ఆదివారం 07 మార్చి 2021
Agriculture - Nov 12, 2020 , 01:02:23

కూలీకి కైకిలి

కూలీకి కైకిలి

కూలీలకు చేతినిండా పని దొరికేలా.. కర్షకులకు ‘కైకిలి’ కష్టాలు దూరమయ్యేలా.. రాష్ట్ర సర్కారు మరో ముందడుగు వేసింది. ‘ఉపాధి హామీ’ పథకాన్ని వ్యవ‘సాయానికి’ అనుసంధానం చేసి, అన్నదాతకు అండగా నిలిచింది. చెరువులు, కాలువల తవ్వకాలకే పరిమితమైన కూలీలను పొలాలకు తరలిస్తూ, 

సాగులో సాయం అందిస్తున్నది. ఫలితంగా, రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న ‘కూలీల కొరత’కు చెక్‌ పడనున్నది. ‘ఉపాధి కూలీ’లకూ చేతినిండా పని దొరకనున్నది. ఇప్పటికే అనేక పథకాలతో వ్యవసాయం పండుగలా మారింది. ఇప్పుడు ‘ఉపాధి హామీ’ అనుసంధానంతో రైతులకు మరింత ప్రయోజనం చేకూరనున్నది. 

వ్యవసాయానికి ఉపాధి

‘ఉపాధి హామీ పథకం’ అనగానే కూలీలంతా పొద్దున్నే పలుగూ పార పట్టుకొని వెళ్లడం, అధికారులు చెప్పిన పనులు చేయడం, రోజు కూలి తీసుకోవడం.. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది ఇదే. కానీ, మన రాష్ట్రంలో మాత్రం ‘ఉపాధి’కి సరికొత్త నిర్వచనం చెబుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా వ్యవసాయానికి ‘ఉపాధి హామీ’ పథకాన్ని అనుసంధానం చేసింది. చెలుకలు, గుట్టల నుంచి ఉపాధి కూలీలను రైతు పొలాల్లోకి మళ్లించి, వ్యవసాయ పనులు చేయిస్తున్నది. రైతులకు అవసరమయ్యే పెట్టుబడి ఖర్చును కూడా సబ్సిడీపై ఉపాధి హామీద్వారా అందిస్తున్నది. దీంతో రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు కూలీల సమస్యా తీరుతున్నది. 

రైతులకు వ్యవసాయంలో అండగా నిలిచేది కూలీలే. అవసరమైన కూలీలను తనే కూలి డబ్బులు ఇచ్చి, తెచ్చుకోవాలి. గతంలో బాగానే ఉన్నా, ఇప్పుడు వ్యవసాయ పనులు చేసేందుకు కూలీలు దొరకడం లేదు. దీంతో పక్క గ్రామాల నుంచి ఆటో కిరాయిలు ఇచ్చి మరీ, తెప్పించుకోవాల్సి వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ ఆలోచనతో ఇప్పుడు ఆ కష్టాలన్నీ దూరం అవుతున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో వందల సంఖ్యలో ఉపాధి కూలీలు రైతుల పొలాల్లోకి మళ్లారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్‌ పామ్‌ తోటలు, కోళ్లు, మేకల షెడ్ల నిర్మాణం..  ఇలా ఏ పంట వేయాలన్నా, ఏ పని చేపట్టినా అందులో భాగస్వాములవుతున్నారు. అధికారులే కూలీలను తీసుకొచ్చి, రైతుకు కావాల్సిన పని చేయిస్తారు. తద్వారా రైతుకు కూలీల సమస్య తప్పడంతోపాటు పెట్టుబడి ఖర్చు కూడా మిగులుతున్నది. 

పెట్టుబడి భారం తగ్గింపు

పంట ఏదైనా పెట్టుబడి తప్పదు. ఇప్పటికే రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మరో వినూత్న ఆలోచన చేసింది. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పలు వ్యవసాయ పనులు, పంటల సాగుకు ఉపాధి హామీ ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నది. కొన్ని పనులనైతే రైతుకు పైసా ఖర్చు లేకుండా, ఉపాధి హామీలో భాగంగానే పూర్తి చేయిస్తున్నది. దీంతో రైతుకు పెట్టుబడిని మిగల్చడమే కాకుండా వారిలో భరోసా కల్పిస్తున్నది. 

ఓ రైతు తన పశువుల కోసం షెడ్డును నిర్మించాలనుకున్నాడు. మరో రైతు మామిడి తోట.. ఇంకో రైతు శ్రీగంధం చెట్లను పెంచాలనుకున్నాడు. సాధారణంగా పశువుల షెడ్డు నిర్మాణ ఖర్చును రైతే భరించాలి. మామిడి తోట, శ్రీగంధం సాగులో మొక్కల కొనుగోలు మొదలు దుక్కి దున్నడం, గుంతలు తీయడం, ఎరువులు, డ్రిప్‌ ఇలా అన్నింటికీ రైతే పెట్టుబడి సమకూర్చుకోవాలి. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. రైతు నామమాత్రంగా పెట్టుబడి పెడితే చాలు. మెజార్టీ ఖర్చును ఉపాధి హామీద్వారా ప్రభుత్వమే అందించనున్నది. పంటల సాగులోని ప్రతి పనిలోనూ సబ్సిడీ అందిస్తున్నది. కొన్ని పనులు నేరుగా ‘ఉపాధి హామీ’ద్వారా చేపడుతుంటే, మరికొన్ని పనులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. మొక్కల కొనుగోలు మొదలుకొని పంటలకు అవసరమయ్యే ఎరువుల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. కొన్ని రకాల పంటలకైతే రెండు నుంచి మూడేండ్లదాకా సాగుకు అవసరమయ్యే ఖర్చును, ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుండటం విశేషం. మొక్కల నిర్వహణ కోసం ప్రతినెలా రైతుఖాతాలో డబ్బులు కూడా జమ చేస్తున్నది. 

ఒక్కో పంటకూ ఒక్కోలా.. 

అనేక పంటలు, నిర్మాణాలకు ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా సబ్సిడీ మంజూరు చేస్తున్నది. ఒక్కో రకమైన పంటకు ఒక్కో రకంగా సబ్సిడీ అందిస్తున్నది. ఉపాధి హామీలో భాగంగా సాగు పనులు చేయించుకొనే ఒక్కో రైతు, గరిష్ఠంగా రూ.1.2 లక్షల వరకు లబ్ధి పొందే అవకాశం ఉన్నది. పందిరి పద్ధతిలో కూరగాయలు సాగు చేయాలనుకుంటే ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఎకరానికి రూ.లక్ష దాకా సబ్సిడీ అందిస్తుంది. ఒకవేళ రూ.లక్షకు మించి ఖర్చు అయితే, దాన్ని రైతే భరించుకోవాల్సి ఉంటుంది. ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో 26 రకాల పంటలు, పలు కార్యక్రమాల నిర్వహణను ఉపాధి హామీద్వారా చేపట్టి, రైతులకు నేరుగా ప్రయోజనం కల్పిస్తున్నారు. సంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల వైపు దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయిల్‌పామ్‌, శ్రీగంధం, మలబార్‌ వేప, బత్తాయిలాంటి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. 

వాణిజ్య పంటల వైపు!

ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతులను సంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటలవైపు మళ్లించే అవకాశం ఉంటుంది. ఉపాధి హామీలో భాగంగా సబ్సిడీ దక్కేది ఎక్కువగా వాణిజ్య పంటలకే. రైతులు కూడా ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుందనే ఉద్దేశంతోనే వాణిజ్య పంటలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ ఆలోచనతో రైతులకు పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గిపోనున్నది. ముఖ్యంగా ఉపాధి హామీలో భాగంగా ఆయిల్‌ పామ్‌ తోటలు, ఆగ్రో ఫారెస్ట్రీ (శ్రీగంధం, టేకు, మలబార్‌ వేప, సర్వే వెదురు సాగు), జీడి మామిడి,  మామిడి, జామ, నిమ్మ, కొబ్బరి, మునగ, నేరేడు, సీతాఫలం, సపోట, బత్తాయి, కూరగాయ పందిర్లు, ట్రెల్లీస్‌ పద్ధతిలో కూరగాయల సాగు వంటి వాణిజ్య పంటలకు భారీగా సబ్సిడీ అందిస్తున్నది. దీంతో అనేకమంది రైతులు వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది.

పథకం అమలుకు అర్హతలు 

ఉపాధిహామీలో భాగంగా పంటల సాగుకు సబ్సిడీ పొందాలంటే సదరు రైతుకు ముందుగా ఉపాధి హామీ జాబ్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దీని ద్వారానే రైతుకు ఈ పథకాన్ని అమలు చేస్తారు. అదేవిధంగా రైతుకు ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండొద్దు. ఒకవేళ ఉంటే ఈ పథకం వర్తించదు. అయితే ఎస్సీ, ఎస్టీ రైతులకు మాత్రం గరిష్ఠ భూ నిబంధనలు ఏమీ లేవు. వారికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, 100శాతం సబ్సిడీ లభిస్తుంది. 

ఎవరిని కలవాలి.. ఎలా పొందాలి?

ఉపాధిహామీలో భాగంగా పంటలకు సబ్సిడీ పొందాలనుకునే రైతులు మొదటగా వారి గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ఏ పంట సాగు చేయాలనుకుంటున్నారో ఆ వివరాలు చెప్పాలి. ఒకవేళ గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద సరైన వివరాలు లభించని పక్షంలో, రైతే నేరుగా సాగు చేసే పంటల రకాన్నిబట్టి మండల వ్యవసాయ అధికారిని, ఉద్యానవన శాఖ అధికారిని లేదా ఉపాధి హామీ అధికారిని కలువాలి. వారు రైతుకు అన్ని విధాలా సహకరిస్తారు. పంటలు ఏ విధంగా సాగు చేయాలి? సబ్సిడీ ఏ విధంగా వస్తుంది? ఎంత వస్తుంది? అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. 

VIDEOS

logo