గురువారం 03 డిసెంబర్ 2020
Agriculture - Oct 22, 2020 , 01:25:59

బండలను పిండి చేసి

బండలను పిండి చేసి

  • కొండప్రాంతంలో పండ్ల మొక్కల పెంపకం
  • ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు ఓ యువరైతు. కొండ ప్రాంతాన్నే వ్యవసాయ క్షేత్రంగా మలుచుకొని, నోరూరించే పండ్ల మొక్కలను పెంచుతున్నాడు. బండల మధ్యే మధుర ఫలాలను పండిస్తున్నాడు. తక్కువ నీరు, అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతున్నాడు. 

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన పెండెం సురేందర్‌ బతుకు దెరువు కోసంసూరత్‌ వెళ్లాడు. 33 ఏండ్ల పాటు అక్కడే సాంచాలు నడిపాడు. వ్యవసాయంపై మక్కువతోనూ, తన నలుగురు పిల్లల చదువుల కోసమూ.. 12 ఏండ్ల క్రితం ఇంటి బాటపట్టాడు. ఆ సమయంలో ఎక్కడ చూసినా కరువు తాండవించేది. తనపొలం మొత్తం బీడుగా మారింది. ఊరంతా కరువుతో కటకటలాడినా, నర్సింహులపేట వేంకటేశ్వరస్వామి గుట్టపై ఉన్న మొక్కలు మాత్రం సురేందర్‌కు ఎప్పుడూ పచ్చగా కనిపించేవి. వాటిని స్ఫూర్తిగా తీసుకొని, పొలం పక్కనే ఎకరం, 22 గుంటల్లో ఉన్న బండల (బోడు) భూమిలో పండ్ల మొక్కలు నాటాలని సంకల్పించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా గుంతలు తీయడం మొదలు పెట్టాడు. బండలను పిండి చేశాడు. భార్య నర్సమ్మతో కలిసి రోజుకు మూడు చొప్పున 80 గుంతలు తీశాడు. బండలపై మొక్కలను ఎలా బతికిస్తావని చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేసినా, మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగాడు. గ్రామస్థులైన గండి సురేశ్‌, మంద సత్యం మామిడి మొక్కలను అందించారు. ఎటూ చూసినా చుక్క నీరు దొరకని పరిస్థితి. అయితే, నర్సింహులపేట వాసులకు తాగునీరు అందించేందుకు గ్రామానికి సుమారు  ఒకటిన్నర కిలోమీటరు దూరంలో అధికారులు ఒక బావిని తవ్వించారు.


పైప్‌లైన్లకు అక్కడక్కడా ఎయిర్‌ వాల్వ్‌ను ఏర్పాటు చేశారు. దాని ద్వారా లీకయ్యే నీటిని, సురేందర్‌తోపాటు భార్య నర్సమ్మ బిందెలతో తీసుకొచ్చి మొక్కలకు పోసేవాళ్లు. కొన్ని ఎండిపోయినా నిరాశపడలేదు. వాటి స్థానంలో సపోటా, దానిమ్మ, జామ మొక్కలను నాటారు. గుట్టను సుందరవనంగా తీర్చిదిద్దారు. చుట్టూ ముళ్ల కంపతో కంచె ఏర్పాటు చేశారు. అక్కడే ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసుకొని, ఉదయం నుంచి సాయంత్రం దాకా చెట్లకు కాపలా ఉంటున్నారు. దీంతోపాటు నాటు కోళ్లను కూడా పెంచుతున్నారు. కంచె చుట్టూ కాకర, బీర, ఆనిగపుకాయ తదితర తీగజాతి కూరగాయలను పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ ఏడాది ఏకంగా పది క్వింటాళ్ల దాకా మామిడి కాయలు అమ్మారు. ఇటీవలే పొలంలో బోరు వేసి, అందులోంచి కొద్దికొద్దిగా వస్తున్న నీటితో మామిడి తోటను సంరక్షిస్తున్నారు. ఇందుకోసం గుట్టపైనే సిమెంటు రింగులతో ఓ ట్యాంక్‌ కూడా నిర్మించారు. వ్యవసాయం చేయాలన్న మక్కువకొద్దీ గుట్టపైనే పసిడి పంటలను పండిస్తున్నారు. 

మక్కువతో మొక్కలు నాటాను

నిరుపేద కుటుంబంలో పుట్టి బతుకు దెరువు కోసం సూరత్‌ వెళ్లాను. కొద్ది కాలం తరువాత నలుగురు పిల్లలను చదివించేందుకు సొంతూరికి వచ్చాను. వ్యవసాయంపై మక్కువతో గుట్టపై మామిడి మొక్కలు నాటాను. ఎంతో కష్టపడి పెంచాను. ఇప్పుడు ఫలితం పొందుతున్నాను. మొక్కలు నాటినప్పుడు ఎగతాళి చేసిన వారే, నన్ను మెచ్చుకుంటున్నారు.

- పెండెం సురేందర్‌

వద్దన్నా వినలేదు

బండల మీద మొక్కలు బతుకుతాయా అని చాలామంది ఎగతాళి చేశారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం అవసరమా అని నా భర్త సురేందర్‌తో నేనూ వాదించాను. అయినా, వినలేదు. ఇద్దరం కలిసి ఆ దేవుడిని నమ్ముకొని బండలను తొలగించాం. మొక్కలను నాటాం. ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా మారి, ఫలాలను అందిస్తున్నాయి. ఇదంతా చూసి, చాలా సంతోషంగా ఉంది. నాటు కోళ్ల పెంపకంతో పాటు కూరగాయలు కూడా పండిస్తున్నాం.

- పెండెం నర్సమ్మ