిలో వ్యవసాయం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో డీడీఎస్‌ చూపిస్తున్నది.

పాత పంటల సంబురం..

చిరు ధాన్యాల సాగును డీడీఎస్‌ ప్రోత్సహిస్తున్నది. పాత పంటల గురించి ప్రతిఒక్కరికీ తెలియజేసేలా ఏటా నెల పాటు ‘పాత పంటల పండుగ’ నిర్వహిస్తున్నది. ప్రత్యేక ఎడ్ల బండ్లలో పాత పంటలు (చిరు ధాన్యాలు)ను ఉంచి.. గ్రామాల్లో ఊరేగిస్తుంది. వాటి ప్రాధాన్యాన్ని ఆయా గ్రామాల రైతులకు వివరించి, సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నది.

ఆహార భద్రత.. స్వతంత్ర జీవనమే లక్ష్యం..

రైతులకు ఆహార భద్రత కల్పించడం, స్వతంత్రంగా జీవించే స్వేచ్ఛను కల్పించడమే మా సంఘం లక్ష్యం. మేం అనుకున్న దానికన్నా రైతులు రెట్టింపు అభివృద్ధి సాధించారు. మా సంఘం తరఫున వారికి ప్రేరణ ఇచ్చి, ఆర్థికంగా అండగా నిలిచాం. మా సంఘం మహిళా రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలిగింది. వ్యవసాయం చేస్తూ.. స్వతంత్రంగా జీవించగలమనే భరోసా కల్పించింది. పాత పంటల పరిరక్షణ, వాటి వల్ల కలిగే ఉపయోగాలను వివరించి, సాగుకు ప్రోత్సహించాం. రైతులు మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మా  సంఘంలోని రైతులంతా విజయం సాధించారు. మిగతా రైతులు కూడా సంఘటితం అయ్యేందుకు కృషి చేయాలి. ఇందుకు అవసరమైన వేదికలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే వ్యవసాయంలో, వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. 

-పీవీ సతీశ్‌, డైరెక్టర్‌, డీడీఎస్‌

-స్వామిరెడ్డి కొమ్మిడి

VIDEOS

logo