e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home వ్యవసాయం పచ్చి రొట్టతో.. పచ్చని పంటలు!

పచ్చి రొట్టతో.. పచ్చని పంటలు!

పచ్చి రొట్టతో.. పచ్చని పంటలు!

ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా, భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. సంప్రదాయ సాగువల్ల భూసారం క్రమంగా తగ్గిపోతున్నది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతులనే మార్చేస్తున్నది. నేలల్లో చౌడు శాతాన్ని పెంచడంతోపాటు సహజ లక్షణాలనూ దెబ్బ తీస్తున్నది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యాన్ని సాగుభూమి క్రమంగా కోల్పోతున్నది. విశృంఖల రసాయన వినియోగాన్ని తగ్గించుకోకుంటే భవిష్యత్తులో భారీమూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే, రైతులు భూసారాన్ని పరిరక్షించడంతోపాటు సాగులో సహజసిద్ధ ఎరువులను వాడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నది.

అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడిపంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతఃసిద్ధంగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి పంటలో సూక్ష్మపోషకాల లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింప జేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. ఈ పంటలను పొలాల్లో పెంచి, నేలలోనే కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. నేల సహజత్వాన్ని కాపాడిన వాళ్లమూ అవుతాం. అధిక దిగుబడులనూ, భారీ లాభాలనూ పొందే అవకాశం ఉన్నది. అందుకోసమే పచ్చిరొట్ట పెంపకంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచేలా వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పిస్తున్నది. భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించేలా రాష్ట్ర రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలను రైతులకు 65% రాయితీపై ఇస్తున్నది. గతేడాదికంటే ఎక్కువ విస్తీర్ణంలో పచ్చిరొట్టను వారిచేత సాగు చేయించేలా సర్కారు కృషి చేస్తున్నది.

తేలికైన సాగు

- Advertisement -

పొలాల్లో పచ్చిరొట్టను సాగు చేయడం ఎంతో తేలిక. వీటి విత్తనాలను రుతుపవనాల ఆరంభంలోనే వేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వేసవిలో పంటలు కోసిన తర్వాత బీడు భూములను కలియ దున్నుకోవాలి. తొలకరి వర్షాలు పడగానే దుక్కి దున్నిన పొలాల్లో పచ్చిరొట్ట విత్తనాలను చల్లుకోవాలి. లేదా రెండు పంటలమధ్య కాలంలోనూ కొన్ని రకాల పప్పుజాతి పంటలైన పచ్చిరొట్ట విత్తనాలను వేసుకోవాలి. అవి పూతదశకు (40-50 రోజులు) రాగానే నేలలో కలియదున్నాలి. పసుపు, కందిలాంటి పంటలు వేసినప్పుడు వాటి వరుసల మధ్యలోనూ పచ్చిరొట్టను పండించుకోవచ్చు. దీనివల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందడంతో నేలలో సత్తువ పెరుగుతుంది. పంటకు మేలు కలిగించే పలు రకాల జీవరాశులూ వృద్ధి చెందుతాయి. భూమి కోతకు గురికాదు. నేలలో అలభ్యరూపంలో ఉన్న పోషకాలన్నిటినీ లభ్యరూపంలోకి తీసుకురావడానికి పచ్చిరొట్ట పైర్లు చక్కగా దోహద పడతాయి.

 • పొలాల్లోని నత్రజని వృథా పోకుండా కనీసం 15 నుండి 22 సెం.మీ. లోతులో రోటావేటర్‌ లేదా పవర్‌ టిల్లర్‌ సాయంతో కలియదున్నాలి.
 • పచ్చిరొట్ట కుళ్లే సమయంలో కొన్ని రకాల వాయువులు తయారవుతాయి. ఇవి మురుగునీటి వసతి లేని పొలాల్లో అప్పుడే నాటిన వరిమొక్కలకు హాని కలిగిస్తాయి. కాబట్టి, పచ్చిరొట్టను కలియదున్నిన రెండు వారాల తర్వాతే నాట్లు వేసుకోవాలి.
 • పచ్చిరొట్ట విత్తనాలను అధిక మోతాదులో ఉపయోగిస్తే, మొక్కలు తక్కువ ఎత్తుకు పెరిగి రసవంతంగా తయారవుతాయి. లేకుంటే జీలుగ వంటి పచ్చిరొట్ట మొక్కలు ఎక్కువ ఎత్తుగా పెరిగి, కాండంలో పీచు ఏర్పడుతుంది. ఇవి నేలలో కుళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంది.

రాయితీపై సరఫరా

ఏటా తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై సరఫరా చేస్తుంది. వానకాలం 2020కి గాను సుమారు 12.4 లక్షల ఎకరాలకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు 65 శాతం రాయితీపై అందజేసింది. ఇందులో జీలుగను 10.6 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఒక ఎకరానికి 9 నుండి 10 టన్నుల పచ్చిరొట్టగా తయారైంది. ఎకరానికి 60 కిలోల చొప్పున మొత్తం 63 వేల టన్నుల నత్రజనిని అందించింది. అదే విధంగా, జనుమును 1.5 లక్షల ఎకరాల్లో సాగు చేయడంతో ఎకరానికి 5 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట తయారైంది. 40 కిలోల చొప్పున 6 వేల టన్నుల నత్రజనిని అందించింది. పిల్లిపెసరను 0.3 లక్షల ఎకరాల్లో సాగు చేసినప్పుడు ఒక ఎకరానికి 3 నుండి 4 టన్నుల పచ్చిరొట్ట తయారవగా, ఎకరానికి 40 కిలోల చొప్పున 12 వందల టన్నుల నత్రజని లభించింది. సుమారుగా 70 వేల టన్నుల నత్రజని భూమికి అందింది. ఫలితంగా గతేడాది ఎంతోమంది రైతులు అధిక దిగుబడులతోపాటు భారీ లాభాలు పొందారు. వానకాలంలోనూ అత్యధికంగా 1,65,397 క్వింటాళ్ల విత్తనాలను 65 శాతం రాయితీపై తెలంగాణ రైతాంగానికి సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఖర్చు తక్కువే

పచ్చి రొట్టతో.. పచ్చని పంటలు!

రసాయన ఎరువులతో పోలిస్తే పచ్చిరొట్ట సాగుకు ఖర్చు చాలా తక్కువ. ఉదాహరణకు వానకాలంలో వరిపంటకు వ్యవసాయశాఖ సిఫారసు మేరకు ఒక ఎకరానికి నత్రజని 40 నుంచి 48 కిలోలు, భాస్వరం 20 కిలోలు, పొటాష్‌ 16 కిలోల పోషకాలను రసాయనిక ఎరువుల రూపంలో వేయాల్సి ఉంటుంది. కానీ, కొందరు రైతులు దీనికంటే అత్యధిక మోతాదులో రసాయన ఎరువులను వాడుతున్నారు. ఫలితంగా భూసారం దెబ్బతినడంతోపాటు ఉత్పాదకత ఖర్చుకూడా పెరిగిపోతున్నది. ఒక ఎకరానికి సిఫారసు చేసిన 48 కిలోల నత్రజనిని పొందడానికి రెండు బస్తాల యూరియా (100 కిలోలు) ఉపయోగించాల్సి వస్తుంది. ఒక బస్తాకయ్యే ఖర్చు రూ. 253 కాగా, ఒక ఎకరంలో నత్రజని కోసమే రూ.506 ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఒక ఎకరానికి సిఫారసు చేసిన భాస్వరం (20 కిలోలు) పొందడానికి ఒక బస్తా డీఏపీని వాడుతున్నారు. ఇందుకోసం రూ.1,817 ఖర్చు చేస్తున్నారు. ఒక ఎకరాకు సిఫారసు చేసిన పొటాషియం మోతాదు (16 కిలోలు) పొందడానికి 25 కిలోల ఎంవోపీకి రూ.882 పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. మొత్తంగా ఒక్క ఎకరం సాగుకోసం రసాయన ఎరువులకే మొత్తంగా సుమారు రూ.3205 ఖర్చు చేయాల్సి వస్తున్నది.

 • జీలుగ: ఎకరానికి 10 నుండి 12 కిలోల జీలుగ విత్తనాలు అవసరమవుతాయి. 10 కిలోల విత్తనాలకు రూ.187 ఖర్చు చేస్తే సరిపోతుంది. చౌడు భూముల్లో ముఖ్యంగా వరిసాగు చేసే ప్రాంతాల్లో ప్రధానపంటకు ముందు జీలుగను వేసుకొని, పూతదశలో కలియ దున్నాలి. దీనివల్ల ఎకరానికి 60 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 5 కిలోల గంధకం లభిస్తాయి.
 • జనుము: ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనం చొప్పున అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. ఒక ఎకరం కోసం 12 కిలోల విత్తనాలకు రూ.279 మాత్రమే ఖర్చు వస్తుంది. ఇది పూతదశకు వచ్చేసరికి ఐదునుండి ఆరు టన్నుల పచ్చిరొట్టగా తయారవుతుంది. దీన్ని పొలంలోనే కలియ దున్నడం వల్ల 40 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 5 కిలోల గంధకం లభిస్తుంది. దీనిని పశువుల మేతగానూ ఉపయోగించుకోవచ్చు.
 • పిల్లిపెసర: ఎకరానికి 8 నుండి 10 కిలోల విత్తనం కావాలి. తేలిక, బరువు నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, చౌడుభూముల్లో సాగుకు పనికిరాదు. ఒక ఎకరానికి 8 కిలోల విత్తనాలకోసం రూ. 230 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మూడు నుండి నాలుగు టన్నుల పచ్చిరొట్ట ద్వారా 40 కిలోల నత్రజని, 9 కిలోల భాస్వరం, 5 కిలోల గంధకం అందిస్తుంది.

ఎంతో మేలు

పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయడం వల్ల భావి తరాలకు ఎలాంటి రసాయనిక ఎరువులూ లేని నాణ్యమైన, ఆరోగ్యవంతమైన ఆహార పంటలను అందించవచ్చు. వాతావరణం,
భూ కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని రాష్ట్ర రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి. భూసారాన్ని పరిరక్షిస్తూ, ఈ యేడాది కూడా అధిక
దిగుబడులు సాధించాలి.

‘పచ్చిరొట్ట’తో లాభాలు

 • పచ్చిరొట్ట పైర్లు ప్రధానపంటకు ముందస్తుగానే నేలను సారవంతం చేయడానికి సాయపడుతాయి.
 • నేల భౌతిక స్థితిని మెరుగు పరచి, భూమిని గుల్లగా మారుస్తాయి. నేలలో నీరు ఇంకే గుణాన్ని పెంచుతాయి.
 • నేల కోతకు గురికాకుండా కాపాడుతాయి.
 • పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేస్తాయి. ఫలితంగా జీవరసాయనిక చర్యలతో నేలసారం పెరుగడంతోపాటు పంటలు సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొంటాయి. ఉత్పాదకత సామర్థ్యాన్నీ పెంచుకుంటాయి. ఈ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే హార్మోన్లవల్ల మొక్కల పెరుగుదల వృద్ధి చెందుతుంది. పంటల నాణ్యతకూడా పెరుగుతుంది.
 • పచ్చిరొట్ట పైర్లలో ఎక్కువ భాగం పుష్పజాతికి చెందినవే. కాబట్టి, ఈ మొక్కల వేళ్లలోని బొడిపెలద్వారా గాలిలోని క్లిష్ట నత్రజనిని స్థిరీకరిస్తాయి. ఎకరానికి 25 నుండి 50 కిలోల లభ్య నత్రజనిగా స్థిరీకరించడంలో తోడ్పడతాయి.
 • సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు రాకుండా చేస్తాయి. పైగా ఈ పైర్ల వేర్లు లోతుగా చొచ్చుకెళ్లి భూమి అడుగున తయారయ్యే గట్టి పొరలను చీలుస్తాయి. ఫలితంగా నేలలో అదృశ్యంగా ఉన్న అనేక పోషకాలను లభ్యరూపంలోకి మారుస్తాయి.
 • చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడతాయి.
 • పంట మార్పిడికి సాయపడుతాయి.
 • పురుగులు, తెగుళ్ల బెడదను తగ్గించి, సస్యరక్షణ ఖర్చును కూడా నియంత్రిస్తాయి.
 • కొన్ని రకాల పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగానూ ఉపయోగపడతాయి.

డాక్టర్‌ కె. కేశవులు,
ఎండీ తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పచ్చి రొట్టతో.. పచ్చని పంటలు!
పచ్చి రొట్టతో.. పచ్చని పంటలు!
పచ్చి రొట్టతో.. పచ్చని పంటలు!

ట్రెండింగ్‌

Advertisement