e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home వ్యవసాయం ఐదెకరాల్లో అద్భుత సేద్యం

ఐదెకరాల్లో అద్భుత సేద్యం

  • తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు
  • ఖర్చులన్నీ పోనూ ఏడాదికి రూ. 13.67 లక్షల మిగులు

గతంలో వ్యవసాయమంటే..‘ఒకే పొలం – ఒకే పంట’ అన్నట్టుగా ఉండేది. నష్టాల్లో మునిగినా, లాభాలు తేవాలన్నా.. ఆ ఒక్క పంటే దిక్కయ్యేది. కానీ, కాలంతో పాటే సాగులోనూ గణనీయమైన మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో తక్కువ భూమిలోనే ఎక్కువ పంటలు పండించే ఆధునిక పద్ధతి తెరపైకి వచ్చింది. కేవలం ఐదెకరాల క్షేత్రంతోనే అద్భుత ఆదాయాన్ని పొందేలా, ఉద్యానశాఖ ఒక నివేదికను రూపొందించింది. దీనిపై అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నది.

రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఒకటి లేదా రెండు రకాల పంటలు మాత్రమే సాగు చేస్తుంటారు. కరువు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడులు రాక, తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ పంటలు సాగు చేసే విధానంపై ఉద్యానశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రయోగాలు, పరిశోధనలు చేసి, ఒక నివేదిక రూపొందించారు. ఇందులో భాగంగా ఐదు ఎకరాల భూమిని ఒక యూనిట్‌గా తీసుకొన్నారు. దీంట్లో ఐదు రకాల వ్యవసాయ అనుబంధ పనులతో వచ్చే ఆదాయాన్ని లెక్కించారు. దీనిని బట్టి రైతుకు ఏటా మొత్తంగా రూ.19.54 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో 30 శాతం పంట పెట్టుబడి ఖర్చులు తీసేయగా, సంవత్సరానికి నికరంగా రూ.13.67 లక్షల ఆదాయం మిగులుతుందని తేల్చారు. అంటే, ప్రతినెలా రూ. 1.14 లక్షలు రైతుకు అందనున్నట్లు చెబుతున్నారు. దీంతోపాటు పొలం గట్లపై టేకు, శాండల్‌వుడ్‌ చెట్ల పెంపకంతో అదనపు ఆదాయం పొందే అవకాశమున్నదని అంటున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పంటల రకాలు, సాగు చేయాల్సిన విస్తీర్ణం. ఎంత ఆదాయం వస్తుందో వివరించారు.

పందిరి తోట

  • సాగు విస్తీర్ణం : అర ఎకరం
  • ఏడాదిలో రెండు పంటలు పండించొచ్చు.
  • అర ఎకరంలో సరాసరి దిగుబడి 8 టన్నులు.
  • ప్రతి టన్నుకూ సగటు ధర రూ. 15 వేలు (రైతు ధర).
  • ఒక పంటకు వచ్చే ఆదాయం రూ. 1.20 లక్షలు, రెండు పంటలకు రూ. 2.40 లక్షలు.

సెరికల్చర్‌

  • (పట్టు పురుగుల పెంపకం)
  • పంట కాలం 60 రోజులు. ఏడాదికి ఐదు పంటలు తీయొచ్చు.
  • ప్రతి బ్యాచ్‌కు 300 గుడ్లు వేయొచ్చు. ఒక్కో బ్యాచ్‌కు 200 కేజీల కకూన్స్‌ ఉత్పత్తి.
  • మొత్తంగా ఐదు పంటలకు కలిపి వెయ్యి కేజీలు ఉత్పత్తి చేయవచ్చు.
  • ఒక కేజీ కుకూన్‌ ధర రూ. 400.
  • ఐదు పంటలకు వచ్చే మొత్తం ఆదాయం రూ.4 లక్షలు.

గేదెల పెంపకం

  • అర ఎకరంలో గడ్డి పెంచితే.. ఎనిమిది ముర్రా జాతి గేదెలను పోషించవచ్చు.
  • ఒక్కో గేదె ప్రతి రోజూ కనీసం ఐదు లీటర్ల పాలు ఇస్తుంది.
  • ఎనిమిది గేదెల నుంచి ప్రతిరోజూ 40 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి.
  • ఒక లీటరు పాల ధర రూ. 60గా లెక్కిస్తే 40 లీటర్ల పాలకు ప్రతిరోజు రూ. 2400 వస్తాయి.
  • 30 రోజులకు రూ.72వేల ఆదాయం వస్తుంది. ఏడాదిలో రూ.8.64 లక్షల ఆదాయం సమకూరుతుంది.

పండ్ల తోటలు

  • సాగు విస్తీర్ణం : 1.5 ఎకరాలు.
  • నాలుగు రకాల మామిడి (కేసర్‌, హిమాయత్‌, మల్లిక, బంగినపల్లి) చెట్లను, మూడు రకాల జామ
  • (థాయ్‌ జామ, సఫేదా, పింక్‌ ఫ్లెష్‌ జామ) చెట్లను పెంచుకోవచ్చు.
  • వీటి ద్వారా ఏడాదికి సుమారు రూ.1.5 లక్షల ఆదాయం వస్తుంది.

చేపల చెరువు

  • 0.25 ఎకరంలో చేపల చెరువు ఏర్పాటు చేసుకోవచ్చు.
  • కొర్రమీనులను పెంచితే ఏడాదికి 1500 కేజీల చేపలు ఉత్పత్తి అవుతాయి.
  • ఒక కేజీ చేపల ఖరీదు రూ.200గా భావిస్తే ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం వస్తుంది.
- Advertisement -

ఐదు రకాల పంటల ద్వారా మొత్తం రూ. 19.54 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఇందులోంచి 30 శాతం ఖర్చులు తీసేయగా, రైతుకు ఏటా రూ. 13.67 లక్షల నికర ఆదాయం మిగులుతుంది. అంటే, నెలకు రూ.1.14 లక్షలు.

కొమ్మిడి స్వామిరెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement