శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Agriculture - Feb 11, 2021 , 08:31:43

ఆద‌ర్శ రైతు.. ఆరు రకాల పంటలు వేస్తూ లాభార్జన

ఆద‌ర్శ రైతు.. ఆరు రకాల పంటలు వేస్తూ లాభార్జన

వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ వ్యవసాయం

యేటా కొత్త పంటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు లింగయ్య

కోటపల్లి, ఫిబ్రవరి 10 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన దాగామ లింగయ్య సాగులో నూతన ఒరవడి సృష్టిస్తున్నాడు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ముందుకెళ్తున్నాడు. రెండేండ్ల క్రితం మొట్టమొదటి సారిగా పుచ్చకాయ సాగు చేసి లాభాల బాట పట్టాడు. ఈ ప్రాంతంలో పుచ్చకాయను సాగు చేయడం, అధిక దిగుబడులు రావడంతో ఈ సీజన్‌లో సాగు చేసేందుకు మరో ఇద్దరు రైతులు ముందుకొచ్చారు. తాజాగా తనకున్న ఎకరం భూమి లో మొట్టమొదటి సారిగా పసుపు వేసిన ఆయన ఆశించినంత దిగుబడి రావడంతో ఈ ప్రాంత రైతుల దృష్టిని మరోసారి ఆకర్షించాడు. తన ఎకరం భూమిలో రూ.60 వేల పెట్టుబడి పెట్టగా, ప్రస్తుతం పసుపును సేకరిస్తున్నాం. మార్కెట్‌లో పసుపు క్వింటాలుకు రూ.7,500కు పైగా ధర పలుకుతున్నది. ఎకరం భూమిలో 15-20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మద్దతు ధర ఆశించినంత ఉండడంతో పెట్టుబడులు పోనూ దాదాపు రూ.లక్ష దాకా ఆదాయం వస్తుందని పేర్కొంటున్నాడు.

రకరకాల పంటల సాగు

తనకున్న పదెకరాల్లో ఆరు రకాల పంటలు వేశాడు. ఎకరం భూమిలో పసుపు, మరో ఎకరంలో పుచ్చకాయ, రెండెకరాల్లో శనగ, ఐదెకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో మిరప, కంది, మినుము, పెసర, బబ్బెర పంటలు వేశాడు. ఒకే పంటకు పరిమితం కావడంతో లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయని, సీజన్‌కు అనుకూలంగా విభిన్నమైన పంటలు వేస్తే అనుభవంతోపాటు లాభాలు సాధించవచ్చని వివరిస్తున్నాడు. కాగా.. ఈయన వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నాడు. నూతన పంటల విషయాలను కోటపల్లి మండల వ్యవసాయశాఖ అధికారి మహేందర్‌, ఏఈవో అనూష ద్వారా తెలుసుకుంటూ కొత్త పంటల సాగువైపు అడుగులు వేశాడు. పంటలకు తెగుళ్లు సోకినా, దిగుబడి, ఇతర విషయాల్లో ఏమైనా అనుమానాలుంటే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తున్నాడు. వారిచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తూ మెరుగైన దిగుబడులు సాధిస్తున్నాడు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించడంతోపాటు సేంద్రియ ఎరువులను వాడుతున్నాడు.

ఒకే పంటపై ఆధార పడకూడదు.. 

వ్యవసాయంలో లాభాలు సాధించాలంటే రైతులు ఎప్పుడూ ఒకే పంటపై ఆధారపడవద్దు. మా ప్రాంతంలో అధికంగా పత్తి వేస్తూ మిగతా వాటిని రైతులు విస్మరిస్తున్నారు. ఒకే పంటను ఏండ్ల కొద్దీ సాగు చేయడంతో భూమికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను వేయడం వల్ల రైతులకు లాభాలు వస్తాయి. గతేడాది నేను పుచ్చకాయ వేసిన. అధిక లాభాలు రాగా, ఈ సంవత్సరం పసుపు వేసి మంచి ఫలితాన్ని సాధించా.  - దాగామ లింగయ్య, రైతు, రొయ్యలపల్లి, కోటపల్లి


VIDEOS

logo