గురువారం 03 డిసెంబర్ 2020
Agriculture - Nov 05, 2020 , 00:15:00

సీతాఫలం.. తీయని ఫలితం

సీతాఫలం.. తీయని ఫలితం

పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ  * సాగు సులభం.. దిగుబడి దీర్ఘకాలికం సంప్రదాయ పంటలతో నష్టపోతున్న రైతులు, క్రమంగా సీతాఫలాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మెట్ట భూములు, నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడితోపాటు మార్కెటింగ్‌కు కూడా ఎలాంటి ఇబ్బందీ లేకపోవడం రైతులకు కలిసి వస్తున్నది. 

‘ఎన్‌ఎంకే, సూపర్‌ గోల్డెన్‌'కు డిమాండ్‌

తెలంగాణలో గత కొన్నేండ్లుగా బాలానగర్‌ రకానికి చెందిన సీతాఫలాలనే ఎక్కువగా సాగు చేసేవారు. ప్రస్తుతం వినియోగదారుల అభిరుచి, మార్కెట్‌ను బట్టి నూతన రకాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఎన్‌ఎంకే-1(నవనాడ్‌ మల్లారి కస్పటే), సూపర్‌ గోల్డెన్‌ రకాలకు మంచి డిమాండ్‌ ఉన్నది. ఎందుకంటే, బాలానగర్‌ రకానితో పోలిస్తే, ఎన్‌ఎంకే-1, సూపర్‌ గోల్డెన్‌ రకాల్లో దిగుబడి అధికం. పండ్ల సైజు పెద్దగా ఉండటంతోపాటు గింజలు తక్కువ.. గుజ్జు ఎక్కువ. అంతేకాకుండా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా అనేక ప్రత్యేకతలున్న ఎన్‌ఎంకే-1, సూపర్‌ గోల్డెన్‌ రకాలను సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. బాలానగర్‌ రకంలో అక్టోబర్‌, నవంబర్‌ నెలలతో దిగుబడి ముగుస్తుంది. కానీ, ఈ రెండు రకాల విషయంలో మాత్రం నవంబర్‌ నుంచి జనవరి వరకు పంట చేతికొస్తూనే ఉంటుంది. మార్కెట్లో ఇతర పండ్లు ఎక్కువగా దొరకని సమయం అది. దీంతో సీతాఫలాలకు డిమాండ్‌ పెరిగి, ధర బాగా పలుకుతుంది. 

ఏ నేలైనా ఓకే

సీతాఫలం సాగుకు చౌడు భూములు తప్ప, ఏ రకం నేలలైనా అనుకూలమే. ఎక్కువ నీళ్లు అవసరం లేదు. మొక్కలు నాటిన తొలి రెండేండ్లపాటు వారానికి రెండుసార్లు నీళ్లు అందించాలి. తర్వాత రెండు వారాలకు ఒకసారి పెట్టినా సరిపోతుంది. అయితే క్రాప్‌ ముగిసిన తర్వాత నీళ్లు ఆపేయాలి. దీనివల్ల చెట్టు బలపడి శక్తిమంతంగా తయారవుతుంది. పాత ఆకులు రాలిపోయి కొత్తవి వస్తాయి. ఈ సమయంలో మళ్లీ నీళ్లు పెట్టాలి. 

ఎకరానికి 300 మొక్కలు

మొక్కలు నాటే సమయంలోనే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం ఆరు నెలల వయస్సుగల మొక్కలను ఎంపిక చేసుకోవాలి. ముందే దుక్కిని మూడు నాలుగు సార్లు కలియ దున్నుకోవాలి. ఒక్కో ఎకరంలో 300 దాకా నాటుకోవచ్చు. ఒక్కో మొక్క మధ్య 8 అడుగులు, కాలువల మధ్య 16 అడుగుల దూరం ఉండేలా, అడుగు నుంచి రెండు అడుగుల లోతు గుంతలు తీసుకోవాలి. వీటిలో సేంద్రియ ఎరువులను నింపుకొని, మొక్కలను నాటుకుంటే, ఎదుగుదల బాగుంటుంది. ఇక మొక్కలు నాటేందుకు ఏ కాలమైనా అనుకూలమే. అయితే, జూన్‌ నెలలో నాటుకుంటే వర్షాలకు మొక్కలు సులువుగా పెరుగుతాయి. 

కత్తిరించాల్సిందే

సీతాఫలం సాగులో క్రోనింగ్‌ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. మొక్క నాటిన రెండు నెలల్లో పైనుంచి రెండు అడుగుల వరకూ ఉన్న కొమ్మల్ని కత్తిరించి, చెట్టు మొత్తం గొడుగు ఆకారంలోకి వచ్చేలా చేయాలి. దీనివల్ల వల్ల చెట్టుకు ఎక్కువ కొమ్మలు వచ్చి, దిగుబడి పెరుగుతుంది. లేకుంటే చెట్టు నిటారుగా పెరిగి, తక్కువ కాయలు కాస్తుంది. ఒక్కో చెట్టుకు గరిష్టంగా 120 కొమ్మలు వచ్చేలా చేసుకోవాలి. ఏటా తొలకరి తర్వాత, చెట్లు చిగురించే దశలో క్రోనింగ్‌  చేపట్టాల్సి ఉంటుంది.

నవంబరు నుంచి జనవరి దాకా

అడవులు, గుట్టల్లో లభించే సీతాఫలాలతోపాటు బాలానగర్‌ రకాల దిగుబడి అక్టోబర్‌, నవంబర్‌తో ముగుస్తుంది. కానీ, ఎన్‌ఎంకే-1, సూపర్‌ గోల్డెన్‌ సీతాఫలాల్లో మాత్రం నవంబర్‌ నుంచి దిగుబడి మొదలవుతుంది. జనవరి దాకా పండ్లు చేతికి వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో మార్కెట్లో తక్కువ పండ్ల రకాలు దొరుకుతాయి. ఈ నేపథ్యంలో సీతాఫలానికి డిమాండ్‌ భారీగా ఉంటుంది.  ధర కూడా ఎక్కువగా పెరుగుతుంది. సాధారణ సమయంలో కేజీ రూ.100 ఉంటే డిసెంబర్‌, జనవరిలో కేజీ రూ.150 నుంచి రూ.300 దాకా పలుకుతుంది. దీంతో రైతుకు మరింత లాభం చేకూరుతుంది.

15 ఏండ్ల నుంచి..

మా స్వస్థలం సూర్యాపేట. మహారాష్ట్రలో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని, సూపర్‌ గోల్డెన్‌ సీతాఫలం సాగు చేస్తున్నాను. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఇతర రకాలతో పోలిస్తే సూపర్‌ గోల్డెన్‌ రకంలో పెద్ద సైజు కాయలు, తక్కువ గింజలు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటం.. లాంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఇతర రాష్ర్టాలు, దేశాలకు పండ్లను సరఫరా చేస్తున్నాను. మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. సీతాఫలం సాగు వల్ల రైతులకు లాభాలే తప్ప, నష్టమనే మాట ఉండదు. ఆసక్తిగల రైతులు వివరాల కోసం 9849212013 

 నంబర్‌లో సంప్రదించవచ్చు. 

- కుడుముల మధు

 రైతు, సూర్యాపేట

రూ.లక్షల్లో ఆదాయం

సీతాఫలానికి బహిరంగ మార్కెట్లో భారీ డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో రైతు ఆశించిన దానికన్నా ఎక్కువగానే ఆదాయం వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ సీతాఫలం ధర రూ.100 దాకా పలుకుతున్నది. ఈ లెక్కన ఎకరానికి 10 టన్నుల దిగుబడి వచ్చినా, సగటున రూ.10లక్షల ఆదాయం వస్తుంది. పెట్టుబడి ఖర్చు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలు తీసేసినా రైతుకు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల ఆదాయం మిగులుతుంది. ఒకవేళ మార్కెట్లో సీతాఫలానికి డిమాండ్‌ పడిపోయి కేజీ రూ.50 పలికినా కనీసంగా రూ.5లక్షల ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోను కనీసం రూ.3 లక్షల దాకా మిగులుతుంది. 

30 ఏండ్ల దాకా

సీతాఫలం దీర్ఘకాలిక పంట. ఒకసారి నాటితే గరిష్టంగా 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలు నాటిన మూడేండ్ల నుంచి కాత మొదలైనా, ఐదేండ్ల తర్వాతే పూర్తిస్థాయిలో దిగుబడి ప్రారంభమవుతుంది. మొదట్లో పండ్లు తక్కువగానే వచ్చినా, చెట్ల వయస్సు పెరుగుతున్న కొద్దీ, దిగుబడి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఇతర పండ్ల తోటలతో పోలిస్తే, సీతాఫలం పంటలో  దిగుబడి అధికం. తొలిఏడాది 1.5 టన్నుల నుంచి 2 టన్నుల వరకు పండ్లు చేతికి వస్తాయి. ఐదేండ్ల తోటలో ఎకరానికి కనీసంగా 10 నుంచి 12 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. ఒకవేళ ఎకరంలో 300కంటే ఎక్కువ మొక్కలు నాటుకుని, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి మరింత పెరుగుతుంది. అయితే ఏటా రైతుకు కనీసంగా 10 టన్నుల పంట పక్కాగా చేతికి వస్తుంది. 

అంతర పంటలతోనూ..

సీతాఫలం సాగులో కాలువల మధ్య ఎక్కువ దూరం పాటించాల్సి ఉంటుంది. ఈ ఖాళీ స్థలంలో మొదటి మూడేండ్ల వరకు అంతర పంటలను సాగు చేసుకునే అవకాశమున్నది. వేరుశెనగ, ఉల్లి, మినుము, పెసరలాంటి పంటలను సాగు చేసుకుంటే రైతులకు అదనపు అదాయం సమకూరుతుంది. ఇక మూడేండ్ల నుంచి సీతాఫలం పంట చేతికొస్తుంది. దీంతో రైతుకు ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు.  

తక్కువ పెట్టుబడి 

ఇతర పంటల మాదిరిగా కాకుండా సీతాఫలం సాగుకు పెట్టుబడి చాలా తక్కువ. తొలి ఏడాది ఎకరానికి రూ.70వేల నుంచి రూ.90వేల వరకు ఖర్చు వస్తుంది. మొక్కల కొనుగోలు, డ్రిప్‌ సిస్టం కోసమే గరిష్టంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో మొక్క ఖరీదు రూ. 50 నుంచి రూ.70 వరకు పలుకుతుంది. అంటే, ఎకరానికి అవసరమయ్యే 300 మొక్కల కొనుగోలుకు రూ.15వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చవుతుంది. డ్రిప్‌ కోసం రూ.30వేలు, ఎరువులు, గుంతలు తీసేందుకు రూ.20వేలు అవుతుంది. ఇతర ఖర్చులను కలిపినా తొలి ఏడాది పెట్టుబడి రూ.90వేలకు మించదు. ఆ తర్వాత ఏటా కూలీలు, ఎరువుల కోసం రూ. 30వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

తోట వద్దే కొనుగోళ్లు

సీతాఫలాలు సాగు చేసే రైతులకు మార్కెటింగ్‌  కూడా సులువే. హోల్‌సేల్‌ వ్యాపారులు రైతుల తోట వద్దకే వచ్చి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. లేదంటే రైతే స్వయంగా దగ్గర్లోని మార్కెట్‌కు తరలిస్తే, భారీగా లాభాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్కెటింగ్‌పై పూర్తి అవగాహన ఉంటే ముంబై, పుణె, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలకు, విదేశాలకు కూడా ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇతర రకాలతో పోలిస్తే, ఎన్‌ఎంకే-1, సూపర్‌ గోల్డెన్‌ సీతాఫలాలు వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. దీంతో, ఈ రకాలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా దూర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చు. 

రెండెకరాల్లో నా తోట

స్నేహితుల ద్వారా సీతాఫలం సాగు గురించి తెలుసుకున్నా. ప్రస్తుతం రెండెకరాల్లో మొక్కలు నాటాను. ఎన్‌ఎంకే-1 రకం సాగు చేస్తున్నా. రెండుసార్లు మహారాష్ట్రకు వెళ్లి, అక్కడి పంట సాగు, దిగుబడిని పరిశీలించిన తర్వాతే సాగులోకి దిగాను. అక్కడి నుంచే మొక్కలు కొనుగోలు చేశా. ప్రస్తుతం మొక్కలు మంచిగానే ఎదిగాయి. వచ్చే ఏడాది దిగుబడి ప్రారంభం అవుతుంది. పెట్టుబడి కూడా తక్కువగానే ఉంది కాబట్టి, ఇబ్బందులేమీ ఎదురుకాలేదు. 

- జీవన్‌రెడ్డి, రైతు, సిద్దిపేట జిల్లా