శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Agriculture - Feb 11, 2021 , 00:17:14

బీడు భూమిలో బంగారు పంట

బీడు భూమిలో బంగారు పంట

ఒకప్పుడు అక్కడ సాగు మాట దేవుడెరుగు, తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకడమే గగనమయ్యేది. ఆ ప్రాంతమంతా బండరాళ్లతో చిన్నపాటి గుట్టను తలపించేది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. బీడుగా ఉన్న భూమిని సాగులోకి తీసుకువచ్చేందుకు ఆ రైతు చేసిన ప్రయోగం సఫలీకృతమైంది. గోదావరి జలాల రాకతో అక్కడ పచ్చని వరిపైరు సాగవుతున్నది. సాధారణ పంట పొలానికి తీసిపోకుండా దిగుబడి వస్తున్నది. 

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలం బొప్పారం గ్రామానికి చెందిన సామ కృష్ణారెడ్డికి పదెకరాల పొలం ఉన్నది. ఇందులో ఎకరంన్నర బండరాళ్లతోనే నిండిపోయి ఉంటుంది. గతంలో నీటి కరువుతో ఐదెకరాలు సాగు చేయడమే కష్టమయ్యేది. ఉన్న బోర్లతో కొద్దిపాటి వరి సాగు చేయడంతోపాటు మిగతా భూమిలో ఏదో ఒక పంట వేసేవాడు. సరైన నీటి సౌకర్యం లేక ఒక్కోసారి పంట మొత్తం ఎండిపోయేది. ఇలాంటి సమయంలో బండరాళ్లతో నిండిపోయిన ఎకరంన్నర గురించి ఆలోచనే వచ్చేది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఇప్పుడు తమ గ్రామానికి గోదావరి జలాలు వస్తున్నాయి. భూగర్భ జలాలు కూడా పెరిగి బావులు, బోర్లు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో గత వానకాలం సీజన్‌కు ముందుదాకా తన పదెకరాల్లోని ఎనిమిదిన్నర ఎకరాల్లోనూ వరి పండించాడు. మంచి దిగుబడి సాధించాడు. అప్పుడే బీడుగా ఉన్న మిగతా ఎకరంన్నర పొలంపైనా దృష్టి పెట్టాడు. నీటి సౌకర్యం సమృద్ధిగా ఉండటంతో, అక్కడ కూడా వరిసాగు చేయాలని సంకల్పించాడు. అనుకున్నదే తడవుగా గుట్టపై కొన్ని రాళ్లు కొట్టించి, చదును చేయించాడు. రెండు అడుగుల ఎత్తులో మట్టి పోయించి, ఆ ప్రాంతాన్నంతా పొలంగా మార్చేశాడు. పైపుల ద్వారా నీటిని అందించి, నాటేశాడు. ఒకప్పుడు బండరాళ్లతో నిండిన ప్రదేశంలో ఇప్పుడు బంగారు పంటను పండిస్తున్నాడు. గత వానకాలంలోనే ఆ ఎకరంన్నర పొలంలో దాదాపు రూ.75వేల విలువ చేసే 42 క్వింటాళ్ల దిగుబడిని సాధించాడు.

నీళ్లు రావడం వల్లే.. 

ఏండ్ల తరబడి సాగునీటికి నోచుకోని ప్రాంతం మాది. భూములన్నీ బీడుగా ఉండేవి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మా పొలాలకు గోదావరి జలాలు వస్తున్నాయి. బోర్లు, వ్యవసాయ బావుల్లో నీటిమట్టం పెరిగింది. దీంతో మా వ్యవసాయ క్షేత్రంలో మొత్తం వరి సాగు చేశా. రాళ్లతో నిండిన ఎకరంన్నర భూమినీ సాగులోకి తీసుకొచ్చా. అక్కడ మట్టిపోసి వరి వేసిన. దిగుబడి కూడా బాగానే వచ్చింది. నన్ను చూసి ఈ ప్రాంతంలో మరికొంత మంది రైతులుకూడా తమ భూముల్లోని బీడులను పొలాలుగా మారుస్తున్నారు. త్వరలో వారి పొలాలు కూడా సాగులోకి వస్తాయి.

-సామ కృష్ణారెడ్డి

VIDEOS

logo