శుక్రవారం 22 జనవరి 2021
Agriculture - Dec 31, 2020 , 00:09:08

ఆయిల్‌పామ్‌ రక్ష ఆదాయం లక్ష

ఆయిల్‌పామ్‌ రక్ష ఆదాయం  లక్ష

రైతులు మూస సాగు విధానానికి స్వస్తి పలుకుతున్నారు. ఇప్పటి రైతు నినాదం లాభసాటి వ్యవసాయం. నేటి రైతాంగ విధానం ఆధునిక సాగు. అలాంటి ఒక పంటే.. ఆయిల్‌ పామ్‌. తెలంగాణలో నీటి లభ్యత పెరిగింది. ఇరవై నాలుగు గంటలూ కరెంట్‌ ఉంటుంది. ఆయిల్‌పామ్‌కు రక్షగా నిలిస్తే.. అది మీకు లక్షల్లో ఆదాయం సంపాదించి పెడుతుంది. సాగు ఎలా చేయాలి? పెట్టుబడి ఎంత పెట్టాలి? ఏ మేరకు రాబడి వస్తుంది? మార్కెటింగ్‌ ఎలా? తదితర వివరాలతో ‘ఎవుసం’ కథనం. 

ఆయిల్‌ పామ్‌ సాగు అనుకూలతలపై పలు కేంద్ర సంస్థలు సర్వేలు నిర్వహించాయి. వీటి ఆధారంగా రాష్ట్రంలోని 25 జిల్లాలు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలమని స్పష్టం చేశాయి. ఏకంగా 8 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది.

మొక్క ఎలా ఉండాలి? 

ముందుగానే నర్సరీని ఏర్పాటు చేసుకుని, మొక్కల్ని పెంచాలి. నాటేటప్పుడు మొక్క వయస్సు కనీసం 12 నెలలు ఉండాలి. 1-1.2 మీటర్ల ఎత్తు, 20-25 సెంటీ మీటర్ల కాండం చుట్టుకొలతతో మొక్క 12 ఆకులను కలిగి ఉండాలి. ఆయిల్‌ పామ్‌ మొక్కలను జిల్లాల్లోని ఆయిల్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు సబ్సిడీ కింద అందిస్తున్నాయి. మండల ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి కూడా  పొందవచ్చు. 

ఎకరాకు ఎన్ని ?

ప్రతి హెక్టారుకు గరిష్ఠంగా 143 మొక్కలు లేదా ఎకరాకు గరిష్ఠంగా 57 మొక్కలను మాత్రమే నాటాలి. ఒక్కో మొక్క మధ్య 9x9x9 మీటర్ల దూరం ఉండేలా త్రికోణ పద్ధతిలో నాటు వేయాలి. మొక్కలు నాటే గుంతలు 60 సెంటీమీటర్ల లోతు, పొడవు, వెడల్పు ఉండేలా చూడాలి. మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. లేదంటే సరైన వెలుతురూ గాలీ లేకపోవడం వల్ల, గుబురుగా పెరిగిపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో చెట్లు కూడా వాడిపోతాయి. 

ఏయే నేలలు? 

ఆయిల్‌ పామ్‌ సాగుకు చౌడు నేలలు మినహా అన్ని రకాల నేలలూ అనుకూలం. నేలలు సులువుగా నీరు ఇంకిపోయే గుణం కలిగి ఉండాలి. ముఖ్యంగా ఎర్రని నేలలు అత్యంత అనుకూలం. వీటితో పాటు ఇసుకతో కూడిన ఎరుపు నేలలు, ఒండ్రుతో కూడి ఎరుపు నేలలు అనుకూలం. 

ఎంత నీరు ? 

ఇది ఆరుతడి పంట. రోజూ ఒక్కో చెట్టుకు కనీసం 200 లీటర్ల నీళ్లు అవసరం. వేసవి కాలంలో మరో 50 లీటర్లు అదనంగా అందించాలి. ఒక ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో నాలుగు ఎకరాల ఆయిల్‌ పామ్‌ను సాగు చేయొచ్చు. ఆయిల్‌ పామ్‌ సాగులో నీటి పారకానికి బిందు సేద్యాన్ని ఉపయోగించడం వల్ల అవసరమైన నీటిని సులువుగా అందించవచ్చు. చెట్ల మొదళ్లలో ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. 

దిగుబడి ఎలా? 

ఆయిల్‌పామ్‌ మొక్కను ఒక్కసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. నాలుగో ఏడాది నుంచి ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి ఏడాది సుమారుగా ఎకరాకు ఆరు టన్నుల ఆయిల్‌ పామ్‌ కాయలు కాస్తాయి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతూ గరిష్ఠంగా ఏడాదికి 16 టన్నుల ఉత్పత్తి వస్తుంది. ఆర్గానిక్‌ ఎరువులు వేయడం వల్ల మంచి దిగుబడి సాధ్యం. మన వద్ద సగటున ఎకరాకు 10-12 టన్నుల దిగుబడి ఉంటుంది. ఇక ఒక చెట్టు జీవితకాలం 25-30 ఏండ్లు. 15 ఏండ్ల వరకు మంచి దిగుబడి ఇస్తుంది. చెట్ల జీవితకాలం మరో నాలుగేండ్లలో ముగుస్తుందనే సమయానికి అదే స్థానంలో కొత్త చెట్లు పెట్టుకోవచ్చు. దీనివల్ల పాత చెట్ల జీవితకాలం పూర్తికాగానే కొత్త పంట చేతికొస్తుంది. 

పెట్టుబడి ఎంత? 

ఆయిల్‌ పామ్‌ సాగుకు పెట్టుబడి చాలా తక్కువ. మొదటి మూడు సంవత్సరాలు ఒక్కో ఎకరానికి సుమారు రూ. 60-80వేల వరకు అవసరం. మొదటి ఏడాది రూ.40 వేలు పెట్టాల్సి ఉంటే, మిగిలిన రెండు సంవత్సరాలకు మరో రూ.40 వేలు కావాలి. దిగుబడి వచ్చే నాలుగేండ్ల నుంచి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఏటా సుమారు రూ. 20 వేలు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది భూమి దున్నకం, నాట్లు, బోర్‌, డ్రిప్‌ సిస్టమ్‌ వంటి వాటికి పెట్టుబడి పెట్టాలి. 

ఆదాయం ఏ మేరకు? 

ఏటా ప్రతి ఎకరానికి అన్ని ఖర్చులూ పోనూ కనీసం రూ. లక్ష నికర ఆదాయం మిగులుతుంది. మార్కెట్లో ప్రస్తుతం ఒక టన్నుకు రూ. 10,035 ధర పలుకుతున్నది. ఒక ఎకరాకు కనీసంగా 10 టన్నుల ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తి అయితే, రూ. లక్ష ఆదాయం వచ్చినట్టే కదా. పెట్టుబడి మొత్తం రూ. 20వేలు తీసేస్తే రైతుకు కనీసం రూ. 80వేలు మిగులుతాయి. ఒకవేళ 12 టన్నులు ఉత్పత్తి అయితే, రూ. 1.20 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో పెట్టుబడి తీసేయగా రైతుకు నికరంగా రూ. లక్ష మిగులుతుంది. మొక్కల మధ్య అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా కోకో వేసుకోవచ్చు. మొదటి మూడు సంవత్సరాల పాటు, మళ్లీ ఏడేండ్ల తర్వాత అంతర పంటలను సాగు చేసుకుంటే అదనంగా మరో రూ.24 వేల ఆదాయం వస్తుంది. 

సబ్సిడీ ఎంత? 

మొదటి నాలుగేండ్లలో కేంద్రం నుంచి సుమారు రూ. 2.70లక్షల సబ్సిడీ అందితే.. రాష్ట్ర ప్రభుత్వం సాగుకు అవసరమయ్యే డ్రిప్‌ సిస్టంను సబ్సిడీలో రైతులకు అందిస్తున్నది. అదే విధంగా రైతుబంధుతో ప్రతి ఎకరాకు రూ. 10వేలు ఇస్తున్నది. ఆయిల్‌ పామ్‌ సాగు పెట్టుబడి ఖర్చులో 50శాతం సబ్సిడీగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కల కొనుగోలు, ఎరువులు, గుంతలు తీయడం, డ్రిప్‌.. ఇలా పలు రకాల పనులకు ఈ సబ్సిడీని అందించనుంది. ఈ విధంగా రైతులు పెట్టుబడి ఖర్చు లేకుండానే ఆయిల్‌ పామ్‌ సాగు చేసుకోవచ్చన్నమాట. 

అంతర పంటతో ఆదాయం వచ్చేనా? 

అంతర పంటగా పత్తి, మిరప, కాయగూరలు వేసుకోవచ్చు. ఒక్కోసారి అంతర పంటల వల్ల మొక్కకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి దున్నకం, ఎరువులు వేసే సమయంలో జాగ్రత్తలు అవసరం. మూడేండ్ల వరకు అంతర పంటలను సాగుచేసి.. ఓ నాలుగైదేండ్లు నిలిపేయాలి. ఆ తర్వాత కోకో పంటను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. ఆయిల్‌ పామ్‌ సాగు 25 ఏండ్ల వరకు ఉంటుంది కాబట్టి.. పంట సాగు చేసే భూమి చుట్టూ మలబార్‌, సాండిల్‌ వుడ్‌, వెదురు బొంగులు, టేకు, శ్రీగంధం వంటి చెట్లను కాంపౌండ్‌గా నాటితే రూ.కోట్లలో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. 

మార్కెటింగ్‌ ఎలా? 

ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలమైన 25 జిల్లాల్లో ఆయిల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పంట చేతికొచ్చిన తర్వాత ఈ కంపెనీలే కొనుగోలు చేస్తాయి. రైతులకు మొక్కలు ఇవ్వడం మొదలుకొని చెట్లు నాటడం, ఎరువుల వాడకం, క్రాప్‌ కటింగ్‌, మార్కెటింగ్‌ ఇలా అన్ని విషయాల్లోనూ కంపెనీలు రైతులకు అండగా ఉంటాయి. వీటి కోసం నామమాత్రపు చార్జీలు వసూలు చేస్తారు. ఆయిల్‌ పామ్‌ రైతుకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. దీని ఆధారంగానే రైతు నుంచి పంటను కొనుగోలు చేస్తారు. పక్వానికి వచ్చిన తర్వాత ప్రతి పదిహేను రోజులకోసారి గెలల్ని కోయాలి. గంటల వ్యవధిలోనే వాటిని కంపెనీకి చేర్చాలి. ఈ విధంగా ప్రతి 15 రోజులకోసారి కంపెనీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేస్తుంది. 15 రోజులకోసారి కాకపోయినా, ఉద్యోగుల మాదిరిగా రైతుకు కూడా ప్రతి నెలా డబ్బులు చేతికొచ్చే పరిస్థితి మాత్రం ఉంటుంది. 

చీడపీడల నివారణ ఎలా? 

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో తెల్లపురుగు పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. అంతర పంటగా సాగుచేసిన కోకో నుంచి ఆయిల్‌ పామ్‌కు సోకినట్లుగా గుర్తించారు. ఈ చెట్లు తుపానులను, భారీ వర్షాలను, ఈదురు గాలులను తట్టుకొని నిలబడతాయి. కోతులు ఆయిల్‌ కాయలను తినవు. ఈ చెట్లు పైకి ఏపుగా పెరుగుతాయి కాబట్టి, పశువుల నుంచి ఎలాంటి హానీ ఉండదు. ఒకవేళ ఎవరైనా గెలలను దొంగిలించినా వాటిని మార్కెటింగ్‌ చేసుకోవడం సాధ్యం కాదు. 

రాష్ట్రంలో సాగు విస్తీర్ణమెంత?

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ పంటలు కొన్ని జిల్లాలకే పరిమితం కావడం వల్ల తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 38 వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌ పామ్‌ సాగు అవుతున్నది. ఈ నేపథ్యంలో ఆయిల్‌ పామ్‌ సాగును భారీ విస్తీర్ణంలో పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే  నాలుగేండ్లలో, ఏకంగా 8 లక్షల  ఎకరాలకు ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంచేందుకు తగిన విధంగా ప్రోత్సహిస్తున్నది. ముఖ్యంగా సాగు నీటి వసతి అధికంగా ఉన్న నిర్మల్‌, మహబూబాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌ రూరల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట,  భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, సూర్యాపేట, ములుగు, నల్గొండ, జనగామ, వరంగల్‌ అర్బన్‌, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌,  నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్‌ నగర్‌, కొత్తగూడెం జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ను సాగు చేయాలని నిర్ణయించింది. 

నూనె దిగుమతి ఎంత?

దేశ అవసరాల్లో 60 శాతం పామాయిల్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే, మన దేశంలో 40శాతం మాత్రమే ఉత్పత్తి అవుతుందన్న మాట. మనకు ఏటా 22 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ అవసరం అవుతుంది. కానీ మన దగ్గర 7 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ తీయడానికి అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో 16 రాష్ర్టాల్లో కేవలం 3 లక్షల హెక్టార్లలో మాత్రమే ఆయిల్‌ పామ్‌ను సాగు చేస్తుండగా, ఇది దేశ అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. కేంద్రం, రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా 20 లక్షల హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు రాష్ర్టాలను కూడా ప్రోత్సహిస్తున్నది. ఇతర నూనె గింజలతో పోలిస్తే ఆయిల్‌ పామ్‌లో.. అధిక శాతం నూనె ఉత్పత్తి అవుతుంది.  

డిమాండ్‌ సంగతి ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా పామాయిల్‌కు భారీగా డిమాండ్‌ పెరుగుతున్నది. ఇంటి అవసరాలతో పాటు.. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తినుబండారాల కంపెనీలు పామాయిల్‌నే ఎక్కువగా వాడుతున్నాయి. దీంతో  డిమాండ్‌ పెరుగుతున్నది. పొద్దు తిరుగుడు, వేరుశనగ, వంటి పంటల సాగుతోపాటు వాటి నూనెల ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అనివార్యంగానే పామాయిల్‌కు డిమాండ్‌ పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశంలో ఒక వ్యక్తి నూనె వినియోగం సంవత్సరానికి సగటున 18 కిలోలు కాగా, అంతర్జాతీయ సగటు 27 కిలోలు. మన దేశంలో నూనె వినియోగం పెరిగితే పామాయిల్‌ నూనెనే ప్రత్యామ్నాయం అవుతుంది. కాబట్టి, డిమాండ్‌కు ఢోకా లేదని చెప్పవచ్చు. 

50 శాతం సబ్సిడీ

దేశంలో వరి ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉన్నాయి. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయంగా పామాయిల్‌ పంట సాగు చేయాలి. ఒక ఎకరం వరిసాగు చేసే నీటితో నాలుగు ఎకరాల పామాయిల్‌ను సాగు చేయొచ్చు. దీంతో రైతుకు కచ్చితమైన ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం నుంచి పెట్టుబడికి అయ్యే ఖర్చులో 50శాతం సబ్సిడీ అందిస్తాం.  

-జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి, వ్యవసాయ శాఖ

25 ఏండ్లుగా సాగు చేస్తున్నా  

గత 25 ఏండ్లుగా ఆయిల్‌ పామ్‌ను సాగు చేస్తున్నా. ఇప్పటి వరకు అసలు నష్టమనే మాటే లేదు. ఒకవేళ ధర తగ్గినా, దిగుబడి తగ్గినా ఖర్చులు పోగా ఎంతో కొంత మిగిలిందే తప్ప ఏనాడూ నష్టం రాలేదు. ఏటా ఎకరాకు కనీసంగా రూ. లక్ష వరకు ఆదాయం వస్తున్నది. మొదట ఐదెకరాల్లో సాగు చేసి, ఆ తర్వాత 25 ఎకరాలకు విస్తరించాను.   

-వెంకటేశ్వరరావు,  అశ్వరావుపేట 

15 ఎకరాల్లో 

ఆయిల్‌ పామ్‌ సాగు లాభసాటిగా ఉందని తెలుసుకున్నా. ఈ ఏడాది 10-15 ఎకరాల్లో సాగు చేద్దామనుకుంటున్నా. అధికారులను సంప్రదించి అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుంటున్నా. కంపెనీ ప్రతినిధులను కూడా సంప్రదించాను. త్వరలోనే మొక్కలు నాటిద్దామని చెప్పారు.  

-కొత్తపల్లి శ్రవణ్‌ కుమార్‌, ఖమ్మం


logo