కరోనా సోకకుండా ఉండాలంటే మూతికి మాస్క్ పెట్టుకోవాల్సిందే. మరి, మామిడి కాయలను చీడపీడల నుంచి రక్షించుకోవాలంటే? ఆ కాయలకు కవర్లు కట్టాలంటున్నాడు ఓ రైతు. దీనిద్వారా అవి ఎక్కువ బరువు పెరగడంతోపాటు అధిక లాభాలు పొందవచ్చుననీ చెబుతున్నాడు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటకు చెందిన రైతు రాజారావు వినూత్న ఆలోచనతో అధిక ఆదాయం పొందుతున్నాడు. మామిడిచెట్లకు పూత వచ్చినప్పటినుంచీ కాయలు కోతకు వచ్చేవరకూ వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వడగండ్ల వాన, గాలి దుమారంతోపాటు చీడపీడలవల్ల మామిడితోటలకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. దీనిని నివారించేందుకు మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్ (మామిడిపండ్ల రక్షణ సంచులు)లతో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు రాజారావు. కృష్ణాజిల్లా నూజివీడులో ఓ రైతు ఈ ప్రయోగం చేస్తున్నట్లు తెలుసుకొని స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించాడు. చెట్టుపైన మామిడికాయ కోడిగుడ్డు సైజులోకి రాగానే, ఒక్కో కాయకు ఒక్కో కవర్ కట్టి సంరక్షిస్తున్నాడు.
అనేక లాభాలు..
కాయలకు కవర్లను కట్టడం వల్ల తొడిమవద్ద నల్లగా మసి పట్టడం, పురుగు పట్టడం, సొనకారడం తగ్గుతుంది. ఫలితంగా పురుగు మందుల అవసరం ఉండదు. గాలి దుమారం, వడగండ్ల వానకు కాయలు రాలవు. దీంతోపాటు మామూలు కాయకంటే 100 గ్రాములవరకూ ఎక్కువ బరువు పెరుగుతుంది. చూసేందుకు పండ్లు నీట్గా ఉండటంతోపాటు చెట్టుపైనే పండటం వల్ల అధిక ధర పలుకుతుంది.
కవర్ కట్టే విధానం
ఈ బ్యాగ్ లోపలివైపున నల్లరంగు, బయటివైపున గోధుమరంగులో ఉంటుంది. ఒక్కో కవర్ రెండు రూపాయలకు లభిస్తుంది. వీటిని కట్టడానికి ముందు కాయలను గుడ్డతో శుభ్రంగా తుడవాలి. తర్వాత కాయ కిందిభాగం నుంచి తొడిమ పైభాగంలో మూడు సెంటీమీటర్ల పైన వీటిని కట్టాలి. మామిడికాయలే కాకుండా దానిమ్మ, జామ తదితర కాయలకూ వీటిని ఉపయోగించుకోవచ్చు.
అధిక ఆదాయం
నాకు రెండు మామిడి తోటలున్నాయి. ఒక తోటలోని కాయలకు మందులు పిచికారీ చేస్తా. ఇంకో తోటను పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే పండిస్తా. సేంద్రియ తోటలోని కాయలకే కవర్లు తొడుగుతున్నా. గతేడాది 20 వేల కాయలకు కవర్లను కట్టా. ఈ ఏడాది లక్ష కవర్లు తెచ్చా. కవర్ కట్టిన కాయలు పెద్దగా పెరుగుతయ్. దిగుబడితోపాటు ధరకూడా ఎక్కువే వస్తుంది. మామూలువి టన్నుకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు ఉంటే, కవర్లు కట్టిన కాయలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల దాకా పలుకుతుంది.
-రాజారావు, మామిడి రైతు
కన్నెబోయిన రాజు