శనివారం 28 నవంబర్ 2020
Agriculture - Nov 19, 2020 , 01:14:26

లాభాల పుట్ట

లాభాల పుట్ట

  • తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం

కరోనా దెబ్బతో అందరి దృష్టీ అధిక పోషకాలుండే ఆహార పదార్థాల వైపు మళ్లింది. శాకాహారులకు కూడా ‘పుట్టగొడుగులు’ మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాయి. రుచిలోనూ తిరుగులేదు. ఫలితంగా మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ గిరాకీ రైతులు, నిరుద్యోగులను పుట్టగొడుగుల పెంపకం వైపు అడుగులు వేయిస్తున్నది. 

పుట్టగొడుగుల్లో అనేక రకాలు ఉన్నా.. మన వాతావరణానికి, పరిస్థితులకు మూడు రకాలు మాత్రమే అనువుగా ఉంటాయి. అవి.. బటర్‌ మష్రూమ్స్‌, మిల్కీ(పాల) మష్రూమ్స్‌, ఆయిస్టర్‌ మష్రూమ్స్‌. ఈ మూడిటిలోనూ సులువైన సాగు, తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం, భారీ డిమాండ్‌ మిల్కీ మష్రూమ్స్‌ సొంతం. దీంతో ఎక్కువ మంది రైతులు వీటి పెంపకానికే మొగ్గు చూపుతారు. ఇతర రకాలతో పోలిస్తే పాల పుట్టగొడుగులకు నిల్వ గుణం ఎక్కువ. ఇవి వారం నుంచి పది రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. దీంతో మార్కెటింగ్‌కూ అనుకూలంగా ఉంటుంది. 

నాణ్యమైన విత్తనాలే 

పుట్టగొడుగుల పెంపకంలో విత్తనాల సేకరణ, నిల్వ ప్రక్రియ చాలా కీలకమైంది. ‘స్పాన్‌'గా పిలిచే పుట్టగొడుగుల విత్తనాలు బయట ఎక్కువగా లభించవు. ఒకవేళ లభించినా, నాణ్యత ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో పుట్టగొడుగులను పెంచాలనుకునే వారు కచ్చితంగా నిర్ణీత ప్రదేశాల నుంచే విత్తనాలు సేకరించడం మంచిది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌(ఐఐహెచ్‌ఆర్‌)లో ప్రత్యేకంగా ఈ విత్తనాలు సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ)లోని పుట్టగొడుగుల శిక్షణ విభాగంలోనూ వీటిని విక్రయిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మినహా ఎక్కడా విత్తనాలను కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే, పుట్టగొడుగుల పెంపకంలో విత్తనాలు ఎంతో కీలకమైనవి. వీటికి ఏ మాత్రం ఫంగస్‌ సోకినా పనికిరావు.   విత్తనాలను రవాణా చేసే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. విత్తన ప్యాకెట్లకు వెలుతురు తాకకుండా చూసుకోవాలి. తీసుకెళ్లిన వెంటనే శీతల ప్రదేశంలో(ఫ్రిజ్‌)లో నిల్వ చేయాలి. విత్తడానికి ముందు జాగ్రత్తగా విడదీసి నాటుకోవాలి. అయితే, విత్తనాల ధర తక్కువగానే ఉంటుంది. బెంగళూరు ఐఐహెచ్‌ఆర్‌లో కిలో విత్తనాలు రూ. 60 నుంచి రూ.70 వరకు లభిస్తాయి. ట్రాన్స్‌పోర్టు,  ఇతర ఖర్చులు కలిపితే కిలో ధర రూ. 100 నుంచి రూ.110కి చేరుతుంది. విత్తనాలు అవసరమైన వారు ఆన్‌లైన్‌ ద్వారా ముందుగానే సంస్థకు ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. 


బ్యాగుల తయారీ

పుట్టగొడుగుల పెంపకంలో బ్యాగుల తయారీ కీలకమైంది. ఒక కేజీ విత్తనాలతో ఆరు బ్యాగులను తయారు చేయొచ్చు. ఒక బ్యాగ్‌కు 150 నుంచి 200 గ్రాముల విత్తనాలు, ఒక కేజీ వరి గడ్డి అవసరమవుతాయి. ఇందులో భాగంగా మొదటి దశలో వరిగడ్డిని ఉడికించాలి. ఇందుకోసం తెగుళ్లు సోకని, వర్షానికి తడవని ఏడాది లోపు గడ్డిని మాత్రమే తీసుకోవాలి. బ్యాగులకు అనుగుణంగా వరిగడ్డిని మూడు అంగుళాల వరకు స్టాఫ్‌ కట్టర్‌తో కట్‌ చేయాలి. దీనిని ప్రత్యేక పాత్రలద్వారా 90 డిగ్రీల వేడినీటిలో ఉడికించాలి. ఆ తర్వాత ఆరబెట్టాలి. అయితే పూర్తిగా ఆరకుండా, కొంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. చేతిలోకి గడ్డిని తీసుకున్నప్పుడు నీళ్లు కారకుండా, తడి మాత్రం తగిలేలా చూసుకోవాలి.

చీకటి గదిలో 21 రోజులు

పుట్టగొడుగుల పెంపకంలో ఈ దశ చాలా కీలకమైంది. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇన్‌క్యుబేషన్‌ కోసం ఒక చీకటి గదిని ఎంపిక చేసుకొని, ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా శుభ్రం చేసుకోవాలి. గది ఉష్ణోగ్రత పెరగకుండా పైకప్పుపై గడ్డి వేసి, చుట్టూ గోనె సంచులు వేసుకోవాలి. వీటిపై ఎప్పటికప్పుడు నీళ్లు పడుతూ ఉండాలి. గడ్డి, విత్తనాలతో నింపిన పాలిథిన్‌ బ్యాగులను 21 నుంచి 25 రోజులపాటు ఈ చీకటి గదిలోనే ఉంచాలి. గది ఉష్ణోగ్రత 28-35 డిగ్రీలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసి, గది ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. 

ఈ గదిలోకి వెలుతురు, గాలి వెళ్లకుండా చూసుకోవాలి. రోజులు గడిచే కొద్దీ బ్యాగు లోపలి భాగం తెల్లగా మారిపోతుంది.  శిలీంధ్రం బ్యాగు మొత్తాన్నీ అల్లుకుంటుంది. 

ఆ తర్వాత కేసింగ్‌

చీకటి గది ప్రక్రియ ముగియగానే బ్యాగులను బయటకు తీసి, వాటిని మధ్యలోకి కట్‌ చేయాలి. కత్తిరించిన భాగాలపై మట్టిని చల్లాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం ప్రత్యేక మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ ప్రక్రియను కేసింగ్‌ అంటారు. నల్లమట్టి, కొబ్బరి పొట్టు, చాక్‌పీస్‌ పౌడర్‌ మిశ్రమాన్ని ఇందుకు ఉపయోగించుకోవాలి. నల్లమట్టిని ఎక్కువ మోతాదులో కొబ్బరి, చాక్‌పీస్‌ పౌడర్‌ను తక్కువ మోతాదులో కలపాలి. ఈ మిశ్రమాన్ని 90 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్టీమింగ్‌ చేయాలి. దీనివల్ల మట్టిలోని చెడు బ్యాక్టీరియా చనిపోయి, మిశ్రమం శుద్ధి అవుతుంది. ఈ మిశ్రమాన్ని కట్‌ చేసిన ప్రతి బ్యాగుపై ఒక అంగుళం మందంలో పోసుకోవాలి.


వెలుతురు గదిలోకి..

ఆ తర్వాత మట్టి నింపిన బ్యాగులను వెలుతురు ఉండే గదిలోకి తరలించాలి. బల్లలు లేదా ట్రేలపై ఒకదాని తర్వాత మరొకదాన్ని వరుస క్రమంలో అమర్చాలి. ఈ గదిలో ఆక్సిజన్‌, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రత 28-35 డిగ్రీలు ఉంటే సరిపోతుంది. తేమ కూడా 80-90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ‘హ్యూమిడిఫయర్స్‌' లభిస్తాయి. తేమ శాతం ఎంత బాగుంటే, దిగుబడి అంత బాగా వస్తుంది. బ్యాగులపై రోజూ కనీసం ఒకసారైనా నీళ్లను పిచికారీ చేయాలి. అయితే, పై భాగంలోని మట్టి మాత్రమే తడిచేలా నీళ్లు చల్లాలి. లోపలి భాగంలోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలి. 

ఏడాది పొడవునా.. 

పుట్టగొడుగుల సాగుకు కాలంతో పని లేదు. ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. అయితే చలికాలంలో ఉష్ణోగ్రతలను పెంచేందుకు, వేసవిలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటే సరిపోతుంది. తొలిదశలో భాగంగా బ్యాగులన్నింటినీ ఒకేసారి కాకుండా, కొన్ని రోజుల వ్యవధిలో ప్యాకింగ్‌ చేసుకుంటూ పోవాలి. దీనివల్ల కొన్ని కొన్ని బ్యాగుల నుంచి దశల వారీగా దిగుబడి చేతికొస్తుంది. ఫలితంగా ఏడాది పాటు ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా మొత్తం పంట ఒకేసారి చేతికొస్తే మార్కెటింగ్‌కు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. 

స్థిరమైన ఆదాయం

పుట్టగొడుగుల సాగులో రైతులకు మంచి ఉత్పత్తితోపాటు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. కేజీ విత్తనాలతో ఆరు బ్యాగులను తయారు చేయొచ్చు. విత్తనాలు, గడ్డి, మట్టి, ఇతర ఖర్చులు కలిపితే ఒక్కో బ్యాగుకు రూ. 40 నుంచి రూ.50 దాకా ఖర్చవుతుంది. అంటే ఆరు బ్యాగులకు రూ. 250 నుంచి రూ.300 వరకు ఖర్చవుతుంది. కేజీ పాల పుట్టగొడుగులు హోల్‌సేల్‌గా కనీసం రూ.200 ధర పలుకుతుంది. ఒక్కో బ్యాగు ద్వారా కనీసం కేజీ పుట్టగొడుగులు ఉత్పత్తి అవుతాయి. ఆరు బ్యాగులకు రూ.1200 ఆదాయం సమకూరితే, పెట్టుబడి ఖర్చులు రూ. 300 నుంచి రూ.400 తీసేసినా, రైతుకు సులువుగా రూ. 800 నుంచి రూ.900 వరకు మిగులుతుంది. ఇది హోల్‌సేల్‌గా విక్రయిస్తేనే. రైతు కొంచెం కష్టపడి, రిటైల్‌గా అమ్ముకుంటే కేజీ రూ.300 నుంచి రూ.350 వరకు ధర వస్తుంది. ఇలా తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో సులువుగా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది. పెట్టుబడికూడా తొలిసారి రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు అవుతుంది. తర్వాత విత్తనాలు, గడ్డి కొనుగోలుకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

భారీ డిమాండ్‌

పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో దీని వాడకం ఎక్కువగా ఉంది. అయితే, డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి లేకపోవడంతో ధర భారీగా పలుకుతున్నది. సూపర్‌ మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ సంస్థలు వీటిని రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేస్తున్నాయి. అదే విధంగా రైతులు సొంతంగానూ విక్రయించుకోవచ్చు. తమ ఉత్పత్తుల గురించి సోషల్‌ మీడియా ద్వారా, బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం చేసుకుంటే, రెగ్యులర్‌ కస్టమర్లు ఏర్పడే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో పండిస్తే ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి చేసుకునే వీలుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ర్టాల నుంచి పుట్ట గొడుగులను దిగుమతి చేసుకుంటున్నాయి. 

మహిళలకు మంచి ఉపాధి

పుట్టగొడుగుల పెంపకం మహిళలకు మంచి ఉపాధిని కల్పిస్తుంది. పుట్టగొడుగుల పెంపకంపై రాజేంద్రనగర్‌ వ్యవసాయ వర్సిటీలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. విత్తనాలను  అందించడంతోపాటు సాగులో మెళకువలను నేర్పిస్తున్నారు. మార్కెటింగ్‌పైనా అవగాహన కల్పిస్తున్నారు. 

బెడ్ల తయారీ

బెడ్ల తయారీకి 12x8 లేదా 14x24 అంగుళాల పాలిథిన్‌ కవర్లను ఎంచుకోవాలి. వీటిని ఒకవైపు రబ్బరుతో ముడివేయాలి. ఆ తర్వాత ఉడికించి ఆరబెట్టిన గడ్డి, స్పాన్‌(విత్తనాలు) తీసుకొని, వరుసల క్రమంలో అమర్చాలి. ప్రతి వరుసలో 5 సెం.మీ.ల వరకు గడ్డిని ఉంచాలి. మొదటగా గడ్డిని అమర్చి, దానిపై మధ్యభాగంలో విత్తనాలను చల్లాలి. ఇలా ఒక కవర్‌లో ఎనిమిది లేయర్లను వేసుకోవాలి. ఆ తర్వాత కవర్‌ పైభాగాన్ని కూడా రబ్బరుతో ముడివేయాలి. ఈ మొత్తం కవర్‌కు 15 నుంచి 20 వరకూ చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. 

మూడు పంటలూ..

బ్యాగులను వెలుతురు గదిలోకి మార్చిన 10 రోజులకు పుట్టగొడుగుల మొక్కలు కనిపిస్తాయి. 20 రోజుల్లో పూర్తిగా పెరుగుతాయి. అంటే మొత్తంగా 40 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ఈ బ్యాగ్‌ సుమారు 60 నుంచి 70 రోజుల వరకు ఉంటుంది. మొలిచిన పుట్టగొడుగులను తెంపిన కొద్దీ మళ్లీ మొలకెత్తుతాయి. ఈ విధంగా ఒక బ్యాగు నుంచి మూడు పంటలు తీసుకోవచ్చు. పుట్టగొడుగులను జాగ్రత్తగా తెంపి, ముక్కలు చేసి ప్యాకింగ్‌ చేయాలి. 

మంచి ఆదాయం

పుట్టగొడుగుల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నాను. హైదరాబాద్‌తోపాటు కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నాను. నన్ను చూసి ఎంతోమంది రైతులు వీటి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. వారందరికీ అవసరమైన శిక్షణ ఇస్తున్నాను. అయితే,  తెలంగాణలో తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతున్నది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి, పుట్టగొడుగుల సాగును విస్తరించాలి. వీటి పెంపకంలో సలహాలు, సూచనలు కావాలనుకునే వారు 9505622897 నంబరుకు ఫోన్‌ చేయవచ్చు. 

- మైత్రి ఓంకార్‌, నల్గొండ

శిక్షణ ఇస్తున్నాం

రాష్ట్రంలో పుట్టగొడుగుల పెంపకం మంచి ఆదాయ వనరుగా ఉంది. అందుకే వీటి సాగుపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే సరైన అవగాహన లేకపోవడంతో ముందుకు వెళ్లడం లేదు. అందుకోసమే వ్యవసాయ వర్సిటీలో పుట్టగొడుగుల పెంపకానికి అవసరమైన శిక్షణను అందిస్తున్నాం. రైతులు మోసపోకుండా, నాణ్యమైన విత్తనాలను కూడా మేమే సరఫరా చేస్తున్నాం. 

- డా. ప్రమీల, వ్యవసాయ వర్సిటీ ,శిక్షణ కేంద్రం అధికారి